అది.. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్
ABN, Publish Date - May 02 , 2024 | 05:57 AM
ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పేరుతో ప్రజల భూములను దోచుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.
ప్రజల ఆస్తి పత్రాలన్నీ జగన్ ఇంట్లో,
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో
3 కబ్జాలు, 6 సెటిల్‌మెంట్లుగా పాలన
ఉత్తరాంధ్రలో వేలాది ఎకరాలు కబ్జా
చేసిన సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి
ఒక్క చాన్స్ అన్నారు, మీరిచ్చారు.. చాలు
వైసీపీకి ప్రతిపక్ష అర్హత కూడా ఇవ్వొద్దు
జగన్‌కు పొలిటికల్ హాలిడే ప్రకటించాలి
జనసేన ఒక గుర్తింపు ఉన్న పార్టీ కావాలి
తర్వాతే ముఖ్యమంత్రి పదవిపై ఆలోచిద్దాం
ప్రచార సభల్లో జనసేనాని పవన్ కల్యాణ్
విశాఖపట్నం/కాకినాడ, మే 1(ఆంధ్రజ్యోతి), అచ్యుతాపురం/మండపేట: ‘‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పేరుతో ప్రజల భూములను దోచుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. భూమికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు జగన్ ఇంట్లో, హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉంటాయి. వైసీపీకి మరోసారి ఓటేస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలే. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. కూటమి అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తాం’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన విశాఖపట్నంలోని అచ్చుతాపురం, పెందుర్తి, కాకినాడలోని మండపేటలలో నిర్వహించిన ‘వారాహి విజయభేరి’ సభల్లో పాల్గొన్నారు. విశాఖ సభల్లో అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు పాల్గొన్నారు.
పెందుర్తిలో పవన్ ఏమన్నారంటే..
ప్రజల ఆస్తులకే రక్షణ లేకుండా పోయింది. ఒరిజినల్ పత్రాలు లేని ఆస్తులకు రక్షణ ఎక్కడ ఉంటుంది. వైసీపీ అధికారంలోకి వస్తే కొండ, గుట్ట ఏమీ మిగలవని గత ఎన్నికల్లోనే చెప్పా. ఇప్పుడు అదే జరిగింది. ఉత్తరాంధ్రలో వేలాది ఎకరాలను వైసీపీకి చెందిన వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి వంటి నేతలంతా కబ్జా చేశారు. కానీ, కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని తరలించడానికి మాత్రం భూములు లేవంటున్నారు. వైసీపీ ప్రభుత్వం మూడు కబ్జాలు, ఆరు సెటిల్‌మెంట్లతో సాగుతోంది. పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించడం ఇక్కడి నేతలకు చేతకాదు. కానీ, అప్పన్న ఆలయ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం తెలుసు. అలాంటి వారిని చొక్కా పట్టుకుని నిలదీయకపోతే మార్పు సాధ్యం కాదు. గడిచిన ఐదేళ్లలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా చేయలేదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పిన జగన్.. ఆ హామీని విస్మరించారు. రాష్ట్రంలో 23 లక్షల మంది యువత గంజాయికి అలవాటుపడ్డారు. విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ దొరికాయి. యువత భవిష్యత్తును నాశనం చేసేలా వైసీపీ వ్యవహరిస్తోంది. వైసీపీ ప్రభుత్వాన్ని పాకిస్థాన్‌కు చెందిన ఘాజీ సబ్‌మెరైన్‌ను తొక్కినట్టు అధఃపాతాళానికి తొక్కేద్దాం. త్రిమూర్తుల మాదిరిగా వస్తున్న మమ్మల్ని(టీడీపీ-బీజేపీ-జనసేన) ఆదరించాలి.
హామీల అమలు మాకు తెలుసు!
ప్రజల రక్తాన్ని జగన్ ఐదేళ్లలో జలగలా పీల్చేశాడు. మేం ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తామంటూ వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆ హామీలను ఎలా అమలు చేయాలో మాకు తెలుసు. మద్యం రేట్లు పెంచి జగన్ రూ.41 వేల కోట్లు దోచేశారు. అడ్డగోలు ఇసుక విక్రయాలతో రూ.వేల కోట్లు దండుకున్నారు. వీటన్నింటినీ సక్రమం చేసి పథకాలను అమలు చేస్తాం. పోరాడితే పోయేది ఏమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప. పోరాడకపోతే ప్రాథమిక హక్కులు కూడా ఉండవు. యువతలో దాగి ఉన్న ప్రతిభను కూటమి ప్రభుత్వం వెలికితీస్తుంది. 2047 నాటికి భారత్ సూపర్ పవర్‌గా ఎదగబోతోంది. దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పెన్షన్ ఇస్తాం. కిడ్నీ, తలసీమియా వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు ఇస్తాం. పంచాయతీలకు ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు రూ.8 వేల కోట్లను జగన్ దారిమళ్లించారు. ఆ నిధులను వాటికే ఇచ్చేలా బాధ్యత తీసుకుంటాం. పాలన మారాలంటే ప్రభుత్వాన్ని మార్చాలి.
టైటిలింగ్ యాక్ట్‌పై చర్చ జరిగిందా?
వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ చట్టం చాలా ప్రమాదకరమైందని పవన్ అన్నారు. ఇది అమల్లోకి వస్తే పేదోడికి ఉన్న చిన్నపాటి స్థలాన్ని కూడా జగన్ లాగేసుకుంటారని తెలిపారు. మన ఆస్తిని ఆయన ఆస్తిగా ఫీలవుతారన్నారు. ‘‘ల్యాండ్ టైటింగ్ చట్టం ప్రతిపాదన బీజేపీ తెచ్చిందని అంటున్నారు. కేంద్రం ఎప్పుడూ చట్టాలపై అభిప్రాయాలు తెలపాలని రాష్ట్రాలకు ముసాయిదా పంపుతుంది. కానీ, దీనిపై నష్టాలేంటనే విషయంపై అసెంబ్లీలో చర్చించారా? టీడీపీని జగన్ ప్రభుత్వం మాట్లాడనిచ్చిందా? మంచా చెడా అని చర్చించే అవకాశం ఇస్తే కదా! కానీ, దీన్ని ప్రశ్నిస్తే చంద్రబాబును అసెంబ్లీలోకి రానివ్వరు. కుటుంబసభ్యులను బూతులు తిడతారు. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలే. రేపు ఎవరైనా రుణం కోసం బ్యాంకుకు వెళ్తే అసలు ఆస్తి పత్రాలు తెమ్మని అడిగితే జగన్ దగ్గర ఉన్నాయని చెప్తే బ్యాంకు వాళ్లు తన్ని తగిలేస్తారు. అందుకే చెబుతున్నా.. మన ఆస్తిపత్రాలను జగన్ నెమ్మదిగా లాగేస్తున్నాడు. ఇది రాచరిక పోకడ. అందరూ తన కింద ఉండాలని జగన్ అనుకుంటున్నారు. కానీ, ప్రజల బతుకులు ఒకరి మోచేతి కింద అంబలి తాగేవి కావు. కొత్త చట్టంతో ప్రజల స్థలం కబ్జాకు గురైతే అప్పీలుకు రెవెన్యూశాఖ తర్వాత హైకోర్టుకు వెళ్లాలంటే. పేదల పరిస్థితి ఏంటో ఆలోచించండి’’ అని పవన్ అన్నారు.
Updated Date - May 02 , 2024 | 05:57 AM