ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భూ ఆక్రమణలపై కొరడా!

ABN, Publish Date - Nov 07 , 2024 | 05:29 AM

భూ ఆక్రమణదారులకు టీడీపీ కూటమి ప్రభుత్వం షాకివ్వబోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ, పట్టా భూములను ఆక్రమించే కబ్జాకోరులను కఠినంగా శిక్షించాలని, భారీగా జరిమానాలు కూడా విధించాలని నిర్ణయించింది.

కబ్జాకోర్లకు 14 ఏళ్లు జైలు శిక్ష.. భూమి విలువతోపాటు నష్టపరిహారమూ వసూలు

ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ నిషేధ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం.. సీఆర్‌డీఏ పాత పరిధి పునరుద్ధరణ

రూ.331 కోట్ల ఉపాధి బిల్లుల చెల్లింపులు.. న్యాయాధికారులకు 61 ఏళ్లకు రిటైర్మెంట్‌

కుప్పం, పిఠాపురం అభివృద్ధి అథారిటీల ఏర్పాటు.. కాలేజీల ఖాతాల్లోకే రీయింబర్స్‌మెంట్‌

3 కీలక పాలసీలకు పచ్చజెండా.. డేటా సెంటర్‌, సెమీ కండక్టర్‌, డ్రోన్‌ విధానాలకు ఓకే

డిజిటలైజేషన్‌, 5జీ, క్లౌడ్‌ మార్కెటింగ్‌, మొబైల్‌, ఏఐ మార్కెట్‌కు ప్రోత్సాహం

భారీ పెట్టుబడులకు మరిన్ని ప్రోత్సాహకాలు.. రాష్ట్ర మంత్రివర్గ కీలక నిర్ణయాలు

అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): భూ ఆక్రమణదారులకు టీడీపీ కూటమి ప్రభుత్వం షాకివ్వబోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ, పట్టా భూములను ఆక్రమించే కబ్జాకోరులను కఠినంగా శిక్షించాలని, భారీగా జరిమానాలు కూడా విధించాలని నిర్ణయించింది. ఈ దిశగా ప్రస్తుత భూ ఆక్రమణ నిరోధక చట్టాన్ని రద్దుచేసి.. దాని స్థానంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌(నిషేధం)బిల్లు-2024 ముసాయిదాను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. దీనిప్రకారం.. భూ ఆక్రమణలకు పాల్పడే వారికి 10 నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఆక్రమించిన భూమి విలువతోపాటు నష్టపరిహారాన్ని కూడా వసూలు చేస్తారు. బుధవారమిక్కడ వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 నుంచి ఎస్సీలు కాకుండా మిగతా విద్యార్థులందరికీ పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పలు(ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌) కళాశాలల బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని నిశ్చయించింది. గత ప్రభుత్వం చెల్లించకుండా నిలిపేసిన ఫీజులను తల్లుల ఖాతాల్లోనే వేయాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం చెల్లించే రీయింబర్స్‌మెంట్‌ మాత్రం కళాశాలల ఖాతాలకే జమచేయాలని నిర్ణయించారు. కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి ఆ తర్వాత విలేకరులకు వివరించారు.

మరిన్ని కేబినెట్‌ నిర్ణయాలివీ..

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి పథకం కింద చేపట్టిన సిమెంటు రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్‌ బకాయిలు తక్షణమే చెల్లింపు. 4.45 లక్షల పనులకు 12ు వడ్డీతో రూ.331కోట్ల చెల్లింపునకు ఆమోదం.

ఏపీ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ (రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఏజ్‌ ఆఫ్‌ సూపర్‌యాన్యుయేషన్‌) చట్టం-1984 పరిధిలోకి వచ్చే జ్యుడీషియల్‌ అధికారుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంపు. సదరు సవరణ బిల్లుకు ఆమోదముద్ర.

ఆంధ్రప్రదేశ్‌ ఎక్సైజ్‌ (సవరణ) ఆర్డినెన్స్‌-2024, ఆంధ్రప్రదేశ్‌ ప్రొహిబిషన్‌ (సవరణ) ఆర్డినెన్స్‌-2024, ఏపీ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌, ఫారిన్‌ లిక్కర్‌లో వాణిజ్య నియంత్రణ ఆర్డినెన్స్‌-2024 స్థానంలో రూపొందించిన మూడు ముసాయిదా బిల్లులకు ఆమోదం.

కుప్పం ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ (కుడా) పునరుద్ధరణకు జారీ చేసిన జీవో 59కు ధ్రువీకరణ. పిఠాపురం ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం.

పిఠాపురంలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ 100 పడకల ప్రాంతీయ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌. కొత్తగా 66 నూతన పోస్టుల మంజూరుకు ఆమోదం.

8,352.69 చదరపు కిలోమీటర్ల మేర ఏపీసీఆర్‌డీఏ సహజ పరిధి పునరుద్ధరణ.

ఆంధ్రప్రదేశ్‌ వస్తువులు, సేవల పన్ను చట్టం-2017 సవరణ బిల్లు ముసాయిదాకు ఓకే.

ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ డ్యూటీ(సవరణ) చట్టంలోని సెక్షన్‌ 3కి సవరణ.. ముసాయిదా బిల్లుకు ఆమోదం.

50 ఎకరాల వరకు ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమల యూనిట్లకు భూమిని కేటాయించే విధానం పునరుద్ధరణ.

అమరావతి ఓఆర్‌ఆర్‌ పరిధిలోకి బెంగుళూరు-విజయవాడ కారిడార్‌, విజయవాడ-నాగపూర్‌ కారిడార్‌. దీంతో ఎన్‌హెచ్‌-16, ఎన్‌హెచ్‌-65, ఎన్‌హెచ్‌-30, ఎన్‌హెచ్‌-216, ఎన్‌హెచ్‌-544, ఎన్‌హెచ్‌-541జీ అనుసంధానం.


కబ్జాలపై ఆరు నెలల్లో విచారణ..!

కేబినెట్‌ ఆమోదించిన ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ (నిషేధం) బిల్లు-2024 చట్ట రూపం దాలిస్తే.. ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు భూములన్నిటికీ వర్తిస్తుంది. చట్టం అమల్లో భాగంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు. జిల్లాస్థాయి జడ్జి లేదా సెషన్స్‌ జడ్జిని వీటిలో నియమిస్తారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను కూడా ప్రభుత్వం నియమిస్తుంది. భూ ఆక్రమణ అంశాలపై కోర్టులు సుమోటోగా విచారణ చేపట్టవచ్చు. భూములు కోల్పోయిన బాధితులు, ప్రభుత్వం నేరుగా విచారణ కోరవచ్చు. భూములు ఆక్రమణకు గురయ్యాయని జిల్లా కలెక్టర్‌ గుర్తిస్తే వాటిని విచారించాలని కోర్టులకు సిఫారసు చేయవచ్చు. ప్రత్యేక కోర్టులకు సివిల్‌, క్రిమినల్‌ అధికారాలు ఉంటాయి. ఏళ్ల తరబడి విచారణ సాగకుండా.. ఆరు నెలల్లోగా ముగించేలా క్లాజులను ప్రతిపాదించారు. విచారణ సందర్భంగా ఆక్రమణదారు తన ఆదాయానికి మించిన భూములను కలిగి ఉన్నట్లు గుర్తిస్తే.. అవి ఎలా వచ్చాయో విచారిస్తారు. అవి కూడా కబ్జా చేసినవేనని తేలితే కొత్త చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ అంశంపై ప్రజలు, ప్రజాసంఘాలు, సంస్థల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. ఈ నేపఽథ్యంలో సీసీఎల్‌ఏ నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు.

Updated Date - Nov 07 , 2024 | 05:29 AM