‘జే గ్యాంగ్’ ఆట కట్టు!
ABN, Publish Date - Sep 25 , 2024 | 04:42 AM
వైసీపీ వందిమాగధుల మద్యం దోపిడీ బయటికి వస్తోంది. ఐదేళ్ల పాటు జగన్ పాలనలో పేదలను దోచిన కుట్రకోణం వెలుగులోకి వస్తోంది..
బలంగా బిగుస్తున్న సీఐడీ ఉచ్చు
వైసీపీ హయాంలో ‘జే బ్రాండ్’ పేరిట పేదల రక్తాన్ని పీల్చేసి వేల కోట్లు వెనకేసుకున్న తాడేపల్లి ప్యాలె్‌సలో అవినీతి మద్యం కంపు ముక్కుపుటాలు అదిరేలా వస్తోంది.. మద్యం తయారీ మొదలు కొనుగోలు వరకూ... సరఫరా నుంచి విక్రయాల వరకూ.. అన్నీ నాడు జగన్ గ్యాంగ్ గుప్పిట పెట్టుకుంది. ఈ గ్యాంగ్ ఆనాడు సాగించిన అక్రమ దందా వెలికితీసే పనిలో నిమగ్నమైన సీఐడీ మంగళవారం కీలక ముందడుగు వేసింది. మూడు నెలల క్రితం నమోదైన కేసులో సీజ్ చేసిన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి గదిని సీఐడీ అధికారులు జల్లెడ పట్టారు. అక్కడి ఫైళ్లు, డాక్యుమెంట్లు, కంప్యూటర్లలోని సమాచారాన్ని విశ్లేషించే క్రమంలో ‘జే బ్రాండ్’ డొంక భారీగా కదిలి నట్టు సమాచారం. బాధ్యులకు సంకెళ్లు వేసేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నారు.
నాసిరకం మద్యం స్కామ్ దర్యాప్తులో ముందడుగు
ఏపీ బ్రూవరీస్ కార్యాలయంలో తనిఖీలు
మాజీ ఎండీ వాసుదేవరెడ్డి గది తెరిచిన అధికారులు
మద్యం కేసులో కీలక ఆధారాల సేకరణ?
మద్యం తయారీ కంపెనీలు ఎవరి చేతుల్లోకి
నాడు బలవంతంగా వెళ్లాయనేది తేలిన వైనం
తాజా సాక్ష్యాధారాలతో కొత్త కేసు నమోదు
తాడేపల్లి దోపిడీ బాగోతం త్వరలో వెలుగులోకి
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
వైసీపీ వందిమాగధుల మద్యం దోపిడీ బయటికి వస్తోంది. ఐదేళ్ల పాటు జగన్ పాలనలో పేదలను దోచిన కుట్రకోణం వెలుగులోకి వస్తోంది.. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చి వెంటనే మాట మార్చిన మోసగాడి గుట్టు బయట పడుతోంది.. స్టార్ హోటళ్లలో తప్ప ఎక్కడా లిక్కర్ లేకుండా చేస్తానంటూ నాసిరకం మద్యాన్ని స్టార్ హోటళ్ల ధరలకు విక్రయించిన వంచకుడి బండారం బయట పడుతోంది.. జే బ్రాండుతో పేదల రక్తాన్ని పీల్చేసి వేల కోట్లు వెనకేసుకున్న తాడేపల్లి ప్యాలె్‌సలో అవినీతి మద్యం కంపు ముక్కుపుటాలు అదిరేలా వస్తోంది.. మద్యం తయారీ మొదలు కొనుగోలు వరకూ... సరఫరా నుంచి విక్రయాల దాకా.. అన్నీ గుప్పిట పెట్టుకుని జగన్ గ్యాంగ్ సాగించిన అక్రమ దందా వెలికితీసే పనిలో నిమగ్నమైన సీఐడీ మంగళవారం కీలక ముందడుగు వేసింది. రూ.వేల కోట్ల స్కాంకు మూలమైన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై 3 నెలల క్రితం దొంగతనం కేసు నమోదైంది. ప్రసాదంపాడులోని బేవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి రాత్రి పదింటికి ఎవరో కారులో ఫైళ్లు, కొన్ని బాక్సులు పట్టుకెళుతున్నారంటూ అందిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదుచేసింది. అప్పట్లోనే తనిఖీలు చేసింది. మొత్తం సమాచారాన్ని సేకరించి అసలు సూత్రధారులు, వేలకోట్ల కమీషన్లు పొందిన వారికి ఉచ్చు బిగించేందుకు సంసిద్ధమైంది. అన్నింటికీ ప్రధాన సాక్షి అయిన వాసుదేవ రెడ్డి కోసం వెతికిన సీఐడీ అధికారులకు కీలక ఆధారాలు లభించాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించి న్యాయపరమైన అడ్డంకుల్లేకుండా జాగ్రత్త పడ్డ దర్యాప్తు అధికారులు, అదే సమాచారంతో తాజాగా సోదాలకు దిగారు. మంగళవారం సాయంత్రం కార్పొరేషన్ ఆఫీసుకు చేరుకున్న సీఐడీ బృందాలు గతంలో సీజ్ చేసిన వాసుదేవ రెడ్డి కార్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. ఆయన గదిలో ఫైళ్లు, కంప్యూటర్లు, ఇతరత్రా కీలక ఆధారాలు సేకరించాయి.
దర్యాప్తు అధికారులే నివ్వెరపోయేలా...
వాసుదేవరెడ్డి గదిలో జరిపిన తనిఖీల్లో కొత్తగా లభ్యమైన సమాచారం సీఐడీ అధికారులనే నివ్వెరపాటుకు గురిచేసినట్టు సమాచారం. ప్రభుత్వమే ఇంత నాసికరం మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిందా అని ఆశ్చర్యపోయారు. వైసీపీ ప్రభుత్వంలో పెద్దలు, సన్నిహితులు, అనుయాయులు కోటరీగా ఏర్పడి ఇతర యాజమాన్యంలో ఉన్న డిస్టిలరీస్, బ్రూవరీ్‌సను కైవసం చేసేసుకున్నారు. అప్పటినుంచి జనంపైకి జే బ్రాండ్ల మద్యం వదిలారు. దీనివెనుక వేల కోట్ల కుంభకోణం పథక రచన ఉన్నట్లు సీఐడీ అధికారులు పసిగట్టారు. ఈ బ్రాండ్లు అమ్ముడుపోని అడిగే వ్యాపారుల్లేకుండా మద్యం దుకాణాలన్నీ నాడు ప్రభుత్వమే తన చేతిలో పెట్టుకుంది. కొనుగోలు దారులు ఏది అడిగినా మేమిచ్చిందే తీసుకో.. అంటూ ప్రాణాంతకమైన జె బ్రాండ్ల సీసాలు ఇవ్వడంలో అవినీతిని గుర్తించారు. అత్యంత నాసిరకమైన రసాయనాలతో తయారు చేసిన నాటు సారా కన్నా హాని కరమైన మద్యం విక్రయించి లక్షలాది మంది ఆరోగ్యంతో ఆడుకున్న వారికి సంకెళ్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు.
కీలక ఆధారాలతో కొత్తగా ఎఫ్‌ఐఆర్!
2019 జూన్ నుంచి మద్యం తయారు చేసిన కంపెనీలు ఎవరి చేతుల్లోకి బలవంతంగా వెళ్లాయనేది సీఐడీ గుర్తించింది. ‘జే బ్రాండ్ల’న్నీ జగన్ అనుయాయుల కంపెనీలకు చెందినవేనని రుజువు చేసే పక్కా ఆధారాలు సేకరించింది. వాటికి ఇష్టారాజ్యంగా అనుమతులిచ్చి ప్రాణాంతక రసాయనాలతో మద్యం తయారు చేయించిన వైనాన్ని పసిగట్టింది. వాసుదేవరెడ్డి జే బ్రాండ్లు, లేబుళ్లకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేశారు. దీనివెనుక తాడేపల్లి నుంచి వచ్చిన ఒత్తిళ్ల మర్మాన్ని చేధించింది. ఆ మద్యాన్ని జగన్ అనుయాయుల కంపెనీల నుంచే బేసిక్ ధర కన్నా ఎక్కువ చెల్లించి కొనుగోలు చేసి ప్రభుత్వ ఖజానాకు పెట్టిన కన్నాన్ని గుర్తించింది. బేసిక్ ధర ఎక్కువగా చెల్లించడం వల్ల బేవరేజె్‌సకు వాటిల్లిన భారీ నష్టాన్ని అంచనా వేసింది. తనిఖీల్లో భాగంగా.. ప్రసాదంపాడులోని ఏపీ డిస్టలరీస్ అండ్ బ్రూవరీస్ కార్యాలయంలో గతంలో పనిచేసిన సిబ్బందిని పిలిచి కూపీ లాగారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎఫ్‌ఐఆర్‌ను సీఐడీ నమోదుచేసింది. అయితే, ఎవరు నిందితులు.. పెట్టిన సెక్షన్లు.. లభ్యమైన సాక్ష్యాలు.. ఇతరత్రా వివరాలు బయటికి చెప్పడం లేదు. తమకు లభించిన ఆధారాల మేరకే బాధ్యులపై కేసు నమోదు చేశామని, దర్యాప్తులో వెల్లడయ్యే మరిన్ని సాక్ష్యాల ఆధారంగా వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.
Updated Date - Sep 25 , 2024 | 04:42 AM