పోసానిపై చర్యలు తీసుకోవాలి
ABN, Publish Date - Nov 14 , 2024 | 11:36 PM
సమాజంలో గౌరవ ప్రదమైన వ్యక్తులపై సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ సామాజిక మాధ్యమాల ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కలమట వెంకటరమణ పేర్కొన్నారు.
- శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కలమట డిమాండ్
- పాతపట్నంలో పోలీసులకు ఫిర్యాదు
పాతపట్నం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): సమాజంలో గౌరవ ప్రదమైన వ్యక్తులపై సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ సామాజిక మాధ్యమాల ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కలమట వెంకటరమణ పేర్కొన్నారు. పోసానిపై చర్యలు తీసుకోవాలని గురువారం పాతపట్నం పోలీసుస్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. కలమట మాట్లాడుతూ.. ‘ప్రస్తుత సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఈనాడు, టీవీ-5 అధినేతలపై, టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడుపై సామాజిక మాధ్యమాల్లో పోసాని కృష్ణమురళీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారి హక్కులకు భంగం కలిగించేలా.. దుర్భాషలాడుతూ కుటుంబ సభ్యులను మానసికంగా హింసించేలా వ్యవహరించారు. హింసాత్మక ధోరణిని రెచ్చగొట్టేలా.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఇటువంటి వ్యక్తులను, ప్రోత్సహిస్తున్న వారిని అదుపులోకి తీసుకోవాలి. విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకోవాలి’ అని సీఐ వి.రామారావును కోరారు. సంబంధిత వీడియో క్లిప్పింగ్‌లను అందజేశారు. ఇప్పటికైనా పోసానితోపాటు వైసీపీ నాయకులు దిగజారుడు వ్యాఖ్యలు విడనాడాలని హితవు పలికారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్ రాష్ట్రఉపాధ్యక్షుడు పైల లక్ష్మయ్య, మిరియాబిల్లి బాబూరావు, మెళియాపుట్టి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఉర్లాన వసంత్, పడాల తిరుపతిరావు కర్రి అప్పారావు, తెలుగు యువత అధ్యక్షుడు నల్లి లక్ష్మణ్, బచ్చల వసంత్, కనకల నారాయణ, వట్టి కన్నా రావు పాల్గొన్నారు.
టెక్కలి పోలీస్‌స్టేషన్‌లో..
టెక్కలి: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడుపై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేసిన సినీనటుడు పోసాని కృష్ణమురళీపై చర్యలు తీసుకోవాలని స్థానిక టీడీపీ నేతలు గురువారం రాత్రి టెక్కలి పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఎ.విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోళ్ల లవకుమార్, కామేసు, పోలాకి చంద్రశేఖర్, కోరాడ రాంప్రసాద్, దళిత నాయకులు యడ్ల గోపి ఉన్నారు.
Updated Date - Nov 14 , 2024 | 11:36 PM