నేటి నుంచి ‘స్టాప్ డయేరియా’
ABN , Publish Date - Jul 01 , 2024 | 03:51 AM
రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకూ ‘స్టాప్ డయేరియా’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ సర్వ సన్నద్ధమయింది.
చిన్నారుల్లో డయేరియా నివారణకు ప్రత్యేక కార్యక్రమం
ఏపీలో డయేరియాపై మంత్రి సత్యకుమార్ సీరియస్
నిపుణుల కమిటీ ఏర్పాటుకు, ప్రత్యేక విధివిధానాలకు ఆదేశం
అమరావతి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకూ ‘స్టాప్ డయేరియా’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ సర్వ సన్నద్ధమయింది. ఐదేళ్లలోపు చిన్నారుల్లో ప్రాణాంతకంగా మారుతున్న డయేరియా వ్యాధిని నిరోధించి మరణాల బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లలోపు చిన్నారుకు ఓఆర్‌ఎస్ ఇవ్వడంతో పాటు రెండు వారాల పాటు జింక్ ట్యాబ్లెట్లు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు రెండు నెలల పాటు క్యాంపెయిన్ చేస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆరోగ్య వసతుల్లో సరైన నిర్వహణ, అవసరమైన వైద్య సామగ్రి లభ్యతను నిర్ధారించడం, స్వచ్ఛమైన నీటిని అందుబాటులోకి తేవడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, సురక్షితమైన తాగునీరు అందించడం వంటి కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగా స్టాఫ్ డయేరియా కార్యక్రమానికి ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. డయేరియా, సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక విధివిధానాలు తయారీకి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో డయేరియా తీవ్రస్థాయిలో పెరగడాన్ని ఆయన సీరియ్‌సగా పరిగణించారు. డయేరియా ముందస్తు నివారణకు ఆరోగ్యశాఖలో ఎలాంటి విధివిధానాలూ లేకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసేశారు. అధికారులు కూడా వ్యాధులు ప్రబలిన తర్వాత స్పందించడం తప్ప ముందస్తుగా చర్యలు మాత్రం చేపట్టకపోవడం బాధ్యతారాహిత్యమమన్నారు. ఇకనైనా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.