ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దూసుకొస్తున్న ‘ఫెంగల్‌’

ABN, Publish Date - Nov 30 , 2024 | 04:44 AM

నైరుతి బంగాళాఖాతంలో గురువారం వరకు స్థిరంగా కొనసాగిన తీవ్ర వాయుగుండం శుక్రవారం నాటికి పెను తుఫాన్‌గా మారింది.

మళ్లీ బలపడిన తీవ్ర వాయుగుండం

నేడు పుదుచ్చేరి సమీపంలో తీరం దాటనున్న తుఫాన్‌.. దక్షిణ కోస్తా, సీమ జిల్లాలకు రెడ్‌ ఎలెర్ట్‌

తీరం వెంబడి పెరిగిన గాలుల తీవ్రత.. దక్షిణ కోస్తా తీరంలో అలల ఉధృతి

కృష్ణపట్నం రేవులో ఆరో నంబరు భద్రతా సూచిక.. నేడు, రేపు భారీ వర్ష సూచన

విశాఖపట్నం, అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతంలో గురువారం వరకు స్థిరంగా కొనసాగిన తీవ్ర వాయుగుండం శుక్రవారం నాటికి పెను తుఫాన్‌గా మారింది. పది కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్యంగా పయనిస్తోంది. వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న భారత వాతావరణ శాఖ తుఫాన్‌గా బలపడిందని ప్రకటించింది. ఇది మధ్యాహ్నానికి నాగపట్నానికి తూర్పుగా 260 కి.మీ., చెన్నైకు 300 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. తుఫాన్‌ స్వల్పంగా దిశ మార్చుకుని పశ్చిమ వాయవ్యంగా పయనించి శనివారం మధ్యాహ్నం మహాబలిపురం, కరైకల్‌ మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటుతుంది. ఆ సమయంలో గంటకు 70 నుంచి 80, అప్పుడప్పుడు 90 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

తుఫాన్‌ ఉత్తర తమిళనాడు వైపు దూసుకువస్తున్న నేపథ్యంలో ఉత్తర తమిళనాడు, దానికి ఆనుకుని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు ప్రాంతాలకు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో, శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇంకా అన్నమయ్య జిల్లాలో భారీ నుంచి అతిభారీ, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీవర్షాలు, శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాగా, తుఫాన్‌ ఉత్తర తమిళనాడు తీరం దిశగా వస్తున్నందున కోస్తాలో తీరం వెంబడి గాలుల ఉధృతి పెరిగింది. శనివారం దక్షిణ కోస్తాలో గంటకు 70 నుంచి 80, అప్పుడప్పుడు 90 కి.మీ., ఉత్తర కోస్తాలో 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. ఇంకా.. డిసెంబరు ఒకటి, రెండో తేదీల్లో తీరం వెంబడి గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా తీరంలో అలల ఉధృతి పెరిగింది. తుఫాన్‌ నేపథ్యంలో ఉత్తర తమిళనాడు సమీపంలో ఉన్న కృష్ణపట్నం ఓడరేవులో ఆరో నంబరు ప్రమాద హెచ్చరిక, ఇతర ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు.


లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

‘ఫెంగల్‌’ తుఫాన్‌ ప్రభావంతో శుక్రవారం అన్నమయ్య, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. రాజంపేటలో 21, రణస్థలంలో 18.75, లావేరులో 17, చీపురుపల్లిలో 14.5మిలీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైనట్లు అమరావతిలోని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


చినుకులతో రైతుల్లో ఆందోళన

ధాన్యం కాపాడుకునేందుకు అగచాట్లు

భీమవరం టౌన్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం ‘పశ్చిమ’పై కనిపిస్తోంది. శుక్రవారం ఉదయం వరకు వాతావరణం మబ్బుగా ఉన్నా మధ్యాహ్నం 3 గంటల నుంచి చినుకులు పడటం ప్రారంభించాయి. సాయంత్రానికి ఒక మాదిరి వర్షం కురవటంతో సార్వా ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడిప్పుడే సార్వా కోతలు ఊపందుకుంటున్నాయి. కోత కోసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. మధ్యాహ్నం నుంచి వాతావరణం మారటంతో రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. కొంత మంది రైతులు రైస్‌ మిల్లులకు తరలించే చర్యలు చేపట్టారు. వాతావరణం మారటంతో జిల్లా అధికారులు వ్యవసాయాధికారులను అప్రమత్తం చేశారు. రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. రైస్‌ మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన అన్‌లోడు చేసుకోవాలని మిల్లర్లకు సూచిస్తున్నారు. శనివారం వాతావరణం మారి ఏమైనా వర్షలు పడితే మాత్రం తమకు ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Nov 30 , 2024 | 08:32 AM