ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cabinet 1st Meeting : హంగూ ఆర్భాటాలొద్దు

ABN, Publish Date - Jun 25 , 2024 | 03:49 AM

‘మంత్రులు హంగూ ఆర్భాటాలు ప్రదర్శించవద్దు. ప్రజల్లో కలిసిపొండి. వారు మీ వద్దకు రాలేని పరిస్థితులు తెచ్చుకోవద్దు.

జూలైలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు!

ప్రజల్లో కలిసిపోండి.. పాలకులం కాదు.. వారికి సేవకులం

మనపై చాలా అంచనాలున్నాయి.. శాఖలపై అధ్యయనం చేయండి

బూతుల భాష వాడినవారు ఏమయ్యారో చూశాం.. అధికారులతో

సౌమ్యంగానే మాట్లాడండి.. కేబినెట్‌ తొలి భేటీలో చంద్రబాబు హితవు

పోలవరం నిర్మాణ పరిస్థితిపై ఆరా తీసిన పవన్‌

అన్న క్యాంటీన్లకు ట్రస్టు ఏర్పాటుచేద్దామన్న లోకేశ్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘మంత్రులు హంగూ ఆర్భాటాలు ప్రదర్శించవద్దు. ప్రజల్లో కలిసిపొండి. వారు మీ వద్దకు రాలేని పరిస్థితులు తెచ్చుకోవద్దు. పాలకులమన్న భావంతో కాకుండా ప్రజలకు సేవకులం అన్నట్లుగా మెలగండి’ అని కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికారు. సోమవారమిక్కడ సచివాలయంలో జరిగిన తొలి కేబినెట్‌ సమావేశంలో ఎజెండా అంశాలపై సమీక్ష ముగిసి అధికారులు వెళ్లిపోయిన తర్వాత ఆయన మంత్రులతో కొంతసేపు మాట్లాడారు. ‘ఎన్నికల్లో ప్రజలు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. సభలో మొత్తం 175 సీట్లు ఉంటే 164 సీట్లు మనకే ఇచ్చారు. ప్రజలకు మనపై చాలా అంచనాలు ఉన్నాయి. దాని కోసం మనం చాలా ఎక్కువ కష్టపడాలి. కొత్త మంత్రులు తమ శాఖలపై పట్టు తెచ్చుకోవాలంటే అవగాహన బాగా పెంచుకోవాలి. నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. మీ శాఖలకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయండి’ అని తెలిపారు. బూతుల భాష వాడవద్దని మంత్రులను హెచ్చరించారు. ‘గతంలో ఎవరు ఎలా మాట్లాడారో చూశాం. ప్రజలు వారిని అసహ్యించుకున్నారు. ఎదుటివారు ఎంత రెచ్చగొట్టినా రాజకీయంగా సమాధానం ఇవ్వండి. బూతుల ప్రయోగాలు వద్దు. అధికారులతో సౌమ్యంగా మాట్లాడండి. పనులు కాకపోతే మన ప్రాధాన్యాలు ఏమిటో ఒకటికి రెండుసార్లు చెప్పండి. పనులు జరగని చోట ఒత్తిడి పెంచండి’ అని సూచించారు. అలాగే అధికారులతో సుదీర్ఘ సమీక్షలు నిర్వహించవద్దని, సాయంత్రం ఆరు గంటల తర్వాత వారితో సమావేశాలు పెట్టవద్దని కోరారు. క్రమం తప్పకుండా రాష్ట్ర సచివాలయానికి రావాలని.. శాఖాధిపతుల కార్యాలయాలు కూడా సందర్శించాలని అన్నారు. ‘కార్యాలయ సిబ్బందిగా మంచి వాళ్లను పెట్టుకోండి. మీ శాఖలకు సంబంధించి వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక పెట్టుకుని దాని ప్రకారం పనిచేయండి. ప్రతి సమావేశానికీ సన్నద్ధమై వెళ్లండి. ఏదైనా ఒక పొరపాటు దొర్లితే అల్లరి చేయడానికి జగన్‌ మీడియా సదా సిద్ధంగా ఉంటుంది’ అని చెప్పారు. వచ్చే వారం నుంచి శాఖలవారీ సమీక్షలు మొదలుపెడతానన్నారు.

28న పోలవరంపై శ్వేతపత్రం

పోలవరం ప్రాజెక్టుపై ఈ నెల 28న శ్వేతపత్రం విడుదల చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆరా తీశారు. సీఎం స్పందిస్తూ.. ఈ నెలాఖరుకల్లా కేంద్ర జలశక్తి శాఖ నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం వస్తుందని.. వారి అధ్యయన నివేదికను బట్టి పనులు చేపడదామని చెప్పారు. అన్న క్యాంటీన్ల పునఃప్రారంభ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులను కూడా భాగస్వాములను చేస్తే బాగుంటుందని, వాటిని ఎక్కువగా వాడుకునేది వారేనని పవన్‌ తెలిపారు. దానికి చంద్రబాబు అంగీకరించారు. అన్న క్యాంటీన్లకు ఒక ట్రస్టు ఏర్పాటు చేస్తే.. విరాళాలు వస్తాయని, తద్వారా పేదలకు భోజన వసతిని నిరాటంకంగా కొనసాగించవచ్చని మంత్రి లోకేశ్‌ అభిప్రాయపడ్డారు. తిరుమలలో అన్నదాన కార్యక్రమానికి ట్రస్టు ఏర్పాటు చేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు వచ్చే నెలలో నిర్వహించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ గడువు జూలై నెలాఖరు వరకూ ఉంది. ఆర్డినెన్స్‌ ద్వారా దీని గడువును రెండు నెలలు పొడిగించవచ్చని అధికారులు చెప్పారు. ముఖ్యమంత్రి విముఖత చూపారు. పూర్తి బడ్జెట్‌ను తయారు చేసి జూలైలో అసెంబ్లీలో పెట్టి ఆమోదం తీసుకుందామన్నారు.


తప్పుల తడక రీసర్వేను ఏం చేద్దాం?

రాష్ట్రంలో భూముల రీసర్వేపై ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుంది. రీసర్వే ఆధారంగానే ఆంధ్రప్రదేశ్‌ టైటిలింగ్‌ చట్టం అమలు చేయాలని గత జగన్‌ సర్కారు భావించింది. అయితే ఇది రైతుకంటక చట్టమని టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే రద్దుచేసింది. సోమవారంనాటి కేబినెట్‌ సమావేశంలో ఆ చట్టం రద్దుపై తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించారు. ఈ నేపథ్యంలో దీనికి మూలమైన భూముల రీసర్వే గురించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ భేటీలో లేవనెత్తినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌ సర్వే-సరిహద్దుల చట్టంను ఆనుసరించి భూముల కొలతలు వేయలేదని, అడ్డగోలుగా రికార్డులు తయారుచేశామని సర్వేయర్లే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రీసర్వే పేరిట తయారుచేసిన రికార్డుల్లో తప్పులున్నాయని, ఇవి తమ దృష్టికి తీసుకురావొద్దని సర్వే ఉన్నతాధికారి బెదిరించేవారని కూడా నివేదించారు. మరోవైపు రీసర్వేను కూడా రద్దుచేసి, 2020 డిసెంబరు నాటికి ఉన్న రికార్డులను కొనసాగించేలా విధాన నిర్ణయం తీసుకోవాలని రైతులు, రెవెన్యూ నిపుణులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇవే అంశాలను చంద్రబాబు ప్రస్తావిస్తూ.. త్వరలో సమీక్ష చేస్తానని చెప్పినట్లు తెలిసింది.

పింఛన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలి..

జూలై 1న పెంచిన పింఛన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. ఎక్కడైనా వారు రాకపోయినా పంపిణీ ఆపవద్దని అధికారులకు సూచించారు. ఎన్నికల సమయంలో పొరుగు జిల్లాలకు బదిలీ అయిన ఎమ్మార్వోలు గతంలో పనిచేసిన జిల్లాలకు తిరిగి రావడానికి అవకాశం కల్పించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

అసలే వర్షాకాలం..

రోడ్లపై గుంతలు పూడ్చండి

రహదారులపై ఉన్న గుంతలు పూడ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రోడ్లు-భవనాల (ఆర్‌అండ్‌బీ) శాఖను ఆదేశించారు. మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. అసలే వర్షాకాలమని, ప్రమాదకర గుంతలను గుర్తించి వాటిని పూడ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి సూచించారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉందని, వాటిని బాగుచేయాలని చెప్పారు. రహదారుల స్థితిగతులపై తక్షణమే పరిశీలన చేయాలని, గుంతలు పూడ్చడానికి ఎంత ఖర్చవుతుందో అంచనావేసి.. నిధులు సమకూర్చుకుని.. పూడ్చే కార్యక్రమం ప్రారంభించాలని తెలిపారు. పలువురు మంత్రులు కూడా తమ ప్రాంతాల్లో రోడ్ల దుస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాగా.. రహదారుల నిర్వహణ, మరమ్మతులపై చీఫ్‌ ఇంజనీర్లతో మంత్రి సమావేశం కానున్నట్లు సమాచారం.

Updated Date - Jun 25 , 2024 | 05:28 AM

Advertising
Advertising