బదిలీల ప్రక్రియ సంతృప్తికరం
ABN, Publish Date - Sep 24 , 2024 | 03:58 AM
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడంపై ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సంతృప్తి వ్యక్తం చేశారు.
అప్రాధాన్య పోస్టుల్లో ఉన్న వారికి ఊరట
అధికారులతో సమీక్షలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్
అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడంపై ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సంతృప్తి వ్యక్తం చేశారు. మార్గదర్శకాలు, నిబంధనలను అనుసరించి పారదర్శకంగా బదిలీలు చేపట్టడంపై ఆయన ఆ శాఖ అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. బదిలీల ప్రక్రియలో మాతృశాఖలో ఉన్న అధికారులకే పోస్టింగ్స్ ఇవ్వడం చెప్పుకోదగిన పరిణామమని పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పటి వరకూ అప్రాధాన్యమైన స్థానాల్లో ఉన్నవారికి జిల్లాస్థాయి పోస్టింగ్స్ ఇచ్చిన విషయాన్ని అధికారులు ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నెల్లూరు జడ్పీ సీఈవోగా బదిలీ అయిన ఎస్.ఖాదర్‌బాషా 1999 నుంచి ఉద్యోగంలో ఉన్నా... జిల్లాస్థాయి పోస్టులో చేయలేదని తెలిపారు. ఎనిమిదేళ్లు విజిలెన్స్ విభాగంలోనే పని చేశారని, దీన్ని పరిగణనలోకి తీసుకుని జిల్లాస్థాయి అధికారిగా బాధ్యతలు ఇచ్చామని తెలిపారు. కృష్ణా జిల్లా డీపీవోగా బదిలీ అయిన అరుణ.. కుటుంబపరమైన ఇబ్బందులు తెలుపుతూ వినతి ఇచ్చారని దానిని పరిగణనలోకి తీసుకున్నామని అధికారులు చెప్పారు. ఈ బదిలీల ద్వారా నూతన బాధ్యతల్లోకి వెళ్లిన అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలపాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. పల్లెల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని, ఉపాధి హామీకి రూ.4500 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
Updated Date - Sep 24 , 2024 | 06:15 AM