అచ్చెన్న హ్యాట్రిక్
ABN, Publish Date - Jun 05 , 2024 | 12:29 AM
టెక్కలి టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు హ్యాట్రిక్ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై 34,519 ఓట్ల మెజార్టీతో గెలుపొం దారు.
- టెక్కలిలో 34,519 ఓట్ల మెజార్టీతో గెలుపు
-ఆరోసారి అసెంబ్లీలోకి..
టెక్కలి: టెక్కలి టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు హ్యాట్రిక్ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై 34,519 ఓట్ల మెజార్టీతో గెలుపొం దారు. దీంతో ఆరోసారి అచ్చెన్న అసెంబ్లీకి వెళ్లనున్నారు. హరిశ్చంద్రపురం నియోజ కవర్గం నుంచి మూడుసార్లు, టెక్కలి నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఆయన గెలుపొందారు. 1996లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి 32,171 ఓట్ల మెజార్టీ, 1999లో 38,717 ఓట్లు మెజార్టీ, 2004లో 37,361 ఓట్ల మెజార్టీ సాధించారు. 2009లో నియోజకవర్గ పునర్విభజన నేపథ్యంలో టెక్కలిలో కాంగ్రెస్ అభ్యర్థి డాకర్ కొర్ల రేవతీపతి చేతిలో 1,893 స్వల్ప ఓట్లు తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత ఉప ఎన్నికల్లో 7,173 ఓట్లతో కొర్ల భారతిపై ఓటమి చవిచూశారు. 2014 నుంచి అచ్చెన్నాయుడుకు టెక్కలి నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తూ వస్తున్నారు. 2014లో దువ్వాడపై 8,387 ఓట్లు మెజార్టీ, 2019లో పేడాడ తిలక్‌పై 8,857 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. ఈసారి దువ్వాడ శ్రీనివాస్‌పై 34,519 ఓట్ల తేడాతో అచ్చెన్న విజయం సాధించారు. కాగా.. అచ్చెన్నను నియోజకవర్గంలో తిరగనీయనని, తాట తీస్తానని ఎమ్మెల్సీ దువ్వాడ ఎన్నోసార్లు ప్రగల్భాలు పలుకగా.. చివరకు ఆయనను ఓటర్లు సాగనంపడం గమనార్హం. ఎన్నికల్లో పోటీచేసిన ప్రతిసారి ఓటమిని మూటగట్టుకోవడం దువ్వాడకు పరిపాటిగా మారింది. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినా.. ఈసారీ అదే జరిగింది.
పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీదే పైచేయి
టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3,369 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. వాటిలో టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడుకు 2,140 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు 985, రిజెక్టడ్ 15 ఓట్లు, ఇతరులకు మిగిలిన ఓట్లు పడ్డాయి. ఇక సర్వీస్ ఓట్లకు సంబంధించి అచ్చెన్నాయుడుకు 601, దువ్వాడ శ్రీనివాస్‌కు 221, డాక్టర్ కిల్లి కృపారాణికి 50 ఓట్లు పడ్డాయి.
అండగా కోటబొమ్మాళి, సంతబొమ్మాళి
సంతబొమ్మాళి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు టెక్కలి నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ సాధించడంలో జంట బొమ్మాళులు అండగా నిలిచాయి. ఆరో పర్యాయం అచ్చెన్నాయుడు 34,652 ఓట్ల మెజా ర్టీతో విజయం సాధించగా ఈ మెజార్టీలో కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల నుంచి ఎక్కువగా మెజార్టీ వచ్చింది. ఈ రెండు మండలాల నుంచి 17 వేలకు పైగా మెజార్టీ రెండు సార్లు అందించాయి. అచ్చెన్నాయుడుకు కంచుకోటా చెప్పుకొనే సంతబొమ్మాళి మండ లంలో 12,326 ఓట్ల మెజార్టీ సాధించారు.
ఈ విజయం.. ప్రజలకు అంకితం: అచ్చెన్నాయుడు
‘ఈ విజయం టెక్కలి నియోజకవర్గ ప్రజలకు అంకితం. రాష్ట్రంలో కూటమిగా 160 స్థానాలతో విజయం సాధిస్తామని నేను ముందే చెప్పా. అవే ఫలితాలు నమోదయ్యాయ’ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షు డు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక ఇందిరాగాంధీ కూడలిలో ఆయన టెక్కలి నేలతల్లిని ఉద్వేగభరితంగా ముద్దాడి నమస్కారం పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఐదేళ్ల పాటు నిద్రలేని రాత్రులు గడిపాం. ఓ దుర్మార్గుడు కబంద హస్తాల్లో నలిగిపోయాం. వారి పీడ విరగడయ్యింది. టెక్కలిలో 35వేల మెజార్టీతో గెలిచినా ఈ విజయం నాకు సంతృప్తి నివ్వలేదు. కుటుంబ వ్యవస్థ అంటే గౌరవం, విలువలు లేని వ్యక్తితో ఈ ఎన్నికల్లో పోటీచేశాను. అటువంటి వ్యక్తికి కూడా ప్రజలు కొన్ని ఓట్లు వేయడం బాధ కల్గిస్తోంది. టెక్కలిని మరింత అభివృద్ధి చేస్తా’నని తెలిపారు.
Updated Date - Jun 05 , 2024 | 12:29 AM