ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అరకొర ‘వసతి’

ABN, Publish Date - Nov 30 , 2024 | 12:05 AM

పేద విద్యార్థుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన వసతిగృహాల్లో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. కనీసస్థాయిలో మౌలిక వసతులు లేక విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో చాలాచోట్ల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

ఇచ్ఛాపురం హాస్టల్‌లో నేలపై నిద్రిస్తున్న విద్యార్థులు

- హాస్టళ్లల్లో మౌలిక సౌకర్యాలు కరువు

- సరిపడా గదులు, మరుగుదొడ్లు లేక అవస్థలు

- తాగునీటి కోసం పాట్లు

- విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

గుజరాతీపేట/ ఇచ్ఛాపురం/ గార/, టెక్కలి/ నరసన్నపేట/ నందిగాం/ ఎల్‌.ఎన్‌.పేట, నవంబరు 29(ఆంధ్రజ్యోతి):

పేద విద్యార్థుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన వసతిగృహాల్లో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. కనీసస్థాయిలో మౌలిక వసతులు లేక విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో చాలాచోట్ల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని భవనాల్లో గదులకు కిటికీలు.. తలుపులు లేవు. విద్యార్థులకు సరిపడా మరుగదొడ్లు, స్నానపుగదులు లేవు. దీంతో విద్యార్థులు ఆరుబయటే స్నానాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే చాలాచోట్ల మంచాలు లేక.. సరిపడా దుప్పట్లు పంపిణీ చేయకపోవడంతో నేలపైనే నిద్రిస్తూ.. చలికి గజగజ వణికిపోతున్నారు.

..........................

జిల్లాలోని ప్రభుత్వ వసతిగృహాల్లో అరకొర వసతులతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో వసతిగృహాలో పరిస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌ చేయగా.. చాలా చోట్ల శిథిల భవనాలు, విరిగిపోయిన కిటికీ తలుపులు దర్శనమిచ్చాయి. సరిపడా గదులు, మంచాలు లేక విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. శ్రీకాకుళంలో బాలురు కళాశాల విద్యార్థులకు సంబంధించిన నాలుగు వసతిగృహాల్లో మౌలిక వసతుల కొరత వెంటాడుతోంది. సరిపడా భవనాలు లేక ఒకే గదిలో వసతితోపాటు రీడింగ్‌ రూమ్‌ను వినియోగించుకుంటున్నారు. వరండాలో స్టడీఅవర్స్‌ నిర్వహిస్తున్నారు. బాత్‌రూమ్‌లు చాలక ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. ఆ ప్రదేశం చుట్టుపక్కల ఖాళీస్థలం కావడంతో దోమల బెడద ఎక్కువగా ఉంది. అలాగే మంచాలు లేక విద్యార్థులు నేలపైనే నిద్రిస్తున్నారు.

- చలికి బిక్కుబిక్కుమని..

ఇచ్ఛాపురం మునిసిపాల్టీ పరిధిలోని రెండు వసతిగృహాల్లో విద్యార్థులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెల్లుపడ కాలనీలోని బీసీ వసతి గృహంలో 36మంది, కొళిగాంలోని బాలుర వసతిగృహంలో 65మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికీ ఒక్కో దుప్పటి ఇచ్చారు. కానీ కింద వేసుకునేందుకు కార్పెట్‌(జంబుకానా) ఇవ్వలేదు. మంచాలు పాడై మూలకు చేరాయి. దీంతో విద్యార్థులు గచ్చుపైనే పడుకుంటున్నారు. ప్రభుత్వం త్వరలో కార్పెట్‌లు పంపిణీ చేయనుందని వార్డెన్‌లు రవికుమార్‌, కాంతారావు తెలిపారు. అలాగే నందిగాం బీసీ వసతిగృహంలో ఆరు నుంచి పదోతరగతి వరకూ 35 మంది విద్యార్థులు ఉన్నారు. మంచాలు లేక వీరంతా నేలపైనే చాపలపై నిద్రిస్తూ చలికి బిక్కుబిక్కుమంటున్నారు.

- కిటికీలకు మెస్‌ల్లేవు..

గార వసతిగృహాంలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. వసతి భవనం కిటీలకు తలుపులు వీరిగిపోగా, మెస్‌ల్లేవు. దీంతో చలికి విద్యార్థులు వణికిపోతున్నారు. నాలుగేళ్ల నుంచి ట్రంకు పెట్టెలు ఇవ్వపోవడంతో విద్యార్థుల పుస్తకాలు ఆరుబయటే ఉంటున్నాయి. అలాగే టెక్కలిలోని ఎస్సీ బాలుర వసతిగృహంలో మూడు నుంచి పదో తరగతి వరకు 44మంది విద్యార్థులు ఉన్నారు. ఒక గదికి కిటికీ తలుపులు చెదలు పట్టి.. ఊడిపోయాయి. దీంతో విద్యార్థులు రాత్రివేళ చలికి తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు.

- గదులు, మురుగుదొడ్లు చాలక..

నరసన్నపేటలోని బాలికలు, బాలురు వసతిగృహాలు అద్దెభవనాల్లో నిర్వహిస్తున్నారు. బాలికల వసతిగృహాంలో సుమారు 250 మంది విద్యార్థినులు ఉండగా కేవలం ఆరు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. కొన్ని సమయాల్లో నీటి కొరత కారణంగా.. విద్యార్థినులు వీధి కుళాయిల నుంచి నీటిని తీసుకెళ్లి స్నానాలకు వినియోగిస్తున్నారు. భోజనాలు రుచిగా ఉండడం లేని విద్యార్థినులు తెలిపారు. గదుల కొరత కారణంగా ఒకే చోట 50 నుంచి 60 మంది నిద్రిస్తున్నామన్నారు. అలాగే బాలుర వసతిగృహాంలో భోజనశాల వద్ద ఇసుక కుప్పలు దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వం కన్నా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నా.. అద్దె భవనాల్లో గదులు చాలక విద్యార్థులు సర్దుకుపోతున్నారు. బాత్‌రూమ్‌లు చాలక ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. కిటికీలకు మెస్‌లు లేకపోవడంతో దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు.

- తాగునీటికి ఇక్కట్లు

లక్ష్మినర్సుపేటలోని ఎస్సీ బాలుర సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహంలో 65మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా తాగునీటి వసతి లేక అవస్థలు పడుతున్నారు. ఇక్కడ మోటారు పాడై సుమారు 8 నెలలు అయినా ఇంతవరకూ బాగుచేయలేదు. వంశధార నీటిని ప్రజలకు అందించేందుకు ఎల్‌.ఎన్‌.పేట వద్ద మెగా రక్షితనీటి పథకాన్ని నిర్మించారు. పైపులైన్‌ ద్వారా ఈ నీటిని బాలుర వసతిగృహానికి కూడా సరఫరా చేస్తున్నారు. రక్షితనీటి పథకం పాడైతే.. తమకు నీటికి ఇబ్బందులు తప్పవని విద్యార్థులు వాపోతున్నారు. వంట గది, భోజనాల గది పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. సరిపడా మరుగుదొడ్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని విచారం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:05 AM