తిండీ లేదు.. నిద్రా లేదు
ABN, Publish Date - Dec 01 , 2024 | 11:41 PM
ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన సిక్కోలు యువకులు.. అక్కడ సక్రమంగా జీతాలు అందక పడరాని పాట్లు పడుతున్నారు. చేతిలో డబ్బులు లేక.. తినేందుకు తిండి దొరక్క అల్లాడిపోతున్నారు. అక్కడి నుంచి తమకు విముక్తి కల్పించాలని, స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
- సౌదీ అరేబియాలో జిల్లా యువకుల పాట్లు
- ఉపాధి కోసం వెళ్లి అవస్థలు
- నాలుగు నెలలుగా అందని జీతాలు
- పట్టించుకోని కంపెనీలు, ఏజెన్సీలు
- తమను స్వగ్రామాలకు తీసుకెళ్లాలని వేడుకోలు
వజ్రపుకొత్తూరు, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన సిక్కోలు యువకులు.. అక్కడ సక్రమంగా జీతాలు అందక పడరాని పాట్లు పడుతున్నారు. చేతిలో డబ్బులు లేక.. తినేందుకు తిండి దొరక్క అల్లాడిపోతున్నారు. అక్కడి నుంచి తమకు విముక్తి కల్పించాలని, స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు వారి ఆవేదనను ఓ వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల ద్వారా కుటుంబ సభ్యులకు పంపించారు. దేశం కాని దేశంలో తమ పిల్లలు పడుతున్న ఇబ్బందులను ఆ వీడియోలో చూసి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పలాస, ఇచ్ఛాపురం, టెక్కలి నియోజకవర్గాలకు చెందిన 30మంది యువకులు ఉపాధి కోసం నాలుగు నెలల కిందట సౌదీఅరేబియా దేశం వెళ్లారు. వీరంతా వజ్రపుకొత్తూరు మండలం పూండి, ఇచ్ఛాపురానికి చెందిన ఏజెన్సీలకు సొమ్ములు చెల్లించి.. సౌదీ అరేబియా వెళ్లారు. అక్కడ ఓ కంపెనీలో ఉద్యోగానికి చేరారు. నాలుగు నెలలు గడుస్తున్నా ఆ కంపెనీ జీతాలు చెల్లించలేదు. దీంతో డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని యువకులు వాపోయారు. ఓ వీడియో ద్వారా తమ ఆవేదనను కుటుంబ సభ్యులకు పంపారు. ‘ఇక్కడ సరైన వసతి, భోజన సదుపాయం లేదు. కంటినిండా నిద్ర పట్టడం లేదు. మా దగ్గర డబ్బులు తీసుకుని విదేశానికి పంపించిన ఏజెన్సీలను అడిగితే.. తమకు సంబంధం లేదని చెబుతున్నారు. విదేశాలకు పంపడం వరకే తమ బాధ్యత అంటున్నారు. జీతాల కోసం కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించినా సరైన సమాధానం రావడం లేదు. కనీసం మమ్మల్ని ఇండియా పంపించేయండి అడగ్గా.. 10వేల దినారులు(సౌదికరెన్సీ) చెల్లిస్తేనే పంపిస్తామని చెబుతున్నారు. చేతిలో డబ్బులు లేక ఇక్కడ నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. తమను ఇబ్బందుల నుంచి రక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వారి ఇబ్బందులను వీడియోలో చూసిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇటీవల విదేశీ ఉద్యోగాల పేరిట మోసపోతున్న అనేక సంఘటనలు వెలుగుచూస్తున్నా.. నకిలీ ఏజెన్సీలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సౌదీలో ఇబ్బందులు పడుతున్న యువకులను స్వదేశానికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నకిలీ కంపెనీలలో ఉద్యోగాలు ఇచ్చిన ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Updated Date - Dec 01 , 2024 | 11:41 PM