ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సర్కారును సిబ్బందే పోషిస్తున్నారట!

ABN, Publish Date - Apr 27 , 2024 | 04:20 AM

రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు, పింఛనులు ఇవ్వడానికే సర్కారు వద్ద నిధులు లేవు. నెలనెలా అప్పులు తెచ్చి గండాలు దాటుతోంది.

వారి పేరిట చెక్కులు తీసిన సర్వేశాఖ.. గతంలోనూ ఇలాగే చిల్లర పనులు

ఉద్యోగులకు పెళ్లి భోజనాలు పెట్టించి హోటల్‌ ఖర్చు కింద చెక్కులు జారీ

‘మీ సేవ’ నిధులను కొల్లగొట్టిన వైనం

‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో వెలుగులోకి

అయినా, సర్వేశాఖలో ఆగని చేతివాటం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు, పింఛనులు ఇవ్వడానికే సర్కారు వద్ద నిధులు లేవు. నెలనెలా అప్పులు తెచ్చి గండాలు దాటుతోంది. ఈ సమయంలో సర్వేశాఖ ‘మీ సేవ’ నిధులను అడ్డగోలుగా వాడేసుకుంటోంది. నిధులు ఏ అవసరానికి వాడుకున్నారో చెప్పడానికి లక్షల రూపాయలు వెచ్చించి ఖరీదైన మొక్కలు కొనుగోలు చేసినట్లుగా బిల్లులు తీసుకొస్తోంది. ఇది సరిపోదన్నట్లుగా సర్వేశాఖలోని ఉద్యోగులు ప్రభుత్వ అవసరాలకోసం ఖర్చులు పెట్టినట్లుగా లెక్కలు చూపి వారి పేరిట లక్షలాది రూపాయలకు చెక్‌లు జారీ చేస్తున్నారు. అసలే ఎన్నికల సమయం. ఏం చేసినా ఎవ్వరికి తెలియదనుకున్నారో ఏమోగానీ, విచ్చలవిడిగా ఖర్చులు, లెక్కలు రెడీ చేశారు. గతంలోనూ ‘మీ సేవ’ నిధుల అడ్డగోలు వినియోగానికి సర్వే అధికారి ఇలాంటి చిల్లర పనులే చేశారు. ఉద్యోగులను పెళ్లి విందుకు తీసుకెళ్లి బయట హోటల్‌లో భోజనం చేసినట్లు బిల్లులు పెట్టి తమ కక్కుర్తి చాటుకున్నారు. విషయం బయటకు రాగానే కొంతకాలం మౌనంగా ఉండి, ఇప్పుడు ఎన్నికల సమయంలో మరోసారి తమ విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. సర్వే శాఖ అందించే సేవలు అంటే భూముల సర్వే, సబ్‌ డివిజన్‌ వంటివి పొందడానికి రైతులు మీ సేవ ద్వారా ఫీజులు చెల్లిస్తున్నారు. అవి నేరుగా సర్వేశాఖ నియంత్రణలోని మీ సేవ ఖాతాలో ఉంటాయి. వాటిని నేరుగా ప్రభుత్వానికి జమ చేయాలి. అంతే తప్ప శాఖాపరమైన అవసరాలకు వినియోగించడానికి వీల్లేదని నిబంధనలున్నాయి. అయితే, సర్వేశాఖలో గత కొన్నేళ్లుగా మీ సేవ నిధులను ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. సర్వే కమిషనర్ల విచక్షణ మేరకు నిధులను శాఖాపరమైన అవసరాలకు వాడుకుంటున్నారు. ఇలా గత నాలుగున్నరేళ్ల కాలంలో రూ.270 కోట్లపైనే వినియోగించారు. బిల్లులను చూస్తే నిధులు ఇలా కూడా వాడుకుంటున్నారా? అని తలతిరిగిపోయేలా అధికారులు వ్యవహరిస్తున్నారు. సర్వేశాఖలో నిధుల వినియోగంలోని అక్రమాలు, దొంగ పద్ధతులను ‘ఆంధ్రజ్యోతి’ గత ఏడాది ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చింది. ఉద్యోగులు తమ సొంత డబ్బును ప్రభుత్వ అవసరాలకోసం ఖర్చుపెట్టినట్లుగా లెక్కలు చూపి, ఆ మేరకు వారి పేరిట లక్షల రూపాయల చెక్‌లు జారీ చేశారు. మీ సేవ నిధుల నుంచే ఆ చెక్‌లను క్లియర్‌ చేశారు. ఇలా చెక్‌నెంబర్లు, ఉద్యోగుల పేర్లను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. చివరికి సర్వేశాఖలోని ఓ ఉద్యోగి ఇంట పెళ్లికి వెళ్లి అక్కడే భోజనాలు చేసి, బయట క్యాటరింగ్‌ తీసుకున్నట్లుగా బిల్లులు సృష్టించిన ఘనత ఇక్కడి అధికారులది. ఈ ఉదంతాన్ని కూడా ఆంధ్రజ్యోతి ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చింది. వీటిపై విచారణ చేపట్టాలన్న డిమాండ్లు వచ్చినా రెవెన్యూ, సర్వే అధికారులు కూడబలుక్కొని ఒక్కటయ్యారు. విచారణే లేకుండా వివరణలతో విషయాన్ని ముగించారు.

గుట్టుగా ఖాతా మార్పు

ఇటీవలి కాలంలో సర్వే కమిషనరేట్‌ను విజయవాడలోని కరెన్సీ నగర్‌ నుంచి మంగళగిరిలోని ఏపీఐఐసీ బిల్డింగ్‌కు మార్చారు. సర్వేశాఖ మీసేవ నిధుల ఖాతా రామవరప్పాడు రింగ్‌లో ఉన్న యూనియన్‌బ్యాంక్‌లో ఉండేది. ఆ ఖాతా లావాదేవీలు బయటకు వచ్చాకే మీ సేవ నిధుల దుర్వినియోగం బయటపడింది. దీంతో అధికారులు జాగ్రత్త పడి ఆ ఖాతాను మూసివేశారు. గురునానక్‌నగర్‌ కాలనీలోని ఎస్‌బీఐలో కొత్తగా ఖాతా తెరిచారు. నిజానికి కొత్త ఖాతా ఏర్పాటు చేయాలనుకుంటే, ఆఫీసు ఉన్న మంగళగిరిలోనే ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అందుకు భిన్నంగా విజయవాడలోని గురునానక్‌ కాలనీలోని ఎస్‌బీఐలో ఖాతా తెరిచారు. ఇది కూడా అనేక అనుమానాలకు తావిచ్చేలా ఉంది. ఈ అనుమానాలను నిజం చేసేలా ఇప్పుడు నిధుల వినియోగంలోని చిత్రాలు బయటకొస్తున్నాయి. ఎన్నికల సమయంలో సరిగ్గా నాలుగు రోజుల క్రితం సర్వే అధికారులు లక్షల రూపాయలు వ్యయం చేసి మొక్కలు కొన్నారు. ఇంత అర్జంటుగా మొక్కలు కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? పైగా, కొనుగోలు చేసిన మొక్కలేవీ సర్వే ఆఫీసు పరిసరాల్లో కనిపించడం లేదు. అలాగని , ఆశాఖ సొంతంగా న ర్సరీ కూడా నిర్వహించడం లేదు. ఒక పక్క ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో నిండా మునిగిపోతే, సర్వే అధికారులు లక్షలాది రూపాయలతో మొక్కలు కొన్నారు. నిజంగా వాటిని కొనుగోలు చేశారా? లేక ఆ పేరిట బిల్లులు సృష్టించారో అంతుచిక్కడం లేదు. పోరంకిలోని ఓ నర్సరీ నుంచి లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసినట్లుగా బిల్లులు తెచ్చారు.

ఉద్యోగుల పేరిట మళ్లీ చెక్కులు

సర్వేశాఖ ప్రభుత్వంలో ఓ విభాగం. అ శాఖ ఏ పనిచేయాలన్నా ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. ఉద్యోగులు తమ జేబుల్లో నుంచి రూపాయి తీసి ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. నిజంగానే ఉద్యోగులతో ఖర్చుపెట్టించేంతగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతాళానికి పడిపోలేదు. కానీ సర్వేశాఖ చేస్తున్న పనులు చూస్తే ప్రభుత్వాన్ని ఉద్యోగులే ఆదుకుంటున్నట్లుగా ఉంది. ఆ శాఖ పరిధిలో వివిధ అవసరాలకు ఉద్యోగులు సొంతంగా డబ్బు ఖర్చుపెట్టుకున్నట్లుగా లెక్కలు చూపిస్తోంది. ఆ డబ్బును తిరిగి రీఎంబర్స్‌మెంట్‌ చేస్తున్నట్లుగా రికార్డులు తయారుచేస్తోంది. ఈ మేరకు ఉద్యోగులకు సొమ్ము చెల్లిస్తున్నట్లుగా వారి పేరిట చెక్‌లు జారీ చేస్తోంది. ఎన్నికల కోడ్‌ రావడానికి ముందు ఫిబ్రవరిలో, కొడ్‌ వచ్చాక మార్చి, ఏప్రిల్‌లో పలువురు ఉద్యోగుల పేరిట చెక్‌లు జారీ చేశారు. ఇవి ఎందుకిచ్చారు? ఆ నిధులను ఎక్కడ ఖర్చుపెట్టారో సర్వేశ్వరుడికే తెలియాలి.

Updated Date - Apr 27 , 2024 | 04:20 AM

Advertising
Advertising