ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉచిత సిలిండర్లకు 895 కోట్ల రాయితీ

ABN, Publish Date - Oct 29 , 2024 | 04:59 AM

రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుకగా ఉచిత వంట గ్యాస్‌ సిలిండర్లు అందించాలని నిర్ణయించిన టీడీపీ కూటమి ప్రభుత్వం..

నిధుల విడుదలకు ప్రభుత్వం అనుమతి

నేటి నుంచే బుకింగ్‌కు అవకాశం

దీపావళి నాడు ముఖ్యమంత్రి చేతులమీదుగా పంపిణీకి శ్రీకారం

1.48 కోట్ల మందికిపైగా లబ్ధిదారులు

ఉచిత పథకానికి ఏటా 2,684 కోట్ల వ్యయం

ఐదేళ్లలో 13,423 కోట్ల భారం

సబ్సిడీ మొత్తం ముందుగానే కంపెనీల ఖాతాల్లో జమ

సిలిండర్‌ తీసుకున్న 48 గంటల్లో ఆ మొత్తం లబ్ధిదారుల అకౌంట్లకు

అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుకగా ఉచిత వంట గ్యాస్‌ సిలిండర్లు అందించాలని నిర్ణయించిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. లబ్ధిదారులకు రాయితీ నిధుల విడుదలకు పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఎన్డీయే కూటమి ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన సూపర్‌ 6 హామీల్లో భాగంగా ప్రతి ఇంటికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండగను పురస్కరించుకుని ఈ నెల 31న ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా అందించడానికి ప్రభుత్వంపై రూ. 2,684.75 కోట్ల రాయితీ భారం పడుతుందని పౌరసరఫరాలశాఖ అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీనికి రాష్ట్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలిపింది. ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ అయిన 48 గంటల్లోనే రాయితీ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తొలివిడత వంట గ్యాస్‌ సిలిండర్లను పొందే లబ్ధిదారులకు చెల్లించాల్సిన రాయితీ మొత్తం రూ.895 కోట్ల విడుదలకు రాష్ట్ర ఆర్థిక శాఖ అంగీకారంతో ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్‌ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ రాయితీ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు వీలుగా హెచ్‌పీ, భారత్‌, ఇండేన్‌ గ్యాస్‌ కంపెనీల అకౌంట్లకు ముందుగానే మళ్లిస్తారు. లబ్ధిదారులు ఈనెల 29 నుంచే ఉచిత గ్యాస్‌ సిలిండర్లను బుక్‌ చేసుకోవచ్చని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్రంలో ఎల్పీజీ కనెక్షన్‌, తెల్ల రేషన్‌కార్డు (బియ్యం కార్డు), ఆధార్‌ కార్డు ఉన్నవారందరూ మంగళవారం నుంచి ఎప్పటిలాగే ముందుగా గ్యాస్‌ సిలిండర్లు బుక్‌ చేసుకుంటే.. తర్వాత పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్న డేటాబేస్‌ ఆధారంగా 24 గంటల్లోపు ఆయా గ్యాస్‌ కంపెనీలు లబ్ధిదారుల ఆధార్‌ లింక్‌తో కూడిన బ్యాంకు ఖాతాల్లో రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన రాయితీ మొత్తాన్ని జమ చేస్తాయి. ప్రస్తుతం ఒక్కో సిలిండర్‌ రిటైల్‌ మార్కెట్‌ ధర రూ.876 కాగా.. కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్‌కు రూ.25 చొప్పున సబ్సిడీ ఇస్తుంది. అది పోగా మిగిలిన రూ. 851 ఽపూర్తి సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లిస్తుంది. దీపావళి నుంచి ప్రారంభించే తొలివిడత ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌లను వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగించనున్నారు. తర్వాత నుంచి నాలుగు నెలలకు ఒకటి చొప్పున (బ్లాక్‌ పీరియడ్స్‌) సరఫరా చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

మొత్తం కనెక్షన్లు 1.55 కోట్లు

రాష్ట్రంలో మొత్తం 1,55,84,270 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 1.48 కోట్ల మందికిపైగా తెల్లకార్డుదారులు ఉన్నారు. వీరంతా ఉచిత గ్యాస్‌ సిలిండర్ల లబ్ధిదారులే. ఇక రాష్ట్రంలో ‘దీపం’ కనెక్షన్లు 58,42,354, ట్రైబల్‌ ఎల్పీజీ ప్యాకేజీ కింద ఇచ్చిన కనెక్షన్లు 73,936 కలిపి.. మొత్తం 59,16,290 కనెక్షన్లు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్‌) కుటుంబాల్లోనే ఉన్నాయి. 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)ను ప్రారంభించింది. దీని కింద రాష్ట్రంలో 9,65,361 పేద కుటుంబాలకు వంట గ్యాస్‌ కనెక్షన్లను మంజూరు చేసింది. సామాజిక బాధ్యత కింద మరో 6,23,831 పేద కుటుంబాలకు గ్యాస్‌ కనెక్షన్లు మంజూరయ్యాయి. ఇవిగాకుండా మరో 80,78,788 సాధారణ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ వద్దనున్న డేటా ఆధారంగా రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు సబ్సిడీ కింద రూ.2,684 కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. ఐదేళ్లలో రూ.13,423 కోట్ల భారాన్ని మోయాల్సి ఉంటుంది.

‘ఉజ్వల’లో విలీనంపై స్పందించని కేంద్రం

ఉజ్వల యోజన కింద మంజూరు చేసిన గ్యాస్‌ కనెక్షన్లకు మాత్రమే కేంద్రం రూ.300 చొప్పున రాయితీ ఇస్తోంది. రాష్ట్రంలో ఉన్న ‘దీపం’ కనెక్షన్లను ‘ఉజ్వల’ స్కీంలో విలీనం చేయాలని కూటమి ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిని కేంద్రం ఆమోదించి.. రాష్ట్రంలోని 58 లక్షలకుపైగా ‘దీపం’ కనెక్షన్లను ‘ఉజ్వల’ స్కీంకు మార్చితే.. ఒక్కో కనెక్షన్‌కు రూ.300 చొప్పున రూ.180 కోట్ల వరకు రాయితీ లభిస్తుంది. ఈ మొత్తాన్ని మూడు ఉచిత సిలిండర్ల పథకానికి వినియోగించుకుంటే రాష్ట్రప్రభుత్వంపై ఏడాదికి రూ.540 కోట్ల మేర భారం తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ‘దీపం’ కనెక్షన్లను ‘ఉజ్వల’ పథకంలో విలీనం చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు ఇటీవలే కేంద్ర పెట్రోలియం మంత్రికి లేఖ రాశారు. కానీ కేంద్రం ఇంతవరకు సానుకూలంగా స్పందించలేదు.

Updated Date - Oct 29 , 2024 | 04:59 AM