బాధితులను కేంద్రం ఆదుకుంటుంది
ABN, Publish Date - Sep 16 , 2024 | 03:19 AM
రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవడానికి కేంద్రం సానుకూలంగా ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వెల్లడి
రాజమహేంద్రవరం అర్బన్, సెప్టెంబరు 15: రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవడానికి కేంద్రం సానుకూలంగా ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తనను కలసిన మీడియాతో మాట్లాడుతూ వరద నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు రాగానే సహాయం అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే కేంద్రం తాత్కాలిక సాయం అందించిందని, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి చౌహాన్ వచ్చి పరిశీలించి వెళ్లారని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్నివిధాలుగా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించిందని, రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష చేస్తున్నదని తెలిపారు. సమస్యల సుడిగుండంలో ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంటును ఏ విధంగా బయటకు తీసుకురావాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ఈ ప్రైవేట్ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు రఘురామకృష్ణంరాజు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, దాట్ల బుచ్చిరాజు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 16 , 2024 | 03:19 AM