పాఠ్యాంశాలు మార్చేశారు!
ABN, Publish Date - Jul 12 , 2024 | 04:42 AM
వైసీపీ కార్యకర్తలా పనిచేసిన రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎ్‌ససీఈఆర్‌టీ) డైరెక్టర్ ప్రతా్‌పరెడ్డి నిర్వాకంతో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వ బడులకు ఒకలా..
ప్రైవేటు బడులకు మరోలా
టెన్త్ తెలుగు పాఠ్యపుస్తకంలో పొరపాట్లు
మొత్తం 24 చోట్ల.. మూడు పాఠాలు మార్పు
ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి నిర్వాకం
అమరావతి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): వైసీపీ కార్యకర్తలా పనిచేసిన రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎ్‌ససీఈఆర్‌టీ) డైరెక్టర్ ప్రతా్‌పరెడ్డి నిర్వాకంతో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది పదో తరగతి పాఠ్యపుస్తకాన్ని ఇష్టానుసారంగా మార్చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పాఠశాల విద్యాశాఖ ఏటా రెండు రకాల పుస్తకాలను ముద్రిస్తుంది. ఒకటి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇచ్చేందుకు ఉచిత పుస్తకాలు, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు కొనుగోలు చేసుకునే విక్రయ పుస్తకాలను తయారుచేస్తుంది. అయితే ఉచిత పుస్తకాలు, విక్రయ పుస్తకాల్లో కేవలం ఉచితం, అమ్మకం అనే పదాలు తప్ప ఇంకేవీ మారకూడదు. ఏ మేనేజ్‌మెంట్‌లో చదివినా విద్యార్థికి ఒకేరకంగా పరీక్షల ప్రశ్నావళి ఉంటుంది. అందువల్ల ఒక్క అక్షరం కూడా మార్చకుండా పుస్తకాలు ముద్రించి ఇస్తారు. కానీ ఈ ఏడాది పదో తరగతిలో తెలుగు పుస్తకాన్ని గందరగోళం చేశారు.
ఉచిత పుస్తకాలకు, విక్రయ పుస్తకాలకు మధ్య 24 చోట్ల మార్పులు చేశారు. పైన పద్యం ఒక్కటే ఉన్నప్పటికీ దాని కింద అడిగే ప్రశ్నల శైలి రెండు పుస్తకాల్లో వేర్వేరుగా ఉంది. అదీ కాకుండా, ఏకంగా మూడు పాఠ్యాంశాలనే మార్చేశారు. అంటే ఉచిత పుస్తకంలో ఉన్న పాఠాలకు, విక్రయ పుస్తకంలో ఉన్న పాఠాలకు సంబంధం లేదు. దీంతో ఈ ఏడాది ఆ పాఠాల నుంచి వచ్చే ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు ఎలా రాయాలనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉదాహరణకు విక్రయ పుస్తకంలో 149వ పేజీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పాఠం ఉంటే, ఉచిత పుస్తకంలో శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం, శాలివాటికపై పాఠం ఉంది. 126వ పేజీలో విక్రయ పుస్తకంలో కొమ్ము వాద్యం గురించి ఉంటే, తప్పెటగుళ్లు గురించి పాఠం ఇచ్చారు. 91వ పేజీలో పరనారీ సోదరుడై అనే పద్యం రెండింటిలో ఉన్నా ప్రశ్నలు రెండు పుస్తకాల్లో వేర్వేరుగా ఉన్నాయి. 72వ పేజీలో ప్రకృతి, వికృతిలను గుర్తించి రాయండి అనే చోట విక్రయ పుస్తకంలో సంక్రాంతి వేడుకల గురించి, ఉచిత పుస్తకంలో ‘రాజు శాసనలు చేస్తారు. రాయలు శాసనాలకు తిరుగులేదు’ అని ఉంది. ఇలా 70, 91, 94, 95, 127, 142, 145, 149 పేజీల్లోనూ అనేక మార్పులు ఉన్నాయి. ప్రశ్నలు అటూఇటూగా మారినా ఫరవాలేదని, కానీ పాఠాలే మారిపోతే ఎలాగని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
ముద్రణకు ఇచ్చాక మార్పులు
తొలుత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఒక కాపీని ముద్రణకు పంపారు. ఆ తర్వాత విక్రయ పుస్తకాల కాపీలో మార్పులు చేయడం వల్ల ఈ పొరపాట్లు వచ్చాయి. ఏటా ఒకసారి పుస్తకం సాఫ్ట్ కాపీ తయారుచేశాక మార్పులు చేయరు. కానీ ఈ ఏడాది ఎస్‌సీఈఆర్‌టీ చేసిన అత్యుత్సాహం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో అంతా తానే అన్నట్టుగా వ్యవహరించిన ప్రతా్‌పరెడ్డి నిర్వాకంతోనే ఈ నష్టం జరిగింది. ఆయన సతీమణి వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. మన వ్యక్తి అనే భావనతో గత ప్రభుత్వం ఆయనకు పెద్దపీట వేసింది. ఒకరకంగా పాఠశాల విద్యాశాఖపై పెత్తనం చేసే స్థాయిలో ఆయన వ్యవహరించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పశ్చిమ రాయలసీమ వైసీపీ అనుకూల అభ్యర్థిని గెలిపించడంలో ఆయనదే కీలక పాత్ర. అందుకే ఆ ఎన్నికల సమయంలో ఆయన్ను కడప ఆర్జేడీగా నియమించి వైసీపీ లబ్ధిపొందింది.
Updated Date - Jul 12 , 2024 | 08:55 AM