సారవకోట మండలంలోనే పులి సంచారం
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:44 PM
సారవకోట మండల పరిధిలోనే పులి సంచరిస్తోందని, ఇతర మండలాలకు వెళ్లిన ఆనవాళ్లు కనిపించడం లేదని అటవీశాఖ బీట్ అధికారి డి.శివప్రసాద్ తెలిపారు.
జలుమూరు (సారవకోట), డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సారవకోట మండల పరిధిలోనే పులి సంచరిస్తోందని, ఇతర మండలాలకు వెళ్లిన ఆనవాళ్లు కనిపించడం లేదని అటవీశాఖ బీట్ అధికారి డి.శివప్రసాద్ తెలిపారు. అన్నుపురం, నారాయణపురం, చిన్నగుజ్జువాడ తదితర గ్రామాల్లో సోమవారం పర్యటించి ప్రజలకు అప్రమత్తం చేశారు. పులి అన్నుపురం, ధర్మలక్ష్మిపురం కొండల్లో ఉన్నట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయన్నారు. పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెల్లవారు జామున, సాయంత్రం పొలాల్లోకి రైతులు వెళ్లినపుడు ఒంటరిగా వెళ్లవద్దన్నారు. పులి పొడుగుపాడు హైవే దాటి దుప్పలపాడు, రేగులపాడు, జలుమూరు మండలం ఎర్రన్నపేట, సంతలబైలి గ్రామాల మీదుగా జమచక్రం వచ్చినట్లు ఆనవాళ్లు కనిపించాయన్నారు. ఎర్రన్నపేట పొలాల్లో కూడా పులి పాదముద్రలను గుర్తించామన్నారు. పాతపట్నం, ఇతర మండలాల్లో పులి సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తలు వాస్తవం కావని ఇతర మండలాలకు చెందిన ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
మళ్లీ పులి కలకలం
కోటబొమ్మాళి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): వాండ్రాడ పంచాయతీ నర్సింగపల్లి పరిసరాల్లో సోమవారం తెల్లవారు జామున పులి కనిపించిందంటూ స్థానికులు చెప్పడంతో కలకలం రేగింది. ఈ నేపథ ్యంలో ఉదయం పరిసరాల్లోని నిమ్మాడ, వాండ్రాడ, పెద్ద బమ్మిడి, చిన్నబమ్మిడి గ్రామాల్లో ఆయా గ్రామ పెద్దలు అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయించారు. దీంతో ఏ క్షణంలోనైనా పులి గ్రామంలోకి రావ చ్చని ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తు న్నారు. అయితే పులి సారవకోట, పాతపట్నం మండలాలు దాటి వెళ్లిపోయిందని, ఇటు వచ్చే పరిస్థితి లేదని మరి కొందరు వాదిస్తున్నారు. సంబంధిత అటవీశాఖ అధికారులు ఈ గ్రామాల వైపు దృష్టి సారించి పులి నుంచి రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.
Updated Date - Dec 02 , 2024 | 11:44 PM