గ్రాబింగ్ చట్టం రద్దుపైనే.. రెండో సంతకం!
ABN, Publish Date - May 02 , 2024 | 05:53 AM
నిన్న మొన్నటి వరకు ఆస్తులు బలవంతంగా బెదిరించి లాక్కున్నారు. ఇప్పుడా అవసరం లేకుండా ఏకంగా రికార్డులు మార్చి భూములు స్వాహా చేయడానికి జగన్ ల్యాండ్ టైటిల్ చట్టం తెచ్చారు.
రికార్డులు మార్చి భూముల స్వాహాకే ల్యాండ్ టైటిల్ చట్టం: చంద్రబాబు
మళ్లీ ఉచితంగా ఇసుక.. 50 ఏళ్లకే ముస్లింలకు పింఛన్.. ఇమాంలకు గౌరవ వేతనం 10 వేలు
బందిపోట్లను మించిన దోపిడీ.. వ్యవస్థలన్నీ నాశనం
డ్రైవింగ్ తెలియని వ్యక్తికి డ్రైవర్ బాధ్యతలిస్తే ఇంతే
13 లక్షల కోట్ల అప్పుతెచ్చి ఊబిలో పడేశాడు
బీసీలకు ఏటా 30 వేల కోట్ల బడ్జెట్
ప్రతి చేనేత కుటుంబానికీ ఏటా 24 వేలు
‘పవర్‌లూం’కు 500 యూనిట్ల ఉచిత కరెంట్
మత్స్యకారుల పొట్టగొట్టే 217 జీవో రద్దు
ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే విద్యుత్
గుంటూరు/బాపట్ల, మే 1 (ఆంధ్రజ్యోతి): ‘నిన్న మొన్నటి వరకు ఆస్తులు బలవంతంగా బెదిరించి లాక్కున్నారు. ఇప్పుడా అవసరం లేకుండా ఏకంగా రికార్డులు మార్చి భూములు స్వాహా చేయడానికి జగన్ ల్యాండ్ టైటిల్ చట్టం తెచ్చారు. మేం అధికారంలోకి రాగానే నా మొదటి సంతకం మెగా డీఎస్సీపైన అయితే.. రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దుపైనే’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో ఈ ఐదేళ్లూ బందిపోట్లను మించిన దోపిడీ జరిగిందన్నారు. మాఫియాలతో సకల వ్యవస్థలను నాశనం చేశారని.. ప్రజాస్వామ్యాన్ని తిరిగి నెలకొల్పే బాధ్యత తమ కూటమిదేనని అని స్పష్టం చేశారు. డ్రైవింగ్ తెలియని వ్యక్తికి డ్రైవర్ బాధ్యతలు అప్పగిస్తే ఇలానే ఉంటుందన్నారు. పరిపాలన చేతకాని దద్దమ్మ జగన్ అని మండిపడ్డారు. ప్రజాగళంలో భాగంగా బుధవారం బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. సాయంత్రం గుంటూరులో భారీ రోడ్‌షో నిర్వహించారు. సుమారు 5 కిలోమీటర్ల పొడవున సాగిన ఈ రోడ్‌షోలో జనం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అనంతరం జిన్నాటవర్ సెంటర్ వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కార్మికుల దినోత్సవం సందర్భం గా చీరాల-పేరాల ఉద్యమ స్ఫూర్తిగా ఈ పది రోజులూ ఈ దుర్మార్గ ప్రభుత్వంపై పోరాడాలని పిలుపిచ్చారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు. స్కూళ్లకు రంగులేసినంత మాత్రాన పిల్లలకు చదువురాదన్నారు. ఒక్క టీచర్ కూడా లేని పాఠశాలలు చాలా ఉన్నాయని గుర్తుచేశారు. ఈ సీఎం టీచర్లను బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టాడని ఆక్షేపించారు. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆలోచించి ఓటేయాలని కోరారు.
మా మేనిఫెస్టో అదుర్స్..
మేనిఫెస్టో విషయంలో జగన్ చేతులెత్తేశాడు. మా కూటమి మేనిఫెస్టో అదిరిపోయింది. 13లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాడు. సంపద సృష్టి లేకపోవడంతో అప్పిచ్చేవాడు కరువై చేతులెత్తేశాడు. జగన్ అనేక చెడ్డపనులు చేసినా ఎక్కడన్నా ఒకట్రెండు మంచిపనులు చేసి ఉంటే వాటిని కొనసాగిస్తాం. సైకోకు, నాకు ఉన్నా తేడా అదే. తొలినుంచి టీడీపీకి వెన్నెముక బీసీలే.. బీసీ డిక్లరేషన్, జయహో బీసీ పెట్టాం. సంవత్సరానికి 30వేల కోట్ల బడ్జెట్ పెడతాం. 50 ఏళ్లకే పింఛన్ అందిస్తాం. చేనేత కార్మికులకు పవర్‌లూంలు ఉంటే 500యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తాం. ప్రతి చేనేత కుటుంబానికి రూ.24,000 ఆర్థిక సాయం అందిస్తాం. మత్స్యకారుల పొట్టగొట్టే 217 జీవోను రద్దు చేస్తాం. ఆక్వా రైతులకు రూ.1.50కే కరెంటు ఇస్తాం. ఉచిత ఇసుక విధానం తెస్తాం. ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల ఆరోగ్య బీమాతో పాటు సంవత్సరానికి 4లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం. కాపులు ఎక్కువగా ఉన్న చోట వారికి అధికంగా ఇస్తాం.
ప్రజల ఆస్తిపై కొత్తగా ఇచ్చే హక్కేంటి?
భూములకు సంబంధించి 10(1), అడంగల్, పట్టాదార్ పాసుపుస్తకం తరతరాలుగా వస్తున్నాయి. వాటిని గ్రాబింగ్ యాక్టుతో రద్దు చేస్తాడంట!. కొత్త చట్టంలో పట్టాలిస్తాడంట! ప్రజల ఆస్తిపై ఆయన కొత్తగా ఇచ్చే హక్కు ఏంటి? వాళ్ల పట్టాలపై, సర్వే రాళ్లపైనా ఈయన ఫొటో వేసుకున్నాడు. సైకో మనస్తత్వం కాకపోతే మరేమిటి? వైసీపీ దొంగలు ఆన్‌లైన్‌లో మీ పేరు మీద ఉన్న ఆస్తి మార్చేస్తే ఆ తర్వాత గింజుకున్నా లాభం ఉండదు. ఆత్మహత్యలే శరణ్యమవుతాయి. జగన్ సొంత జిల్లా ఒంటిమిట్టలో ఒక చేనేత కార్మికుడి స్థలాన్ని వైసీపీ నాయకుడు తన పేరిట మార్చుకున్నాడు. ఆ బాధితుడు ఆఫీసుల చుట్టూ న్యాయం కోసం తిరిగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన భార్య కూడా చనిపోయింది. కుమార్తె ఒంటరి కావడంతో రూ.5 లక్షలు ఇచ్చి ఆదుకున్నాను.
బీజేపీతో కొత్తగా కలవలేదు
నేను బీజేపీతో కలిశానని.. అధికారంలోకి రాగానే 4ు ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తానని.. మసీదులు కూలుస్తానని నాపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీతో నేను కొత్తగా కలవలేదు. గతంలోనూ పొత్తు ఉంది. అయినా ముస్లింల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన అందించాం. హైదరాబాద్‌లో ఉర్దూ యూనివర్సిటీ, హాజ్‌హౌస్, ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పెద్దపీట వేశాం. కర్నూలులో ఉర్దూ వర్సిటీ, కడప, విజయవాడలో హజ్‌హౌస్ ఏర్పాటు చేశాం. మా ప్రభుత్వం రాగానే 50ఏళ్లకే ముస్లింలకు పింఛన్ ఇచ్చే ఆలోచన చేస్తున్నాం. ఈద్గా, కబరస్థాన్‌లకు స్థలాలు, హజ్‌యాత్రకు రూ.లక్ష ఆర్థిక సాయం, నూర్‌బాషాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.100 కోట్లు అందిస్తాం. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలిస్తాం. ఇమాం, మౌజన్‌ల గౌరవ వేతనాలను రూ.10 వేలకు పెంచుతాం. అర్హత ఉన్న ఇమాం, మౌజన్‌లను ప్రభుత్వ కాజీలుగా నియమిస్తాం. ప్రతినెలా మసీదుల నిర్వహణకు రూ.5వేల చొప్పున ఇస్తాం. ఈనెల 13.. చరిత్ర తిరగరాసే రోజన్న విషయం గుర్తించాలి. ఎండగా ఉందని ఇంట్లో కూర్చోకుండా అందరూ బయటకు వచ్చి ఓటు వేయాలి. 2019లో మీ భూమి విలువ ఇప్పుడు లేదు. అద్దెలు పెరగలేదు. కొనుగోలు శక్తి పెరగలేదు. అయినప్పటికీ సైకో అన్ని చేసేశానంటున్నాడు. మీకు అమరావతి రాజధాని కావాలంటే మీలో రోషం, కోపం రావాలి. అవి ఉంటే ఈ వైసీపీ వాళ్లు తిరగగలుగుతారా? వాళ్లు వస్తే ముందు అమరావతికి జై కొట్టి ఆ తర్వాత ఓట్లు అడగమనండి. 3 రాజధానుల పేరుతో మీ పొట్టలు కొట్టి మిమ్మల్ని ఓటు అడిగే హక్కు వారికి ఎక్కడిది?
జగన్ ఓ వ్యాపారి, దళారి. ప్రజలను బలహీనతలను సొమ్ము చేసుకుని నాసిరకం మద్యంతో 30,000 మంది మహిళల తాళిబొట్లు తెంచాడు. ఇసుక మాఫియాతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉసురుపోసుకున్నాడు.
పెంచే రూ.4,000 పింఛన్ ఏప్రిల్ నుంచే ఇస్తాం. అంటే జూలైలో రూ.7,000 చెల్లిస్తాం.
- చంద్రబాబు
Updated Date - May 02 , 2024 | 05:53 AM