ఐపీఎస్‌ల బెయిల్‌పై విచారణ వాయిదా
ABN, Publish Date - Dec 03 , 2024 | 05:30 AM
ముంబై నటి కాదంబరి జెత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.
జెత్వానీ కేసులో ముగిసిన పిటిషనర్ల వాదనలు
అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ముంబై నటి కాదంబరి జెత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. సోమవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫు వాదనలు ముగిశాయి. ప్రాసిక్యూషన్ తరఫు వాదనల కోసం విచారణ వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాజ్యాలపై నిర్ణయం వెల్లడించే వరకు పిటిషనర్లపై తొందరపాటు చర్యలు వద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించారు. కాదంబరి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారులు క్రాంతిరాణా తాతా, విశాల్ గున్నీ, అప్పటి విజయవాడ ఏసీపీ హనుమంతరావు, దర్యాప్తు అధికారి సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు... కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. దీంతో సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ సరిత వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు సోమవారం మరోసారి విచారణకు వచ్చాయి. అప్పటి ఏసీపీ హనుమంతరావు తరఫున సీనియర్ న్యాయవాది పట్టాభి వాదనలు వినిపించారు. జెత్వానీపై కేసు నమోదు, దర్యాప్తు విషయంలో పిటిషనర్ చట్టనిబంధనల ప్రకారమే నడుచుకున్నారని అన్నారు. సీఐడీ కౌంటర్‌లో పేర్కొన్న విషయాలను పత్రికల్లో ప్రచురించడంపై అభ్యంతరం తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న కేసుపై మీడియా ట్రయల్ నిర్వహించడం సరికాదని, ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందన్నారు. పిటిషనర్లపై న్యాయస్థానానికి దురభిప్రాయాన్ని కలిగించేందుకు ప్రయత్నం చేశారన్నారు. అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ... సీనియర్ న్యాయవాది ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపిస్తున్నారా? లేక వార్తల ప్రచురణపై ఏమైనా గ్యాగ్ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నారా? అని సందేహం వ్యక్తం చేశారు. వివిధ కేసుల్లో వాదనలు వినిపిస్తున్న చాలామంది న్యాయవాదులు మీడియా ముందుకు వెళ్లి ప్రకటనలు చేస్తున్నారని గుర్తు చేశారు. వ్యాజ్యాలపై మరో రోజు వాదనలు వినిపిస్తానన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.
Updated Date - Dec 03 , 2024 | 05:30 AM