శిక్షణ పేరిట దాడి
ABN, Publish Date - Dec 07 , 2024 | 12:40 AM
దేశ రక్షణలో చేరేందుకుగానూ యువతకు సైనిక శిక్షణ పేరిట.. ఓ సంస్థ నిర్వాహకుడు దారుణంగా వ్యవహరించాడు. తప్పు చేశారనే ఉద్దేశంతో.. శిక్షణలో భాగంగా యువతపై తీవ్రంగా దాడి చేసి చితకబాదాడు. దాదాపు ఏడాది కిందట జరిగిన ఈ ఘటన దృశ్యాలు.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
- సామాజిక మాధ్యమాల్లో వైరల్
- ఏడాది కిందట జరిగిన ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి
- డీఎస్పీ వివేకానంద నేతృత్వంలో విచారణ
- పోలీసుల అదుపులో నిర్వాహకుడు
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): దేశ రక్షణలో చేరేందుకుగానూ యువతకు సైనిక శిక్షణ పేరిట.. ఓ సంస్థ నిర్వాహకుడు దారుణంగా వ్యవహరించాడు. తప్పు చేశారనే ఉద్దేశంతో.. శిక్షణలో భాగంగా యువతపై తీవ్రంగా దాడి చేసి చితకబాదాడు. దాదాపు ఏడాది కిందట జరిగిన ఈ ఘటన దృశ్యాలు.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు విచారణ చేపట్టి.. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ‘ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలనుకునే యువతకు శిక్షణ ఇస్తాం. ఉద్యోగావకాశాలు కల్పిస్తామ’ని చెప్పి జలుమూరు మండలం శ్రీముఖలింగానికి చెందిన బీవీ రమణ.. శ్రీకాకుళంలో పదేళ్ల కిందట ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థను నెలకొల్పాడు. తనే శిక్షణ ఇస్తూ.. నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడు. దేశానికి సేవలందించాలన్న లక్ష్యంతో చాలా మంది యువత ఈ సంస్థలో చేరి శిక్షణ పొందుతున్నారు. కాగా.. గతేడాది 2023 డిసెంబర్ 28న ఇచ్ఛాపురం, సంతబొమ్మాళి మండలం ఆర్ .హెచ్.పురం, టెక్కలి మండలం దిమిలాడ, పాతపట్నం ప్రాంతాలకు చెందిన ఐదుగురు యువకులు శిక్షణలో తప్పు చేశారని, వారి వల్ల తన పరువు పోయిందని నిర్వాహకుడు బీవీ రమణ ఉక్రోశం చెందాడు. ఈ క్రమంలో ఆ ఐదుగురినీ అతిక్రూరంగా, అమానుషంగా చితకబాదాడు. దాదాపు ఏడాది తర్వాత ఈ దృశ్యాలు.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు చూసినవారంతా.. శిక్షణ పేరిట ఇంత కిరాతకంగా వ్యవహరించడం దారుణమని ఆరోపిస్తున్నారు. బీవీ రమణ మానసిక పరిస్థితి బాగోలేదని.. ఆయన తీరును విమర్శిస్తున్నారు. కన్నతల్లిదండ్రులే పిల్లలను కొట్టరని.. శిక్షకుడు ఇంత క్రూరంగా ఎలా కొడతారని ప్రశ్నించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలోనూ రమణ ఇదే తరహా దాడులకు పాల్పడ్డాడని అందులో పేర్కొన్నారు. కాగా అప్పట్లో దాడికి గురైన ఓ బాధితుడు.. శుక్రవారం వన్‌టౌన్ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. శిక్షణ పేరిట తమపై నిర్వాహకుడు దాడి చేశాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వన్‌టౌన్ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ తెలిపారు.
- డీఎస్పీ విచారణ...
శిక్షణ పేరుతో యువతపై దాడి చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ ఘటనపై శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద విచారణ చేపట్టారు. గురువారం రాత్రి రమణను విచారణకు పిలిచే ప్రయత్నం చేయగా.. ఆయన అప్పటికే పరారయ్యాడు. రాత్రంతా పోలీసులు ఆయన ఆచూకీ కోసం గాలించారు. శుక్రవారం శిక్షణ కేంద్రానికి వెళ్లి వెతికినా.. సాయంత్రం వరకూ రమణ కనిపించలేదు. ఎవరికీ అందుబాటులోకి రాలేదు. శ్రీకాకుళం సీఐ కె.పైడపునాయుడు కూడా రమణ కోసం గాలించారు. సంస్థలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరిని విచారణ చేయగా.. రమణ పోలీసులకు పట్టుబడ్డాడు. కొన్నేళ్ల కిందట కూడా రమణపై వన్‌టౌన్ స్టేషన్‌లో ఫిర్యాదులు అందాయని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల ఆ సంస్థ మహిళల వసతిగృహంలో సీసీ కెమెరాలు ఉన్నాయన్న సమాచారంతో విచారణ కూడా చేపట్టామని డీఎస్పీ వివేకానంద తెలిపారు.
Updated Date - Dec 07 , 2024 | 12:40 AM