ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హే భగవాన్‌!

ABN, Publish Date - Sep 19 , 2024 | 11:58 PM

జిల్లాలో ఇటీవల దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఇప్పటివరకూ ఎవరూ లేని ఇళ్లే లక్ష్యంగా చేసుకొని దొంగలు రెచ్చిపోయేవారు. ఇప్పుడు ఆలయాలపై పడ్డారు. రాత్రివేళల్లో చోరీలకు పాల్పడుతున్నారు.

బాలయోగి ఆశ్రమంలో ఆలయాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

- ఆలయాల్లో వరుస చోరీలు

- ఊరికి దూరంగా ఉన్నవే టార్గెట్‌

- సీసీ కెమెరాల ధ్వంసం

- బంగారం, వెండి ఆభరణాలు అపహరణ

- పోలీసులకు సవాల్‌గా మారిన దొంగలు

(రణస్థలం)

- ఈ ఏడాది ఏప్రిల్‌ 2న వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురంలోని అయ్యప్పస్వామి, శివాలయాల్లో చోరీలు జరిగాయి. ఈ రెండు ఆలయాల్లోనూ సీసీ కెమెరాలు ధ్వంసం చేసి.. విగ్రహాలపై ఉన్న బంగారు, వెండి వస్తువులను దొంగలు అపహరించారు. సుమారు రూ.11 లక్షల వరకూ దోచేశారని అర్చకులు, గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

.................

- ఏప్రిల్‌ 25న ఎచ్చెర్ల మండలం కుంచాలకురమయ్యపేటలోని శ్రీచక్రాలయంలో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి ఆలయం లోపలికి ప్రవేశించిన ఆగంతకులు వంద తులాల వరకూ వెండి వస్తువులను పట్టుకుపోయారు. వాటి విలువ రూ.40 లక్షలు ఉంటాయని పీఠాధిపతి తేజోమూర్తుల బాలభాస్కర శర్మ తెలిపారు. హుండీలను పట్టుకుపోయి సమీప పొలాల్లో పడేశారు. సీసీ కెమెరాలు సైతం ఎత్తుకుపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది.

.................

- జూన్‌ 28న పాతపట్నం వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగింది. విగ్రహాల వద్ద ఉన్న కిలో వెండి సామగ్రితో పాటు హుండిలోని రూ.50 వేల నగదును ఆగంతకులు పట్టుకుపోయారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

.................

- జూలై 16న పాతపట్నం మండలం కాగువాడ త్రిపుర సుందరి దేవి ఆలయంలో దొంగలు పడ్డారు. సీసీ కెమెరాల కనెక్షన్లు తొలగించి లోపలికి ప్రవేశించారు. రెండు హుండీల్లోని నగదుతో పాటు అమ్మవారికి అలంకరించిన బంగారం, వెండి ఆభరణాలను అపహరించారు. మూడు కేజీల వెండి, రూ.50 వేల నగదు పోయిందని పోలీసులకు ఆలయ కమిటీ ఫిర్యాదు చేసింది.

.................

- ఈ నెల 15న ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలోని రంగనాథ ఆలయంలో చోరీ జరిగింది. 7 తులాల బంగారం, మూడు కిలోల వెండి, హుండీలోని రూ.లక్ష రూపాయలను అపహరించుకుపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఊరికి దూరంగా ఉన్న ఈ ఆలయాన్ని గ్రామస్థులు, దాతలు ఇటీవల పునర్నిర్మించారు.

.....................

- ఈ నెల 17న పొందూరు మండలం నందివాడలోని బాలయోగి ఆశ్రమంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి దుండగులు ప్రవేశించారు. రెండు తులాల బంగారు, 8 కిలోల వెండి ఆభరణాలతో పాటు హుండీలో లక్ష రూపాయల నగదు చోరీకి గురైనట్టు ఆశ్రమ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

..........

జిల్లాలో ఇటీవల దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఇప్పటివరకూ ఎవరూ లేని ఇళ్లే లక్ష్యంగా చేసుకొని దొంగలు రెచ్చిపోయేవారు. ఇప్పుడు ఆలయాలపై పడ్డారు. రాత్రివేళల్లో చోరీలకు పాల్పడుతున్నారు. దేవుడి విగ్రహాలపై ఉన్న బంగారం, వెండి ఆభరణాలను దోచుకుపోతున్నారు. హుండీలను పగులగొట్టి నగదుతో పరారవుతున్నారు. జిల్లాలో పురాతన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. భక్తులు ఎంతో నమ్మకంతో, భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. ఇటువంటి చోట్ల నేడు భద్రత కరువైంది. గ్రామాలకు దూరంగా, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే ఆలయాలనే దొంగలు టార్గెట్‌ చేసుకుంటున్నారు. అర్ధరాత్రి వేళ గేట్లు, తలుపులు, హుండీలు పగులకొడుతున్నారు. కొన్నిచోట్ల హుండీలను ఎత్తుకెళ్లి దూరంగా ఉన్న పొలాలు, తోటల్లో పడేస్తున్నారు. దేవదాయ శాఖ, పోలీస్‌ శాఖలు సంయుక్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా.. వాటిని సైతం ధ్వంసం చేస్తున్నారు. తర్వాత దొంగతనం చేసి సొత్తుతో పరారవుతున్నారు.

- నాటి ఘటనతో..

వైసీపీ హయాంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం దేవస్థానంలో విగ్రహాల ధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ఆలయాల భద్రత ప్రశ్నార్థకమైంది. ముప్పేట విమర్శలు రావడంతో అప్పట్లో పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలతో పాటు స్థానికుల ఆధీనంలో ఉండే ఆలయాల్లో సైతం ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు. అయితే అప్పట్లో కొన్నిచోట్ల మాత్రమే ఏర్పాటు చేశారు. జిల్లాలో దేవదాయ శాఖ పరిధిలో 772 దేవాలయాలు ఉన్నాయి. ఈవోల పర్యవేక్షణ ఉన్న దేవాలయాలు 80. మరో 139 ఆలయాల్లో దేవదాయ శాఖ దూపదీప నైవేద్యాలను అందిస్తోంది. అయితే స్థానికుల చేతిలో నడుస్తున్న చాలా దేవాలయాల్లో సీసీ కెమెరాలు అమర్చలేదు. ముఖ్యంగా ఊరికి దూరంగా ఉండే అమ్మవారి ఆలయాలను, కొండపై ఉండే ఆలయాలను దొంగలు టార్గెట్‌ చేస్తుండడం గమనార్హం.

ఇవి చేయడం మంచిది..

- ఆలయాల్లో తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డ్స్‌ను నియమించుకోవాలి

- ఆలయాలను మూసివేసినప్పుడు తాళాలు సక్రమంగా వేశారో లేదో చూసుకోవాలి.

- నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలి. రాత్రి లైట్లు వేసి ఉంచాలి.

- పోలీసుల బీట్‌ బుక్‌ను ఏర్పాటు చేయించుకోవాలి.

- ఆలయ ఆవరణలో పెంపుడు కుక్కలను పెంచుకుంటే చాలా మంచిది.

..........................

అప్రమత్తంగా ఉన్నాం

ఆలయాల్లో వరుస చోరీలు జరుగుతున్న నేపథ్యంలో సిబ్బందిని అప్రమత్తం చేశాం. నిఘా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కూడా చెప్పాం. ఇప్పటికే స్థానికుల చేతుల్లో నడుస్తున్న ఆలయాల్లో కూడా నిఘా కెమెరాలు ఏర్పాటు చేయించాం. చోరీల నియంత్రణతో పాటు విధ్వంస ఘటనలు జరుగకుండా అప్రమత్తంగా ఉన్నాం.

- ప్రసాద్‌ పట్నాయక్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, దేవదాయ శాఖ

..........................

దృష్టి సారించాం

ఆలయాల్లో చోరీల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాం. ఆలయాల్లో చోరీలను అరికట్టేందుకు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి.. జేఆర్‌ పురం సీఐ అవతారం ఆధ్వర్యంలో.. అనుభవం ఉన్న 8మంది పోలీస్‌ అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాం. ఆలయ కమిటీలు, గ్రామపెద్దలతో సమావేశమై.. సలహాలు, సూచనలు అందించాం. అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే 100కు ఫోన్‌ చేయాలని ప్రజలకు సూచించాం.

- వివేకానంద్‌, డీఎస్పీ, శ్రీకాకుళం

Updated Date - Sep 19 , 2024 | 11:58 PM