లెక్క తేలుతోంది!
ABN, Publish Date - May 15 , 2024 | 03:58 AM
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్ జరగడంపై టీడీపీలో సంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై నెలకొన్న తీవ్రవ్యతిరేకత ఓటింగ్‌లో ప్రతిఫలించిందని, అందుకే ఓట్ల సునామీ వచ్చిందని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
భారీ పోలింగ్‌పై టీడీపీలో సంతృప్తి
ప్రభుత్వ వ్యతిరేకత వల్లేనని విశ్లేషణ.. సీట్లు, మెజారిటీపైనే ప్రధాన చర్చ
అత్యధిక చోట్ల గత ఎన్నికల కంటే ఎక్కువ ఓటింగ్.. తరలివచ్చిన ప్రవాసులు
యువత, మహిళల ఓట్లు కూటమికే!.. పథకాలు అందడంతో పని లేదు
అందరిలోనూ ప్రభుత్వం మారాలన్న ఆకాంక్ష.. సర్వే సంస్థల ప్రతినిధుల వెల్లడి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్ జరగడంపై టీడీపీలో సంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై నెలకొన్న తీవ్రవ్యతిరేకత ఓటింగ్‌లో ప్రతిఫలించిందని, అందుకే ఓట్ల సునామీ వచ్చిందని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ నుంచి తుది గణాంకాలు మంగళవారం సాయంత్రం వరకూ విడుదల కానప్పటికీ.. 81ు వరకూ ఓటింగ్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ‘గత ఎన్నికల సమయానికి టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత బలంగా ఉండడం వల్లే ఎక్కువగా పోలింగ్ జరిగిందని అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి. ఇప్పుడు వ్యతిరేకత దానిని మించి ఉంది. అందుకే పోలింగ్ ఇంకా పెరిగింది’ అని టీడీపీ ముఖ్యుడొకరు పేర్కొన్నారు. తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇదే మాదిరి పోలింగ్ జరిగిందని, అక్కడ బీఆర్‌ఎస్ చిత్తుగా ఓడిపోయిందని టీడీపీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ‘అత్యధిక నియోజకవర్గాల్లో గతంతో కంటే ఈసారి పోలింగ్ బాగా పెరిగింది. ప్రత్యేకించి బయటి రాష్ట్రాల్లో ఉంటున్నవారు పెద్దసంఖ్యలో తరలిరావడం ఓటింగ్ శాతాన్ని పెంచింది. యువత, మహిళలు భారీగా పాల్గొనడం వారిలో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న విషయాన్ని ధ్రువీకరించింది’ అని ఆ వర్గాలు చెబుతున్నాయి. పోలింగ్ సమయంలో ఎగ్జిట్ పోల్ నిర్వహించిన కొన్ని సర్వే సంస్థల ప్రతినిధులు కొన్ని ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. తాము తీసిన ఎగ్జిట్ పోల్‌లో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయం ఒకే మాదిరిగా వ్యక్తమైందని ఒక ప్రతినిధి తెలిపారు. ‘పట్టణాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందని, గ్రామాల్లో తక్కువగా ఉందని అంతకుముందు కొంతమంది అనేవారు. కానీ మా ఎగ్జిట్ పోల్‌లో రెండుచోట్లా ఒకే మాదిరి ఫలితాలు వచ్చాయి. పేద వర్గాల మహిళల్లో ప్రభుత్వ అనుకూలత ఎక్కువగా ఉందని, పథకాలు నేరుగా వారికి అందడంవల్ల వారు వైసీపీ వైపు మొగ్గుతో ఉన్నారనే వాదన కూడా నిజంకాదని తేలింది.
మెజారిటీ ప్రాంతాల్లో పురుషులు, మహిళల్లో ఒకే తరహా రాజకీయ అభిప్రాయం వ్యక్తమైంది. అన్ని వర్గాలూ ప్రభుత్వం మారాలని కోరుకున్నాయి’ అని ఆయన వివరించారు. కాగా, విజయం ఖాయమని గట్టి నమ్మకంతో ఉన్న టీడీపీ వర్గాలు.. తమకు లభించే సీట్ల సంఖ్య ఎంత ఉండొచ్చో కూడా అంతర్గతంగా అంచనాలు వేస్తున్నాయి. ‘గత ఎన్నికల్లో వైసీపీకి 49ు ఓట్లు లభిస్తే 151 అసెంబ్లీ సీట్లు లభించాయి. ఈసారి మా కూటమికి 50 శాతానికి మించి ఓట్లు వస్తాయని అంచనా. ఆ లెక్కన అంతకుమించిన సీట్లు మాకు రావాలి. ఏం జరుగుతుందో చూడాలి’ అని ఒక మాజీ మంత్రి పేర్కొన్నారు. టీడీపీ నేతల్లో ఇప్పుడు విజయం పై కంటే ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ జిల్లాలో ఎన్ని గెలుచుకోగలమన్న చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. కిందిస్థాయి నేతలను పిలిపించి ఓటింగ్ సరళిపై సమాచారం సేకరిస్తున్నారు. ఓటింగ్‌ను ప్రభావితం చేసిన అంశాలేమిటి.. ఏ వర్గాలపై ఈ అంశాలు ఎలాంటి ప్రభావం చూపాయన్న అంశం కూడా చర్చల్లో వస్తున్నాయి. ‘రాష్ట్రం దెబ్బతినిపోయింది... అభివృద్ధి లేకుండా పోవడం ఓటర్లను ఎక్కువ ప్రభావితం చేసినట్లు అనిపిస్తోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ అనేక చోట్ల ఓటర్ల నుంచి ఈ అభిప్రాయమే ఎక్కువగా వినిపించింది. అందువల్ల ఓట్లు, సీట్లలో పెద్దగా తేడాలు ఉండకపోవచ్చు. కూటమి అభ్యర్థి ఎక్కడైనా మరీ బలహీనంగా ఉంటేనో లేదా ఇంతకు మించిన స్థానిక అంశాలు ప్రభావం చూపిస్తేనో మాత్రమే ఫలితం వేరుగా ఉంటుంది’ అని అనేక ఎన్నికలు చూసిన ఒక సీనియర్ నేత విశ్లేషించారు.
Updated Date - May 15 , 2024 | 03:58 AM