Chandrababu - Revanth Reddy: శనివారం మధ్యాహ్నం అక్కడ సిద్ధంగా ఉంటా: ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ
ABN, Publish Date - Jul 02 , 2024 | 07:59 PM
తెలుగు రాష్ట్రాల అభ్యున్నత, విభజన సమస్యల పరిష్కారానికి జులై 6న హైదరాబాద్‌లో భేటీ అయ్యి చర్చిద్దామంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లేఖ ద్వారా చేసిన ప్రతిపాదనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అభ్యున్నత, విభజన సమస్యల పరిష్కారానికి జులై 6న హైదరాబాద్‌లో భేటీ అయ్యి చర్చిద్దామంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లేఖ ద్వారా చేసిన ప్రతిపాదనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి సిద్ధమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ప్రజలందరి తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున జూలై 6, 2024, శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతి రావు ఫూలే భవన్‌లో ముఖాముఖీ భేటీకి తాను ఆహ్వానిస్తున్నట్టు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తెలియజేశారు.
‘‘ప్రియమైన నారా చంద్రబాబు నాయుడు గారూ, ఆదివారం హృదయపూర్వకంగా మీరు రాసిన లేఖను చదివాను. నన్ను ఉద్దేశించి సహృదయ పదాలు ఉపయోగించిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో అసాధారణ విజయం సాధించినందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. స్వతంత్ర భారతదేశంలో నాలుగవ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి అరుదైన రాజకీయ నాయకుల జాబితాలో మీరు చేరారు. ఈ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
‘‘రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా మీకు, నాకు మధ్య ప్రతిపాదిత ముఖాముఖి భేటీకి పూర్తిగా ఏకీభవిస్తున్నాను. విభజన చట్టానికి సంబంధించిన అన్ని పెండింగ్ సమస్యలను పరిష్కరించడం నిజంగా అత్యవసరం. ఇరు రాష్ట్రాల ప్రజలకు మెరుగ్గా సేవలు అందించడానికి, పరస్పర సహకారం, ఆలోచనల పంచుకునే విషయంలో ఇరువురి మధ్య వ్యక్తిగత సమావేశం అవసరమని భావిస్తున్నాను’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - Jul 02 , 2024 | 08:05 PM