Political Conflict : వైసీపీ నేతల ఆగడాలు అడ్డుకోండి
ABN, Publish Date - Dec 17 , 2024 | 06:31 AM
‘టీడీపీలో చురుకుగా ఉన్నానన్న కారణంగా మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అనుచరులు నా ఇంటిపై దాడి చేశారు. సామాన్లు ధ్వంసం చేశారు. నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు’ అని వినుకొండకు
టీడీపీ గ్రీవెన్స్‌లో బాధితుల ఫిర్యాదులు
అమరావతి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘టీడీపీలో చురుకుగా ఉన్నానన్న కారణంగా మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అనుచరులు నా ఇంటిపై దాడి చేశారు. సామాన్లు ధ్వంసం చేశారు. నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు’ అని వినుకొండకు చెందిన షేక్ జానీ బాష వాపోయారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కేఎస్ జవహర్, లిడ్‌క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు అర్జీలు స్వీకరించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు అండతో తమపై అక్రమ కేసులు పెట్టారని, విచారించి, చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా చిట్వేలికి చెందిన సుబ్బారాయుడు కోరారు. కంచికచర్లకు చెందిన ఓ మహిళ మాట్లాడుతూ, ‘కంభం గ్రామానికి చెందిన రాంభూపాల్‌రెడ్డి అనే వ్యక్తి నా ఫోన్ హ్యాక్ చేశాడు. నా ఫొటోలు మార్ఫింగ్ చేసి, వేధిస్తున్నాడు’ అంటూ వాపోయింది. ‘టీడీపీకి అనుకూలంగా ఉన్నామనే కక్షతో వైసీపీ నేతలు నా సోదరుడి కాళ్లు విరగ్గొట్టారు. అతని భార్యను వేధిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోండి’ అని పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన వెంకటేశ్వర్లు కోరారు. గత ప్రభుత్వంలో తనకు మంజూరైన గృహ రుణాన్ని మరొకరికి ఇచ్చి, తమను మోసం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా రాంపురం గ్రామానికి చెందిన ఖాతూన్‌బీ విజ్ఙప్తి చేసారు.
Updated Date - Dec 17 , 2024 | 06:31 AM