ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమరావతికి మూడు రాచబాటలు!

ABN, Publish Date - Jul 17 , 2024 | 03:21 AM

అమరావతి రాజధానికి రాచబాటలు పడనున్నాయి. ఏపీ రాజధానిలోకి ప్రవేశించడానికి గ్రాండ్‌ ఎంట్రన్స్‌గా ఉన్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు సమాంతరంగా మరో రెండు రోడ్లను కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేసి 16వ నంబర్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-16)కి అనుసంధానం చేయాలని సీఆర్‌డీఏ అధికారులు నిర్ణయించారు.

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుతో పాటు మరో 2 రోడ్ల అభివృద్ధి

ఎన్‌హెచ్‌-16తో అనుసంధానం చేసేలా సీఆర్డీయే ప్రణాళిక

ఈ 11, ఈ 13 రోడ్లను ఎన్‌హెచ్‌-16కు కలపాలని నిర్ణయం

ఓఆర్‌ఆర్‌, ఐఆర్‌ఆర్‌ సాకారం దిశగా అడుగులు

అమరావతికి విస్తృత రోడ్డు నెట్‌వర్క్‌ కల్పించడమే లక్ష్యం

విజయవాడ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానికి రాచబాటలు పడనున్నాయి. ఏపీ రాజధానిలోకి ప్రవేశించడానికి గ్రాండ్‌ ఎంట్రన్స్‌గా ఉన్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు సమాంతరంగా మరో రెండు రోడ్లను కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేసి 16వ నంబర్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-16)కి అనుసంధానం చేయాలని సీఆర్‌డీఏ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు శరవేగంగా సిద్ధం చేస్తున్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు సమాంతరంగా ఉండే ఈ-11, ఈ-13 రోడ్లను కూడా జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. ఈ రెండు రోడ్లను అమరావతిలో వెంకటపాలెం వరకు నిర్మించారు. వీటిని విస్తరించి జాతీయ రహదారికి కలుపుతారు.

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు కూడా వెంకటపాలెం దగ్గర వరకు వచ్చి ఆగింది. ఇక్కడి నుంచి మణిపాల్‌ హాస్పిటల్‌ పక్క నుంచి కనకదుర్గ వారధి దిగువున ఎన్‌హెచ్‌-16కు కలపాల్సి ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. అమరావతి రాజధానిపై దృష్టి సారించింది. ఉండవల్లి మండలంలోని పెనుమాక దగ్గర నుంచి జాతీయ రహదారి వరకు 3 కిలోమీటర్ల మేర 30 ఎకరాల వరకు భూముల అవసరం ఏర్పడింది. సమీకరణ కింద రైతులు ఇస్తే తీసుకోవటానికి సీఆర్‌డీఏ సిద్ధంగా ఉంది. ఒకవేళ పూలింగ్‌ కింద సాధ్యం కాకపోతే భూ సేకరణ చేసైనా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. త్వరలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు బ్యాలెన్స్‌ పనులకు అడుగులు పడతాయనుకున్న దశలో సీఆర్‌డీఏ దానితోపాటు ఈ-11, ఈ-13 రోడ్లను కూడా ఎన్‌హెచ్‌-16 అనుసంధానించాలని నిర్ణయించడం విశేషం.


కేంద్రం సహకరిస్తే...

ఈ-11, ఈ-13 రోడ్లను తెరపైకి తీసుకురావడానికి మరో కారణం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టును కేంద్రానికి ప్రతిపాదించింది. దీనికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దాదాపుగా రూ.25 వేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ఈ నెల 23న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇదే సందర్భంలో సీఆర్‌డీఏ అధికారులు అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)తో పాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌)లను కూడా ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ఎన్‌హెచ్‌-16కు మూడు రాచబాటలను అనుసంధానం చేయడం వల్ల అమరావతి నుంచి దేశంలో ఎక్కడికైనా కనెక్ట్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ రోడ్లకు సీఆర్‌డీఏ మీద పెద్దగా ఆర్థిక భారం కూడా పడదు.

దాదాపుగా వెంకటపాలెం వరకు అయితే సమస్య లేదు. ఎయిమ్స్‌లో కొండ ప్రాంతం వెంబడి రోడ్లను ఎలా అభివృద్ధి చేశారో అదే తరహాలో ఈ-11, ఈ-13 రోడ్లను కూడా వెంకటపాలెం నుంచి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ రెండు రోడ్లకు భూ సేకరణ అవసరం దాదాపుగా ఉండదని తెలుస్తోంది. ఎన్‌హెచ్‌-16 దగ్గర అనుసంధానం చేసే చోట తప్పనిసరి అయితే భూసేకరణకు వెళ్లాలని భావిస్తున్నారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి మూడు రాచబాటలను అనుసంధానం చేయటం ద్వారా ఒక విస్తృతమై రోడ్డు నెట్‌వర్క్‌ ఏర్పడుతుందని సీఆర్‌డీఏ భావిస్తోంది. అమరావతి రాజధాని ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ఇవి ఎంతగానో దోహదపడనుంది.


జాతీయ రహదారులతో అనుసంధానం

ఇప్పటికే అమరావతి ఓఆర్‌ఆర్‌కు అనేక జాతీయ రహదారులు అనుసంధానమవుతున్నాయి. ఎన్‌హెచ్‌- 16, ఎన్‌హెచ్‌-65, ఎన్‌హెచ్‌-30, ఎన్‌హెచ్‌-216, ఎన్‌హెచ్‌-216 హెచ్‌ ఇలా ఎన్నో రోడ్లు ఇందులో ఉన్నాయి. అన్నింటికంటే ప్రధానమైన నాగ్‌పూర్‌-విజయవాడ ఎకనమిక్‌ కారిడార్‌, బెంగళూరు-విజయవాడ ఎకనమిక్‌ కారిడార్‌లు అనుసంధానమవుతాయి. నాగ్‌పూర్‌-విజయవాడ ఎకనామిక్‌ కారిడార్‌లో భాగంగా ఖమ్మం జిల్లా దేవరపల్లి వరకు పనులు జరుగుతున్నాయి. ఖమ్మం-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పూర్తయితే నాగ్‌పూర్‌ -విజయవాడ ఎకనామిక్‌ కారిడార్‌కు పూర్తి రూపం వస్తుం ది. బెంగళూరు-విజయవాడ కారిడార్‌ పనులూ జరుగుతున్నాయి. ఈ రెండు కారిడార్లు అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానం కావడంతో పాటు.. ఎన్‌హెచ్‌-16కు అమరావతి మూడు రాచబాటలను అనుసంధానిస్తే అమరావతికి విస్తృత స్థాయి రోడ్డు నెట్‌వర్క్‌ ఏర్పడుతుంది.

Updated Date - Jul 17 , 2024 | 08:51 AM

Advertising
Advertising
<