Gottimukkala Sudhakar : నాకు, కుటుంబానికి ప్రాణహాని
ABN, Publish Date - May 18 , 2024 | 04:48 AM
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ నెల 13న తెనాలిలో తనను కొట్టిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
తెనాలి వైసీపీ ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించాలి
జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించిన బాధితుడు
గుంటూరు, మే 17: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ నెల 13న తెనాలిలో తనను కొట్టిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆయన ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించగా సీసీఎస్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావును కలవాలని ఎస్సీ సూచించారు.
దీంతో సుధాకర్ సీసీఎస్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావుని కలసి రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు. తనకు తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని తగిన రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. ఇందుకు స్పందించిన అదనపు ఎస్పీ శ్రీనివాసరావు విచారించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ, జరిగిన సంఘటనను వివరించారు. ‘ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కొట్టిన తరువాత రెండు రోజులు నేను జీజీహెచ్‌లో చికిత్స తీసుకున్నా. ఆ సమయంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తెనాలిలోని మా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు.
వివిధ వర్గాల నుంచి నాకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఎమ్మెల్యే అనుచరుల నుంచి ప్రాణహాని ఉన్నట్లు గుర్తించా. నాకు, నా కుటుంబ సభ్యులకు ప్రాణ రక్షణ కల్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. హైకోర్టు ఆదేశాలతో గుంటూరు జిల్లా ఎస్పీతో పాటు తెనాలి ఎస్‌హెచ్‌ఓ, డీఎస్‌పీ, అదేవిధంగా ఐజీ, డీజీపీ, హోంమంత్రి, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లకు ఫిర్యాదు చేస్తున్నా.
నాకు కానీ, నా కుటుంబ సభ్యులకు కానీ ఏ హాని జరిగినా అందుకు తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ బాధ్యత వహించాలి. అలాగే నాపై జరిగిన దాడికి సంబంధించిన కేసులో త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలి’ అని సుధాకర్ కోరారు.
Updated Date - May 18 , 2024 | 04:51 AM