ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ‘సూపర్‌ సిక్స్‌’కు ఊతం!

ABN, Publish Date - Nov 11 , 2024 | 05:28 AM

సూపర్‌ సిక్స్‌ పథకాలకు పెద్దపీట.... అభివృద్ధిని అందలం ఎక్కిస్తూ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు సాగనున్నాయి.

  • అభివృద్ధికి అందలం.. నేడే బడ్జెట్‌ సమర్పణ

  • రెండు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్లకు కలిపి 2.39 లక్షల కోట్లకు ఇప్పటికే ఆమోదం

  • రూ.2.9 లక్షల కోట్లతో 2024-25 పూర్తిస్థాయి బడ్జెట్‌

  • ఇరిగేషన్‌, రహదారులకు పెద్దపీట

  • దేవదాయం, జ్యుడీషియల్‌, మద్యం, ల్యాండ్‌ గ్రాబింగ్‌పై బిల్లులు

  • శాసనసభలో కేశవ్‌, మండలిలో కొల్లు సమర్పణ

అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): సూపర్‌ సిక్స్‌ పథకాలకు పెద్దపీట.... అభివృద్ధిని అందలం ఎక్కిస్తూ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు సాగనున్నాయి. సోమవారం ఉదయం 10 గంటల తర్వాత శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ బడ్జెట్‌ ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. శాసనమండలిలో బడ్జెట్‌ను గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ ప్రవేశపెడతారు. 22వ తేదీ వరకు బడ్జెట్‌ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, రోడ్లనిర్మాణం లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రెండు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఈ రెండు బడ్జెట్లకు కలిపి రూ.2.39 లక్షల కోట్లకు ఆమోదం తీసుకున్నారు. 2024-25 పూర్తిస్థాయి బడ్జెట్‌ రూ.3లక్షల కోట్లకు చేరువలో ఉండే అవకాశం ఉంది. ఉదయం 9 గంటలకు కేబినెట్‌ సమావేశంలో బడ్జెట్‌ ఆమోదం అనంతరం, ఇ-ఆఫీస్‌ ద్వారా గవర్నర్‌కు పంపుతారు. గవర్నర్‌ ఆమోదించిన తర్వాత సభలో ప్రవేశపెడతారు. గవర్నర్‌ అందుబాటులో లేకపోవడంతో ఆన్‌లైన్‌లో ఆమోదం తీసుకుంటున్నారు. ఈ ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నాలుగు నెలలకు గాను ఓటాన్‌ అకౌంట్‌ను గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరో నాలుగు నెలలకు గాను ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. సోమవారం అసెంబ్లీలో వచ్చే 4 నెలలకు గాను పూర్తిస్థాయిలో 2024-25 ఏడాదికి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు.


ఏప్రిల్‌ నుంచి జూలై వరకు మొదటి 4 నెలలకు రాష్ట్రంలో జీతాల చెల్లింపులు, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి రూ.1,09,052.34 కోట్లకు ఆమోదం తీసుకున్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.2,86,389.27 కోట్లకు ప్రతిపాదించి 4 నెలల ఖర్చుకు ఆమోదం పొందారు. ఎన్నికలు జరిగి జూన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్‌ సమర్పించాల్సినప్పటికీ ఆర్థిక పరిస్థితులపై అవగాహన, పూర్తి సమాచారం కోసం వాయిదా వేసింది. మరో 4 నెలల కాలానికి తాత్కాలికంగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు గవర్నర్‌ ద్వారా ఆర్డినెన్సు జారీ చేయించారు. ఆగస్టు నుంచి నవంబర్‌ వరకు ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులు ఇతర నిర్వహణ ఖర్చులకూ కలిపి రూ.1,29,972.97 కోట్లకు అనుమతులు తీసుకున్నారు. ఇప్పటి వరకు 8 నెలల కాలానికి రూ.2,39,025.31 కోట్లకు అనుమతి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో గడిచిన ఐదేళ్లకు గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లలో ఎక్కడా తాము చేసిన అప్పులు చూపించలేదు. అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి, కొత్త రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.


సభలో కీలక బిల్లులు..

దేవాలయాల్లోని పాలకమండళ్లలో అదనంగా మరో ఇద్దరు సభ్యుల నియామకంపై బిల్లును ప్రవేశపెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జ్యూడీషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ను రద్దు చేస్తూ బిల్లు పెడుతున్నారు. జ్యూడీషియల్‌ అధికారుల వయసును 60 నుంచి 61 ఏళ్లకు పెంచుతూ చట్ట సవరణ చేస్తున్నారు. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలంటూ వైసీపీ ప్రభుత్వం గతంలో తెచ్చిన చట్టాన్ని రద్దు చేస్తూ గతంలో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ఇచ్చింది. దీనికి బదులు మద్యం దుకాణాల నిర్వహణను ప్రైవేటుకు అప్పగిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతారు. ల్యాండ్‌ గ్రాబింగ్‌ బిల్లు 2024ను సభకు సమర్పిస్తారు.

Updated Date - Nov 11 , 2024 | 09:23 AM