విలువలు, విశ్వసనీయతలేని వైసీపీ
ABN, Publish Date - Apr 04 , 2024 | 12:03 AM
‘విలువలు, విశ్వసనీయత, సంస్కారవంతులు, విద్యావంతులు, నీతిపరులకు వైసీపీలో చోటులేదు. రెబల్స్, అవినీతిపరులు, సంస్కారహీనులు, విద్యాహీనులు, బూతుపురాణం వారికి మాత్రమే ఆ పార్టీలో చోటు, గౌరవం లభిస్తుంద’ని కేంద్రమాజీ మంత్రి, వైసీపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి ఆరోపించారు.
- అక్కడంతా అవినీతిపరులు, సంస్కారహీనులకే చోటు
- జగన్‌ను సొంత తమ్ముడిగా భావించా.. మోసం చేశారు
- పార్టీలో చేరినప్పుడు క్యాబినెట్ ర్యాంకు ఇస్తామన్నారు
- కనీసం ఎంపీగా పోటీచేసే అవకాశమూ ఇవ్వలేదు
- కార్యకర్తలా కష్టపడ్డాను.. కనీస గౌరవం లేకపోతే ఎలా?
- ఆత్మగౌరవాన్ని చంపుకోలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నా
- కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి
శ్రీకాకుళం అర్బన్, ఏప్రిల్ 3: ‘విలువలు, విశ్వసనీయత, సంస్కారవంతులు, విద్యావంతులు, నీతిపరులకు వైసీపీలో చోటులేదు. రెబల్స్, అవినీతిపరులు, సంస్కారహీనులు, విద్యాహీనులు, బూతుపురాణం వారికి మాత్రమే ఆ పార్టీలో చోటు, గౌరవం లభిస్తుంద’ని కేంద్రమాజీ మంత్రి, వైసీపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి ఆరోపించారు. కార్యకర్తలా కష్టపడినా కనీసం గౌరవం లేదని, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక.. అవమానాలు ఎదుర్కోలేక వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో విలేకరుల ముందు తన ఆవేదనను వెళ్లగక్కారు.
- ‘సీఎం జగన్‌ను తమ్ముడిగా భావించి ఆయనపై నమ్మకంతో తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని వీడి 2019లో వైసీపీలో చేరాను. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి కేబినేట్ ర్యాంకు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. దీంతో నా వెంట ఉన్నవారికి ఏదైనా మంచి చేద్దామని భావించాను. కానీ, పార్టీలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. వాటిని దిగమింగుకుని పార్టీ కోసం కార్యకర్తలా పనిచేశాను. అయినా కనీసం గౌరవం దక్కలేదు. 2019లో ఎంపీగా పోటీ చేయాలని విజయసాయిరెడ్డి చెప్పారు. కానీ అభ్యర్థుల జాబితాలో నా పేరు వెల్లడించలేదు. తర్వాత పార్టీలో మంచి స్థానం కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు కానీ, తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా నన్ను ఎందుకు నియమించారో.. ఎందుకు తొలగించారో కూడా అర్థం కాలేదు. ఒక్క వలంటీర్‌ను నియమించే అవకాశం కూడా కల్పించలేదు. నేను మద్దతు ఇచ్చిన వ్యక్తిని కాదని, సీఎం బొమ్మ పెట్టి మరో వ్యక్తిని ఇండిపెండెంట్‌గా నియమించి సొంత పార్టీ నాయకులే పోటీ చేయించారు. గతంలో జగన్ జిల్లాకు వచ్చినప్పుడు హెలీప్యాడ్ వద్దకు వెళ్తే ఆయనను కలవనీయకుండా అడ్డుకున్నారు. జిల్లాప్రజలు ఎంతగానో ఆదరించిన నన్ను.. సొంతపార్టీ నేతలే ఎందుకిలా అవమానిస్తున్నారో అర్థం కావడం లేదు’ అని కృపారాణి కన్నీటిపర్యంతమయ్యారు.
- ‘పార్టీలోని పరిణామాలను, అవమానాలను విజయసాయిరెడ్డికి, వైవీ సుబ్బారెడ్డికి విన్నవించాను. సీఎం జగన్‌ను కలిసే అవకాశం ఇమ్మని ప్రాథేయపడినా పట్టించుకోలేదు. ప్రస్తుత ఎన్నికల్లో మా నియోజకవర్గంలోని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. ఆ ఇద్దరు తమ్ముళ్లు కనీసం సహకరించమని కూడా నన్ను అడగలేదు. దీంతో పార్టీలోని నా స్థానం అర్థమైంది. నన్ను పథకం ప్రకారం అణగదొక్కాలని చూశారు. నాలాగే సుమారు 136 మంది సర్పంచ్‌లు కూడా అవమానించబడుతున్నారు. నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ నాయకులు.. కృపారాణి పని అయిపోందని అవమానించడం బాధాకరం. విలువలు, విశ్వసనీయత ఉన్నవారికి వైసీపీలో గౌరవం దక్కదని అర్థమైంది. అందరికీ పదవులు రావు. పదవుల కన్నా గౌరవం మిన్న. అటువంటి గౌరవం లేని పార్టీలో ఆత్మగౌరవం చంపుకుని ఉండలేము. నాకు జరిగిన అన్యాయంపై 3 నెలల కిందట స్పీకర్ సీతారాం సాక్షిగా సీఎం జగన్‌కు లేఖ ఇచ్చాను. ఇంతవరకూ పిలుపు రాలేదు. ఇక ఈ అవమానాలు భరించలేక వైసీపీకి రాజీనామా చేస్తున్నా’ అని కృపారాణి తెలిపారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు తనను ఆహ్వానిస్తున్నాయని, ఎక్కడ గౌరవం లభిస్తే ఆ పార్టీలో చేరుతానన్నారు. వైసీపీ నేతలకు తన బలమేంటో చూపిస్తానని స్పష్టం చేశారు. సమావేశంలో కిల్లి రామ్మోహన్‌రావు, మాజీ ఎంపీటీసీ, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 04 , 2024 | 12:03 AM