అమెరికాలో తెనాలి విద్యార్థిని మృతి
ABN, Publish Date - Jul 22 , 2024 | 04:30 AM
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గుంటూరు జిల్లా తెనాలి విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
ఉన్నత చదువులకు వెళ్లి. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం
మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని తల్లిదండ్రుల వేడుకోలు
స్పందించిన కేంద్ర మంత్రి చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి మనోహర్
తెనాలి, జూలై 21(ఆంధ్రజ్యోతి): ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గుంటూరు జిల్లా తెనాలి విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. తెనాలి ఐతానగర్‌కు చెందిన జెట్టి హారిక (25) న్యూట్రిషన్ ఫుడ్ సైన్స్‌లో పీజీ చేసేందుకు గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లారు. శనివారం యూనివర్సిటీ నుంచి కారులో ఇంటికి వెళ్తుండగా లోగాన్ కౌంటీలోని ఒక్లహోమా హైవే పెట్రోల్-74 దగ్గర వరుసగా మూడు కార్లు ఢీకొనటంతో హారిక అక్కడికక్కడే మరణించారు. యూనివర్సిటీ నిర్వాహకులు ఆదివారం ఉదయం ఫోన్ చేసి విషయం తెలియజేశారని తెనాలిలోని ఆమె తల్లిదండ్రులు జెట్టి శ్రీనివాసరావు, నాగమణి కన్నీటి పర్యంతమయ్యారు. కుమార్తె ప్రయోజకురాలై స్వదేశానికి తిరిగొస్తుందన్న ఆశతో ఉన్నామని, ఆమె ఇకలేదనే వార్త జీర్ణించుకోలేకపోతున్నామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వీరిది మధ్యతరగతి కుటుంబం. కష్టపడి కూడబెట్టిన డబ్బుతో కుమార్తెను అమెరికాకు పంపారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించే ఆర్థిక పరిస్థితి కూడా లేదు. మృతదేహం ఎక్కడుంది? ఎప్పుడు స్వదేశానికి వస్తుందనే సమాచారం కూడా ఎవ్వరూ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అమెరికాలో ఎంఎస్ చేసేందుకు వెళ్లిన తెనాలికే తాడిబోయిన రవితేజ(28) మూడు రోజుల క్రితం స్విమింగ్‌పూల్‌లో మునిగి మరణించారు. రవితేజ ప్రమాదవశాత్తు స్విమింగ్‌పూల్‌లో జారిపడి మరణించాడని ఆయన తల్లి జయలక్ష్మి కన్నీరుమున్నీరవుతూ వివరించారు. మృతదేహాన్ని తెనాలికి తీసుకొచ్చే స్తోమత తనకు లేదని, ప్రభుత్వం సహకారం అందించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్‌ను వేడుకున్నారు. వీరి అభ్యర్థనకు స్పందించిన చంద్రశేఖర్, మనోహర్ ఇప్పటికే అమెరికాలోని అధికారులతో మాట్లాడామని, మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. హారిక తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
Updated Date - Jul 22 , 2024 | 04:30 AM