మీడియాపై కేసు సరే.. ఎఫ్‌ఐఆర్‌లో ‘వారి’ పేర్లు ఏవీ?
ABN, Publish Date - May 21 , 2024 | 03:22 AM
విశాఖ నగరంలోని కంచరపాలెం బర్మా క్యాంపులో సుంకర ధనలక్ష్మి కుటుంబంపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన కీలక నిందితులపై పోలీసులు కేసు పెట్టకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
విశాఖ బర్మా క్యాంపు కేసులో కీలక నిందితులను తప్పించారా?
చర్చనీయాంశమైన పోలీసుల తీరు
‘ఫలానా’ వారే దాడి చేశారని బాధితులు చెబుతున్నా పట్టని వైనం
నిందితులకు వైసీపీతో సంబంధాలు
నేతల ఒత్తిడితోనే నిందితులను తప్పించారని బాధిత కుటుంబం ఆరోపణ
విశాఖపట్నం, మే 20(ఆంధ్రజ్యోతి): విశాఖ నగరంలోని కంచరపాలెం బర్మా క్యాంపులో సుంకర ధనలక్ష్మి కుటుంబంపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన కీలక నిందితులపై పోలీసులు కేసు పెట్టకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పైగా ఈ విషయాన్ని ప్రసారం చేశారంటూ మీడియాపై కేసులు పెట్టిన పోలీసులు.. నిందితులను వదిలేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనివెనుక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఉండి ఉంటాయని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. దీంతో ఈ వివాదాన్ని ‘వ్యక్తిగత కక్షలు’ అంటూ కొట్టి పారేస్తున్నారు. కానీ, ‘ఇది వైసీపీ వాళ్లు చేసిన దాడి’ అని బాధిత కుటుంబం చెబుతోంది. దాడి చేసిన వారందరి పేర్లు తాము చెబితే.. కేవలం ఒక్క లోకేశ్ పేరు తప్ప ఇంకెవరి పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో పెట్టలేదని ఆరోపిస్తోంది. ఇప్పటికీ వారితో తమకు ప్రాణభయం ఉందని, వారందరిపైనా చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబం కోరుతోంది. ఈ మేరకు వారు సోమవారం కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు.
ఇదీ జరిగింది
ఈ నెల 15వ తేదీ రాత్రి తమపై లోకేశ్‌తో పాటు భూలోక, చిన్ని, ఆశా, ఆశా భర్త, భాస్కర్, సాయి, మున్నా తదితరులు దాడి చేశారని బాధిత కుటుంబంలోని సుంకర నూకరత్నం, ధనలక్ష్మి, మణికంఠ ఆరోపిస్తున్నారు. ఇదే విషయం పోలీసులకు కూడా చెప్పారు. కానీ, ఎఫ్‌ఐఆర్‌లో ఒక్క లోకేశ్ పేరు మాత్రమే పెట్టి ఇతరుల పేర్లు చేర్చలేదు. ముఖ్యంగా భూలోక అనే యువకుడు ఉన్నాడు. వైసీపీలో కీలక కార్యకర్తగా పనిచేస్తున్నాడు. మిగిలినవారు కూడా అదే పార్టీకి చెందినవారు. ఈ కారణంగానే పోలీసులు వీరి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదని కుటుంబం ఆరోపిస్తోంది. ఇదిలావుంటే, ధనలక్ష్మి కుటుంబానికి ప్రధాని మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరైంది. ఎన్‌టీఆర్ హౌసింగ్ పథకం కింద రుణం తీసుకున్నారు. వీటికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆమె తన ఇంటి గోడకు అమర్చుకున్నారు. ఎన్నికల సమయంలో అలాంటివి ఉంచకూడదని వైసీపీకి చెందినవారు పదేపదే హెచ్చరించడంతో దానిపై కొద్దిరోజులు కాగితం అంటించారు. పోలింగ్ ముగిసిన తర్వాత కాగితం తీసేశారు. ఆ తర్వాత జరిగిన చర్చల్లో తాము కూటమికి ఓట్లు వేశామని, వైసీపీకి వేయలేదని ధనలక్ష్మి బయటకు చెప్పడంతో గొడవ మొదలైంది. ఈ కారణంగానే తమపై దాడి చేశారని నూకరత్నం, ధనలక్ష్మి చెబుతుండగా, వ్యక్తిగత కక్షలని పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో లోకేశ్ మరో ఇద్దరితో కలిసి మణికంఠను కొట్టాడని నమో దు చేసినా, ఆ ‘ఇద్దరు’ ఎవరో వెల్లడించలేదు. వారిని అరెస్టు కూడా చేయలేదు.
వారిని వదిలేసి మీడియాపై కేసు
మహిళలపై దాడి చేసి దారుణంగా కొట్టిన వారిని అరెస్టు చేయకపోగా, వారి పేర్లు కూడా గోప్యంగా ఉంచిన పోలీసులు, బాధితుల ఆవేదనను మీడియాలో ప్రసారం చేసినందుకు ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’పై కేసు నమోదు చేశారు. కంచరపాలెం పోలీసు స్టేషన్‌లో క్రైం నెంబరు 186/2024 కింద క్రిమినల్ కేసు పెట్టారు. స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు.
Updated Date - May 21 , 2024 | 03:22 AM