వైపీఎస్‌లపై వేటు
ABN, Publish Date - Sep 16 , 2024 | 03:53 AM
ఐపీఎస్ అధికారులమనే విషయాన్ని మరిచి జగన్ ప్రభుత్వంలో అడ్డగోలు పనులు చేసిన అధికారుల పాపం పండింది.
పీఎస్ఆర్, కాంతిరాణా, విశాల్ గున్నీ సస్పెన్షన్
ముంబై నటి జెత్వానీ కేసులో సంచలనం
శాంతిభద్రతలతో ఎలాంటి సంబంధమూ లేని నాటి నిఘా విభాగం అధిపతి పీఎ్‌సఆర్ ఆంజనేయులు జనవరి 31న తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్నీలను పిలిపించుకుని ఒక మహిళ (ముంబై నటి కాదంబరి)ను అన్యాయంగా కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారు. వైసీపీ నేతలతో కలిసి చేసిన కుట్రలో ముగ్గురు ఐపీఎ్‌సలు భాగస్వాములయ్యారు. ఆలిండియా సర్వీస్ రూల్స్ 1969లోని సెక్షన్ 3(1)కింద ఐపీఎ్‌సలకు ఉన్న అధికారాలను అతిక్రమించారు.
విజయవాడ సీపీగా కాంతిరాణా తన పరిధిలోని పోలీసు స్టేషన్‌లో నమోదైన ఈ కేసు పర్యవేక్షణలో దారుణంగా విఫలమయ్యారు. ఒక మహిళను అరెస్టు చేసే ముందు ఫిర్యాదును కనీసం పరిశీలించకుండా ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పగానే గుడ్డిగా ముందుకెళ్లారు. జెత్వానీ కేసులో నాటి విజయవాడ డీసీపీ విశాల్ గున్నీ చర్యలు దుష్ప్రవర్తనకు ఏ మాత్రం తీసిపోవు. బాధితురాలు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా వినకుండా ఏకపక్షంగా వ్యవహరించి క్షోభపెట్టారు.
సీనియర్ ఐపీఎస్‌లపై కొరడా.. నాడు వైసీపీ పెద్దల ఆదేశాలతో అడ్డగోలు వ్యవహారాలు
జగన్ స్నేహితుడు సజ్జన్‌ను కాపాడేందుకు నటి కాదంబరిపై అక్రమ కేసు బనాయింపు
వైసీపీ నేత విద్యాసాగర్ ఫిర్యాదుతో నమోదు.. పీఎస్‌ఆర్ ప్లాన్.. రాణా, గున్నీ యాక్షన్
ముంబైలో అక్రమంగా జెత్వానీ కుటుంబాన్ని అరెస్ట్ చేసి విజయవాడకు తరలింపు
ఐపీఎస్‌లు పరిధి దాటి వ్యవహరించారని, తప్పుచేశారని డీజీపీ నివేదిక!
అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఐపీఎస్ అధికారులమనే విషయాన్ని మరిచి జగన్ ప్రభుత్వంలో అడ్డగోలు పనులు చేసిన అధికారుల పాపం పండింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని విచ్చలవిడిగా చెలరేగిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. ముంబై నటి కాదంబరి జెత్వానీ వ్యవహారంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎ్‌సఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతా, విజయవాడ మాజీ డీసీపీ విశాల్ గున్నీని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జెత్వానీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విజయవాడ పోలీసులు ఇచ్చిన నివేదికను డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రభుత్వానికి నివేదించారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ జీవో 1590, 1591, 1592 విడుదల చేసింది. మాజీ సీఎం జగన్ స్నేహితుడు సజ్జన్ జిందాల్‌ను కాదంబరి పెట్టిన కేసు నుంచి కాపాడేందుకు ఆమెను అక్రమ కేసులో ఇరికించి నరకం చూపించారు. వైసీపీ పెద్దల ఆదేశాల మేరకు ఐపీఎ్‌సలు పీఎ్‌సఆర్, కాంతిరాణా, విశాల్ గున్నీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆమెను, కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి టార్చర్ పెట్టారు. ఈ ముగ్గురు ఐపీఎ్‌సలపై గతంలో కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రానికి డీజీపీ కావాలనే ధ్యేయంతో ప్రతిపక్ష పార్టీల నేతల్ని హింసించడం, ప్రశ్నించే గొంతుకల్ని నొక్కేయడం, తప్పుడు కేసులతో వేధించడం లాంటి అడ్డగోలు పనులు చేసినట్టు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎ్‌సఆర్ ఆంజనేయులుపై విమర్శలు ఉన్నాయి. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి దొంగ ఓట్లు వేయించడం నుంచి బెజవాడలో అడ్డమైన పనులు చేయడం వరకు కాంతిరాణాపై ఆరోపణలు ఉన్నాయి. పోస్టింగ్ కోసం రాజధాని రైతుల్ని హింసించడం మొదలు దళితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత నాడు గుంటూరు ఎస్పీగా విశాల్ గున్నీ సొంతం.
వైసీపీ పెద్దల ఆదేశాలతో...
ఈ ఏడాది జనవరి చివరి వారంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి పీఎ్‌సఆర్ ఆంజనేయులుకు పిలుపొచ్చింది. ముంబైలో ఉన్న సినీ నటి కాదంబరి జెత్వానీని ఏదో ఒక కేసులో ఇరికించి ఏపీకి లాక్కొచ్చి ఒక సెటిల్మెంట్ చేయాలని వైసీపీ పెద్దల నుంచి ఆదేశాలొచ్చాయి. అంతే ఆమెకు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌తో ఉన్న పాత పరిచయాన్ని తెరపైకి తెచ్చారు. ఆయన భూమి కాజేసేందుకు కాదంబరి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని కేసు పెట్టేందుకు ప్లాన్ వేశారు. జనవరి 31న నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్నీని తాడేపల్లి ప్యాలె్‌సకు పిలిపించి కాదంబరి జెత్వానీని అరెస్టు చేయాలని చెప్పారు. పీఎ్‌సఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు వెంటనే డీసీపీ విశాల్ గున్నీ, టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ రమణమూర్తి, ఇబ్రహీంపట్నం సీఐ, ఎస్‌ఐతో టీమ్ సిద్ధం చేశారు. ఫిబ్రవరి 1న నలుగురికీ విజయవాడ సీపీ కార్యాలయం నుంచి ముంబైకి విమాన టికెట్లు బుక్ అయ్యాయి. కానీ ఆ టికెట్లకు డబ్బులు సీపీ అధికారిక ఖాతా నుంచి ఎక్కడా డ్రా చేయలేదు. ముంబైకి వెళ్లే పోలీసు బృందం ఫిబ్రవరి 2న ఉదయం ఐదున్నరకే బయలుదేరి ఆరింటికి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఏడున్నరకు విమానం ఎక్కింది. అదే రోజు ఉదయం ఆరున్నర, ఏడు గంటల మధ్య ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో జెత్వానీపై విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అంటే... డీసీపీ బృందం విమానాశ్రయానికి బయలు దేరినప్పటికి ఎఫ్‌ఐఆర్ ఇంకా నమోదు కాలేదు. పీఎ్‌సఆర్ ఆంజనేయులు ఇంతటి స్కెచ్ వేస్తే అందుకు సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీ సహకరించారు.
జగన్ మిత్రుడి కోసమే...
వైఎ్‌సఆర్ బతికి ఉన్నప్పుడు జగన్ రెడ్డికి వ్యాపార మెలకువలు నేర్పించమని తనను అడిగారంటూ కడప స్టీల్ ప్లాంట్ భూమిపూజ సందర్భంగా వ్యాఖ్యానించిన పారిశ్రామిక వేత్త సజ్జన్ జిందాల్ కోసమే ఒక మహిళను జగన్ వేధింపులకు గురి చేశారు. లైంగికంగా తనను వాడుకుని మోసం చేశారంటూ జిందాల్‌పై జెత్వానీ ముంబైలో పెట్టిన కేసు వెనక్కి తీసుకోవడానికి ఎలాగైనా ఒప్పించే ప్రయత్నంలో భాగంగా ముగ్గురు ఐపీఎ్‌సలు కుట్ర పన్ని అమలు చేశారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌తో ఆమెకు గతంలో ఉన్న పరిచయం ఆధారంగా ఒక నకిలీ డాక్యుమెంటు సృష్టించారు. కృష్ణా జిల్లాలో తనకున్న ఐదెకరాల పొలాన్ని నకిలీ అగ్రిమెంట్‌తో అమ్మేసేందుకు జెత్వానీ ప్రయత్నిస్తున్నారని, కొండపల్లి కిల్లాకు చెందిన నాగేశ్వరరావు, భరత్ అనే వ్యక్తుల నుంచి ఐదు లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారని ఫిబ్రవరి 2న ఉదయం 6.30కి విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాజాగా పోలీసుల విచారణలో కాదంబరి ఎవరో తమకు తెలియదంటూ కొండపల్లి ఖిల్లాకు చెందిన నాగేశ్వర రావు, భరత్ వెల్లడించారు. విద్యాసాగర్ తెలుసు కానీ ముంబై నటి గురించి తెలియదని, ఆమెకు ఐదు లక్షలిచ్చి అగ్రిమెంట్ చేసుకోలేదని స్పష్టం చేశారు. జెత్వానీ ఇచ్చిన తాజా ఫిర్యాదులో తాను 2020లో కొనుగోలు చేసిన ఇంటి చిరునామాను... 2018లో చేసుకున్న అగ్రిమెంట్‌లో పెట్టారని, దీన్ని ఇటీవల సృష్టించిందేనని అనుమానం వ్యక్తం చేశారు. ఆ అగ్రిమెంట్ ఇక్కడే ఒంగోలు వ్యక్తి సృష్టించారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆ వైపిఎస్ లలు గీత దాటారు
జెత్వానీ కేసులో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ఐపీఎస్‌లు పీఎ్‌సఆర్ ఆంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ ఎక్కడెక్కడ పరిధి దాటి వ్యవహరించారో డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. కేసు నమోదు చేసి ముంబై నటిని వేధించిన స్థానిక సీఐ, డీఎస్పీని ఇప్పటికే సస్పెండ్ చేశానని పేర్కొన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ విచారణలో సాక్షులు, బాధితురాలు చెప్పిన అంశాలను పరిశీలిస్తే ఐపీఎ్‌సలు, పోలీసులు తప్పు చేసినట్లు తేలిందని పదహారు పేజీల నివేదికలో పేర్కొన్నారు. హడావుడిగా ముంబైకి వెళ్లేందుకు నలుగురికి విమాన టికెట్లు బుక్ చేయాలంటూ తన సీసీని ఆదేశించిన కాంతిరాణా విమానంలో వెళ్లే పోలీసులకు పాస్‌పోర్టు ఇవ్వలేదన్నారు. ఒక మహిళను అరెస్టు చేయాలంటే కచ్చితంగా మహిళా పోలీసు ఉండాలన్న నిబంధన కూడా పాటించకుండా పోలీసు కమిషనర్ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. జెత్వానీపై ఎఫ్‌ఐఆర్ నమోదైన గంటలోనే విశాల్ గున్నీ ఎటువంటి సమాచారం లేకుండా ముంబైకి విమానం ఎక్కి వెళ్లారని, పై అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. ఒక పోలీసు అధికారి రాష్ట్రం దాటి వెళ్లేముందు తగిన పాస్‌పోర్టు పోలీసు శాఖ నుంచి తీసుకోవాల్సి ఉంటుందన్న కనీస నిబంధనలు కూడా పాటించలేదన్నారు. విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన ప్రయాణ ఖర్చులు కూడా క్లెయిమ్ చేసుకోలేదని, ఈ వ్యవహారంలో గున్నీ చర్యలు దుష్ప్రవర్తన కిందికి వస్తాయన్నారు.
పీఎ్‌సఆర్‌పై ఎన్నో ఆరోపణలు
ఐపీఎస్ అధికారులుగా చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు జగన్ ప్రభుత్వంలో వైసీపీ చట్టాన్ని అమలు చేశారు. జగన్ రెడ్డిని ప్రశ్నించిన ఎవరినైనా సరే ఏదో ఒక కేసు పెట్టి జైలులో తోయడం ఎలా అనే దానిపై మొత్తం పథక రచన చేసి, నాటి సీఎంతో అంజన్నా అని పిలిపించుకునేవారు పీఎ్‌సఆర్ ఆంజనేయులు. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు నుంచి అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వరకూ.. హైదరాబాద్‌లో రఘురామ రాజు నుంచి నంద్యాలలో చంద్రబాబు వరకూ ఎవరిని అక్రమంగా జైలుకు పంపాలన్నా ఆయనదే స్కెచ్ అన్నది పోలీసు శాఖలో బహిరంగ రహస్యమే. జగన్ మెప్పు పొంది డీజీపీ అవ్వాలనే లక్ష్యంతో ఆయన చేసిన అరాచకాలు రాష్ట్ర చరిత్రలో ఏ ఐపీఎస్ అధికారి కూడా చేసి ఉండరు.
Updated Date - Sep 16 , 2024 | 06:42 AM