ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఒక్కటీ.. లేదు

ABN, Publish Date - Nov 30 , 2024 | 12:12 AM

జిల్లాలో డిజిటల్‌ గ్రంథాలయాల నిర్మాణం ప్రకటనలకే పరిమితమైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లావ్యాప్తంగా 195 డిజిటల్‌ గ్రంథాలయాలు మంజూరు చేశారు. ఒక్కో భవన నిర్మాణానికి ఉపాధి హామీ నిధులను రూ.16 లక్షలు కేటాయించారు.

మెలియాపుట్టి మండలం దీనబందుపురంలో డిజిటల్‌ గ్రంఽథాలయం నిర్మాణం ఇలా..

- మంజూరు 195.. పూర్తయినవి సున్నా

- ఇదీ డిజిటల్‌ గ్రంథాలయాల పరిస్థితి

- వైసీపీ సర్కారు నిర్వాకం తీరిదీ

- పెదవి విరుస్తున్న ప్రజలు

ఇచ్ఛాపురం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి) :

- గ్రంథాలయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్టు గత వైసీపీ ప్రభుత్వం చెప్పింది. ప్రతి గ్రామంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఉమ్మడి జిల్లాకు తొలి విడతగా 195 డిజిటల్‌ గ్రంథాలయ భవనాలు మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.16లక్షలు చొప్పున నిధులు కేటాయించింది. కానీ ఇప్పటివరకూ ఒక్క భవన నిర్మాణం కూడా పూర్తికాని దుస్థితి నెలకొంది.

..........................

- ఇచ్ఛాపురం మునిసిపాల్టీలో తొమ్మిది డిజిటల్‌ గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామని గతంలో అధికారులు ప్రకటించారు. స్థలాల సేకరణ పేరిట హడావుడి చేశారు. కానీ ఒక్కచోట కూడా పనులు ప్రారంభించలేదు. కనీసం పునాది నిర్మాణం కూడా చేపట్టలేదు. ఒక్క ఇచ్ఛాపురంలోనే కాదు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి.

....................

జిల్లాలో డిజిటల్‌ గ్రంథాలయాల నిర్మాణం ప్రకటనలకే పరిమితమైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లావ్యాప్తంగా 195 డిజిటల్‌ గ్రంథాలయాలు మంజూరు చేశారు. ఒక్కో భవన నిర్మాణానికి ఉపాధి హామీ నిధులను రూ.16 లక్షలు కేటాయించారు. పంచాయతీ రాజ్‌ శాఖకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. తొలి విడతగా 2022 ఉగాదికి, రెండో విడత అదే ఏడాది డిసెంబరుకు, మూడో విడత 2023 మార్చి నాటికి నిర్మాణాలు పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ఒక్కచోట కూడా నిర్మాణం పూర్తికాలేదు. 22 చోట్ల వివిధ నిర్మాణ దశల్లో పనులు ఉన్నాయి. మిగతా వాటికి సంబంధించి మాత్రం ఎటువంటి పురోగతి లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని ప్రజలు విమర్శిస్తున్నారు.

- ప్రభుత్వ గ్రంథాలయాలు అంతే..

ప్రభుత్వ గ్రంథాలయాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం వాటికి భవనాలు కూడా నిర్మించలేదు. పురాతన శిథిల భవనాలు, ఇరుకు గదుల్లో పాఠకులు అసౌకర్యానికి గురవుతున్నారు. పాతకాలం నాటి పుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాలు, కొన్ని దినపత్రికలు, మ్యాగజైన్లతో నెట్టుకొస్తున్నారు. దీనికితోడు గ్రంథాలయాల నిర్వహణకు తగినంత మంది సిబ్బంది లేరు. కానీ జగన్‌ సర్కారు మాత్రం పంచాయతీకొక డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటు చేయాలని భావించింది. మండలానికి ఒకటి చొప్పున ఉన్న గ్రంథాలయాన్ని నిర్వహించలేకపోతున్న తరుణంలో పంచాయతీకి ఒకటి నిర్వహణ సాధ్యమేనా అన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.

- అరకొరగానే సిబ్బంది

జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలో 90 వరకూ శాఖా గ్రంథాలయాలున్నాయి. కొన్నిచోట్ల విలేజ్‌ గ్రంథాలయాలున్నాయి. బుక్‌ డిపోజిట్‌, డెలివరీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. సిబ్బంది కొరత, ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధులు మంజూరు చేయకపోవడంతో గ్రంథాలయాలు సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నాయి. ఇప్పటికీ చాలా గ్రంథాలయాలు శిథిల భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల ప్రభుత్వ శాఖలు వినియోగించకుండా ఉంచిన భవనాల్లోనే నడుస్తున్నాయి. సిబ్బంది కొరత కూడా అధికంగా ఉంది. శాఖ గ్రంథాలయాలను పర్యవేక్షిస్తున్న లైబ్రేరియన్లంతా కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. కొంతమంది పదవీ విరమణ చేస్తున్నా.. కొత్తగా నియామకాలు చేపట్టడం లేదు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ సిబబందిని సైతం నియమించడం లేదు. దీంతో ఉన్న సిబ్బందితో ఎలాగోలా నెట్టుకొస్తున్నారు.

- జిల్లాలో కొన్ని గ్రంథాలయాల్లో ఇంటర్‌ నెట్‌ సేవలు మూన్నాళ్ల ముచ్చగానే మిగిలింది. సాంకేతిక సమస్యలతో సేవలు నిలిచిపోయాయయి. జిల్లా గ్రంథాలయ సంస్థ కేవలం రాజకీయ నిరుద్యోగులకు వేదిక అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ను ప్రభుత్వం నామినేట్‌ చేస్తుంది. కీలకమైన పదవి దక్కించుకునేందుకు నేతలు పోటీ పడుతుంటారు. కానీ కొన్నేళ్లుగా గ్రంథాలయాలకు ఎటువంటి నిధులు లేకుండా పోతున్నాయి. బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయిస్తుండడంతో సేవలు మెరుగుపడడం లేదు. గ్రంథాలయాధికారుల ప్రతిపాదనలకు సైతం మోక్షం కలగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరరముంది.

వైసీపీ ప్రభుత్వం విఫలం

ఇచ్ఛాపురంలో డిజిటల్‌ గ్రంథాలయం ఏర్పాటవుతుందని ఆశించాం. కానీ గ్రంథాలయం ఏర్పాటులో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. ఉన్న గ్రంథాలయాలను సైతం గాలికొదిలేసింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. గ్రంథాలయాల నిర్వహణను మెరుగుపరచి పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాలను అందుబాటులోకి తేవాలి.

- సాలిన జగదీష్‌ యాదవ్‌, నిరుద్యోగ యువకుడు, ఇచ్ఛాపురం

......

మెరుగుపరచాలి

గ్రంథాలయాల సేవలను మరింత మెరుగుపరచాలి. డిజిటల్‌ గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామని చెప్పడంతో ఎంతో ఆశపడ్డాం. కానీ కనీస స్థాయిలో కూడా అడుగులు ముందుకు పడలేదు. గ్రంథాలయాలను అభివృద్ధి చేసి..ఇంటర్నెట్‌ సేవలు, పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులో తేవాలి.

- కృష్ణచంద్రపూరి, నిరుద్యోగ యువకుడు, ఇచ్ఛాపురం

Updated Date - Nov 30 , 2024 | 12:12 AM