ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇది మంచి ప్రభుత్వం

ABN, Publish Date - Sep 20 , 2024 | 11:44 PM

రాష్ట్రంలోనే అత్యంత తక్కువ తలసరి ఆదాయం గల సిక్కోలు.. గత వైసీపీ పాలనలో అభివృద్ధి పరంగా మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వంద రోజుల్లోనే.. గణనీయమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వంద రోజుల కూటమి పాలనలో చేకూరిన లబిఽ్ధపై నేరుగా లబ్ధిదారులతో మాట్లాడేందుకుగాను సీఎం చంద్రబాబు ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

కవిటి: రాజపురంలో బ్రోచర్‌ ఆవిష్కరిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, గౌతు శిరీష, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

- వంద రోజుల పాలనలో జిల్లాకు ఎంతో మేలు

- అన్ని వర్గాల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లు

- పింఛన్ల మొత్తం పెంపుతో లబ్ధిదారుల్లో ఆనందం

- కూటమి పాలనపై సర్వత్రా హర్షాతిరేకాలు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

రాష్ట్రంలోనే అత్యంత తక్కువ తలసరి ఆదాయం గల సిక్కోలు.. గత వైసీపీ పాలనలో అభివృద్ధి పరంగా మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వంద రోజుల్లోనే.. గణనీయమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వంద రోజుల కూటమి పాలనలో చేకూరిన లబిఽ్ధపై నేరుగా లబ్ధిదారులతో మాట్లాడేందుకుగాను సీఎం చంద్రబాబు ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆరు రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. తొలిరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది. వంద రోజుల పాలనపై కూటమి శ్రేణులు ఆరా తీయగా.. లబ్ధిదారుల నోట.. ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే మాట వినిపించింది. కవిటి మండలం రాజపురంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొనగా.. ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.

- ఆకలి తీర్చిన అన్నక్యాంటీన్లు

జిల్లాలో కూలీలు, చిరుద్యోగులు అధికం. వీరిలో చాలామంది అన్నక్యాంటీన్లలో భోజనం చేసి.. తమ పనులు చూసుకునేవారు. గత వైసీపీ పాలనలో అన్నక్యాంటీన్లు మూసేయడంతో వారంతా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు.. ఇటీవల శ్రీకాకుళంలో రెండు చోట్ల.. పలాసలో ఒక అన్న క్యాంటీన్‌ను పునఃప్రారంభించారు. ప్రతిరోజు వేలాది మంది పేదలు కడుపునిండా భోజనం చేస్తున్నారు. ఆమదాలవలస, ఇచ్ఛాపురంలో క్యాంటీన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వంద రోజుల్లో పేదల ఆకలి తీర్చేందుకు అన్నక్యాంటీన్లను పునరుద్ధరించడంపై జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- ఏప్రిల్‌ నుంచే పింఛన్‌ పెంపు

జిల్లా వ్యాప్తంగా 3,19,702 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్‌ నుంచే అదనంగా రూ.వెయ్యి పెంచుతూ.. ప్రతినెలా ఒకటో తేదీనే సచివాలయ సిబ్బంది పింఛన్లు అందజేస్తున్నారు. వలంటీర్లు లేకపోతే పింఛన్ల పంపిణీ అసాధ్యమనే ఊహాగానాలను పటాపంచలు చేస్తూ.. గంటల వ్యవధిలోనే ప్రక్రియ పూర్తిచేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వ విజయంగా ప్రజలు అభివర్ణిస్తున్నారు. అలానే పింఛన్‌ పెంపుదలపై దివ్యాంగుల్లో మరింత సంతోషం వ్యక్తమవుతోంది.

- ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ ఆనందం

జిల్లాలో గత ఐదేళ్లు.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా 15వ తేదీ వరకు వేతనాలు అందేవి కావు. వారి బ్యాంకు ఖాతాల సిబిల్‌ స్కోరు పడిపోయేది. ఉపాధ్యాయులు, ఇతర శాఖల ఉద్యోగులు బయటకు చెప్పుకోలేని సమస్యలు అనుభవించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. జిల్లాలో ప్రతి నెలా ఒకటో తేదీ నాటికే వారి బ్యాంకు ఖాతాలో జీతం జమవుతోంది. దీంతో ఉద్యోగులు... వైసీపీని తిట్టుకుంటూ.. కూటమి ప్రభుత్వాన్ని కీర్తిస్తున్నారు. ఉద్యోగులను ఇబ్బంది పెడితే ఎలా ఉంటుందో జగన్‌ సర్కారుకు బాగా రుచిచూపించామని కొంతమంది బహిరంగంగానే పేర్కొంటున్నారు. అలానే నిరుద్యోగులు.. గత ఐదేళ్లు నిరాశకు గురయ్యారు. కేవలం వలంటీర్ల పోస్టులను, కొద్దిమందికే సచివాలయ కొలువులు తప్ప.. ఇతర ఉద్యోగాలేవీ భర్తీచేయకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర వేదనకు గురయ్యారు. ముఖ్యంగా డీఎస్సీ కోసం జిల్లాలో సుమారు 20వేల మంది ఎదురుచూస్తున్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌ ఇవ్వడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. వారంతా శిక్షణ తీసుకుంటూ.. ఉపాధ్యాయ కొలువుల కోసం సన్నద్ధమవుతున్నారు.

- పంచాయతీల్లో ఒకేదఫా గ్రామసభలు

గత ఐదేళ్లు వైసీపీ సర్కారు పంచాయతీలను నిర్వీర్యం చేసేసింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే పంచాయతీలకు తొలివిడత ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. అలాగే ఒకేదఫా రికార్డుస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించి.. ప్రజల నుంచి వినతులు స్వీకరించింది. అవసరమైన మౌలిక సదుపాయాలపై చర్యలు తీసుకుంది. ఇదిలా ఉండగా.. 2014-2019 మధ్యకాలంలో చేపట్టిన ‘నీరు-చెట్టు’ పథకం పనులకు సంబంధించిన బిల్లులను వైసీపీ నిలిపివేసింది. తాజాగా ఆ బిల్లులను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఇన్నాళ్లూ బిల్లుల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. అలాగే త్వరలో దీపావళి నాడు ఉచిత సిలెండర్‌లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

- ‘ఎత్తిపోతల’కు నిధులు..

వైసీపీ ప్రభుత్వంలో ఎత్తిపోతల పథకాల మోటార్లు చోరీకి గురయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే... రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.. ప్రభుత్వంతో మాట్లాడి జిల్లాలోని అన్ని ఎత్తిపోతల పథకాల మరమ్మతులు చేపట్టాల్సిందేనని అధికారులను ఆదేశించారు. ఆఘమేఘాలపై కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించారు. ప్రస్తుతం ఎత్తిపోతల పథకాల మరమ్మతులు పూర్తయ్యాయి. మరికొన్ని త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

- రాష్ట్ర పండగగా.. కొత్తమ్మతల్లి జాతర..

కోటబొమ్మాళి మండలంలో కొత్తమ్మ తల్లి జాతర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. కొత్తమ్మతల్లి జాతరను ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర పండగగా నిర్వహిస్తామని అచ్చెన్నాయుడు సార్వత్రిక ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఈ మేరకు కొత్తమ్మతల్లి జాతరను రాష్ట్ర పండగగా నిర్వహించేందుకు ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యాయి.

- పేదల ఆకలి తీరుస్తోంది :

శ్రీకాకుళం నగరానికి జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది కార్మికులు, ప్రజలు వస్తుంటారు. అందరూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లలో భోజనం చేసి పనులకు వెళ్లేవారు. వైసీపీ వచ్చాక వారికి మధ్యాహ్న భోజనం ఆర్థిక భారమైంది. మళ్లీ ఇటీవల కూటమి ప్రభుత్వం శ్రీకాకుళంలో రెండు అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. రోజువేలాది మంది కడుపునిండా పేదలు భోజనం చేస్తున్నారు. వారు మనసారా ముఖ్యమంత్రి చంద్రబాబును ఆశీర్వదిస్తున్నారు.

- విభూది సూరిబాబు, జంగమ సాధికారిత డైరెక్టర్‌, శ్రీకాకుళం

....................

మహిళలకు ఆనందం :

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ దీపావళికి ఉచిత గ్యాస్‌ సిలెండర్లను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఇది మహిళలకు ఎంతో ప్రయోజనకరం. ఈ దీపావళి.. మహిళలకు మరింత ఆనందంగా ఉండనుంది.

కవ్వాడి సుశీల, శ్రీకాకుళం

...........................

ఆశలు చిగురించాయి

నేను బీఈడీ పూర్తిచేశాను. కానీ ఐదేళ్ల నుంచి ఒక్క డీఎస్సీ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌ ఇవ్వడంతో నా లాంటి ఎంతో మంది నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఎలా అయినా సరే శ్రమించి.. ప్రభుత్వ కొలువు సాధించేలా శిక్షణ తీసుకుంటున్నాం.

బోని నరసింహమూర్తి, నిరుద్యోగి, పాతపట్నం

Updated Date - Sep 20 , 2024 | 11:44 PM