ఆరోగ్య శ్రీ నిలిచిపోతుందా?
ABN, Publish Date - Mar 14 , 2024 | 12:22 AM
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం తీరుతో ఈ నెల 18 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. బిల్లులు సక్రమంగా చెల్లించాలని ఎప్పటికప్పుడు నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఘం ప్రభుత్వానికి విన్నవిస్తునే ఉన్నా పట్టించుకున్న దాఖలాలు లేవు.
- ఈ నెల 18 నుంచి సేవలు బంద్
- ప్రకటించిన నెట్‌వర్క్ ఆస్పత్రులు
- రూ.1,400కోట్ల బిల్లుల పెండింగ్ కారణం
- ఆందోళనలో పేద, మధ్యతరగతి ప్రజలు
- ప్రభుత్వ తీరుపై విమర్శలు
(రణస్థలం)
ఆరోగ్యశ్రీ.. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మానసపుత్రిక. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించాయి. అందుకే ఆరోగ్యశ్రీ విషయంలో మహత్తర నిర్ణయం తీసుకుంటున్నా. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నా. దేశంలో ఇదో ఆదర్శవంతమైన, సాహసోపేత నిర్ణయం.
- కొద్దిరోజుల కిందట సీఎం జగన్ చేసిన ప్రకటన ఇది.
సీన్ కట్ చేస్తే..
ఆరోగ్యశ్రీ సేవలు త్వరలో నిలిచిపోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.1400 కోట్ల చెల్లింపులు నిలిచిపోవడమే అందుకు కారణం. ఈ నెల 18 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఘం ప్రభుత్వానికి స్పష్టం చేసింది. బకాయిల విషయంలో ఇప్పటికే ప్రభుత్వం మూడుసార్లు మాట తప్పిందని, ఇక ప్రభుత్వం మాట నమ్మేది లేదని ఆరోగశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు తేల్చిచెబుతున్నాయి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని వైద్యారోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
.......................
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం తీరుతో ఈ నెల 18 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. బిల్లులు సక్రమంగా చెల్లించాలని ఎప్పటికప్పుడు నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఘం ప్రభుత్వానికి విన్నవిస్తునే ఉన్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. గతేడాది మే నెలలో సుమారు రూ.2వేల కోట్లు బకాయిలు పేరుకుపోగా.. సేవల నిలిపివేతకు నెట్‌వర్క్ ఆస్పత్రులు నిర్ణయించాయి. ప్రభుత్వం హడావుడిగా ఆ నెలకు సంబంధించి రూ.200కోట్లు బకాయిలు విడుదల చేసింది. విడతల వారీగా బకాయిలు చెల్లించగా.. డిసెంబరు నెల నుంచి మళ్లీ నెమ్మదించింది. అప్పటికి సుమారు రూ.1000కోట్లు బకాయి చేరుకుంది. దీంతో అదే నెల 29నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు నెట్‌వర్క్ ఆస్పత్రులు నిర్ణయించాయి. దీంతో ప్రభుత్వం అసోసియేషన్ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించింది. బకాయిల చెల్లించడానికి ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో యథావిధిగా సేవలు కొనసాగించారు. అయితే ఈ ఏడాది జనవరిలోనూ బకాయిలు చెల్లించలేదు. దీంతో జనవరి 24 నుంచి సేవలు నిలిపివేతకు నిర్ణయించారు. మరోసారి ప్రభుత్వం కొద్దిపాటి మొత్తాన్ని చెల్లించి సేవలు కొనసాగించేలా చేసింది. అయితే ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం సమీపిస్తుండడం, ఎన్నికలు రానుండడంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు మేల్కొన్నాయి. సుమారు రూ.1400 కోట్లు బకాయిలు పేరుకుపోవడంతో ఈ నెల 18 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో ఆందోళన నెలకొంది.
- ఆస్పత్రుల్లో అందని సేవలు
ఆరోగ్యశ్రీ ద్వారా అత్యవసర వైద్యసేవల కోసం వెళ్తున్న వారికి అక్కడ చుక్కెదురవుతోంది. ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీకార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడికి రూ.25లక్షల సాయం అందుతుందని చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆరెగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు రకరకాలుగా కొర్రీలు పెడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ పరిధిలో 11 ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రితో పాటు మూడు ఏరియా ఆస్పత్రులో ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నారు. ప్రభుత్వం 3,255 రోగాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది. ఇందులో రెగ్యులర్ రుగ్మతలకు సంబంధించి మాత్రం ఆపరేషన్లు, వైద్యసేవలను చేర్చలేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ కన్నా.. సాధారణ వైద్యసేవలకు ప్రాధాన్యమిస్తున్నాయి. అయితే ఒడిశా నుంచి వచ్చిన రోగులకు మాత్రం ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తున్నాయి. అక్కడి ప్రభుత్వం అఫ్రూవల్ వచ్చిన పదిరోజుల్లోనే బిల్లులు చెల్లించడమే ఇందుకు కారణం.
- ఆరోగ్యశ్రీ సేవలకుగాను ప్రతీ నెట్‌వర్క్ ఆస్పత్రిలో ఒక కో ఆర్డినేటర్‌ను నియమించారు. వీరు కొన్నిచోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ సేవలు ఎలా పొందాలో అవగాహన ఉండదు. ఏ ధ్రువపత్రాలు తీసుకురావాలో తెలియదు. అటువంటి వారు అత్యవసర వైద్యానికి వచ్చినప్పుడు ఓపికగా సమాధానం చెప్పాల్సిందిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో వైద్యసేవల కోసం రోగి చేరిన నాటి నుంచి ఆపరేషన్ తరువాత వసతి, భోజనం, మందులు అందించాల్సి ఉంటుంది. దాదాపు ఆరు నెలల వరకూ వారికి మందులు అందించాలి. కానీ ఇదెక్కడ అమలవుతున్న దాఖలాలు లేవు. బాధితులు కూడా అవగాహన లేక వినియోగించుకోలేకపోతున్నారు. ఒక్కో ఆరోగ్యశ్రీ కార్డుకు రూ.25 లక్షల వరకూ వెసులబాటు ఉంటుంది. రోగికి వైద్య పరీక్షలు, ఆపరేషన్లు, మందులు, భోజనం, వసతి ఇవన్నీ లెక్క కట్టి ఆ మొత్తంలో తీసుకుంటారు. అయితే కొన్ని ఆస్పత్రులు ఖర్చుకు మించి ఆరోగ్యశ్రీలో జమ చేసుకుంటున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
- ఇది దారుణం
వైసీపీ సర్కారు ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడం లేదు. కేవలం ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.1400 కోట్లు బకాయిలు పెట్టడం దారుణం. ఇలాగైతే ఆస్పత్రులను ఎలా నడిపేది. అందుకే చాలా ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలకు దూరమవుతున్నాయి. కనీసం ఎన్నికల ముంగిట అయినా బకాయిలు చెల్లించకపోవడం అన్యాయం. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే దేశంలో రాష్ట్ర పరువు పోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలి.
ప్రముఖ వైద్యుడు, ఆరోగ్యశ్రీ నెట్‌వర్కు ఆస్పత్రి
Updated Date - Mar 14 , 2024 | 12:22 AM