ఊరూవాడా ‘బెల్టు’
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:50 PM
జిల్లాలోని మద్యం దుకాణాల యజమానుల్లో చాలామంది ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు.
- వేలం పాట ద్వారా షాపుల కేటాయింపు
- మద్యం వ్యాపారుల బరితెగింపు
- బూరగాంలో రూ.4.75 లక్షలు పలికిన వైనం
- చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న ఎక్సైజ్ శాఖ
-బెల్టుషాపుల కోసం వేలం పాటలు వేస్తే చర్యలు తప్పవు. వారు పార్టీ కార్యకర్త అయినా, నాయకుడు అయినా సహించేది లేదు. పది ఓట్లు పోయినా పర్వాలేదు గానీ, బెల్టుషాపులకు వేలంపాటలు వేస్తే ఉపేక్షించేది లేదు.
- మూడు రోజుల కిందట సంతబొమ్మాళిలో జరిగిన బహిరంగ సభలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
టెక్కలి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మద్యం దుకాణాల యజమానుల్లో చాలామంది ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో బెల్టు దుకాణాలు నిర్వహిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు గ్రామాల్లో బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నారు. వేలం పాట ద్వారా వాటిని కేటాయిస్తున్నారు. కొందరు వ్యక్తులు రూ.లక్షలు చెల్లించి బెల్టుదుకాణాలను దక్కించుకున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టెక్కలి మండలం బూరగాంలో ఒక ఏడాదికి గాను బెల్టు షాపు పెట్టేందుకు వేలం పాట నిర్వహించగా ఓ వ్యక్తి రూ.4.75లక్షలకు దక్కించుకున్నాడు. శాసనాంలో రూ.3.90లక్షలు, కొండభీంపురంలో రూ.85వేలు, బూరగాం ఎస్సీ కాలనీలో రూ.లక్ష, టెక్కలి ఆదీఆంధ్రా వీధిలో రూ.45వేలకు బెల్టు షాపులు పలికాయి. వీటితో పాటు అయ్యప్పనగర్, తదితర ప్రాంతాల్లో వేలం పాటలు జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా బెల్టుషాపుల నిర్వహణకు పలు గ్రామాల్లో వేలం వేయడం చూస్తుంటే మద్యం వ్యాపారులు ఏ స్థాయిలో బరితెగిస్తున్నారో అర్థమవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఎక్సైజ్ సీఐ షరీఫ్ వివరణ కోరగా.. తన పరిధిలో బెల్టు షాపులపై 14 కేసులు నమోదు చేశామని, సమాచారం తెలిస్తే చర్యలు తప్పవని అన్నారు.
Updated Date - Dec 02 , 2024 | 11:50 PM