ట్రాఫిక్ అస్తవ్యస్తం
ABN, Publish Date - Nov 24 , 2024 | 11:37 PM
పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. పట్టించుకోవాల్సిన అధికారులు పత్తా లేకుండా పోయారు.
ఇబ్బంది పడుతున్న భక్తులు
మంత్రాలయం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. పట్టించుకోవాల్సిన అధికారులు పత్తా లేకుండా పోయారు. రెండు రోజుల క్రితం మంత్రాలయం వచ్చిన ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు నదితీరం, హెలిప్యాడ్ మైదానం, ప్రధాన ముఖద్వారం పరిశీలించి ట్రాఫిక్ నిబంధనలపై పలు సూచనలు చేశారు. అయినా మార్పు రాలేదు. శని, ఆదివారం, గురువారం సెలవు దినాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటోంది. ప్రధాన రహదారుల్లో వాహనాలు నిలిచిపోయి భక్తులు నరకం చూస్తున్నారు. మాధవరం రోడ్డులో కిలోమీటరు మేర ఇరువైపులా వాహనాల పార్కింగ్ నాగులదిన్నెరోడ్డు, బస్టాండు రోడ్డు, ప్రధాన రోడ్డు, పంచాయతీ కార్యాలయం, నాగలదిన్నె నుంచి సంస్కృత పాఠశాల వెనుకవైపు ట్రాఫిక్‌లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి ఒకరికొకరు దూషించుకుంటూ గొడవలు పడుతూ వెళ్తున్నారు. ట్రాఫిక్ నియంత్రించాల్సిన పోలీసులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు సొంత వాహనాల్లో వచ్చిన భక్తులు ప్రైవేటు లాడ్జీల్లో పార్కింగ్ స్థలాలు లేక నడిరోడ్డుపైనే నిలుపుతున్నారు. ఆటోలు ఇష్టారాజ్యంగా చక్కర్లు కొట్టుతున్నాయి. దాంతో పాదచారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఫ ట్రాఫిక్ నియంత్రణపై కఠినంగా వ్యవహరిస్తాం
సెలవు దినాల్లో మంత్రాలయంలో ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారని దీనిపై శాశ్వత పరిష్కారానికి కఠిన చర్యలు తీసుకుంటాం. ఆటోలు ఇష్టారాజ్యంగా తిరుగుతుండటం, సొంత వాహనాల్లో వచ్చిన భక్తులు రోడ్డుకిరువైపులా పార్కింగ్ చేయడంతో సమస్య తలెత్తుతుంది. ప్రధాన రహదారుల్లో వాహనాలు ప్రవేశించకుండా శ్రీమఠం అధికారులు రెవెన్యూ, గ్రామ పంచాయితీ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం.
- ఉపేంద్రబాబు, డీఎస్పీ, ఎమ్మిగనూరు
Updated Date - Nov 24 , 2024 | 11:37 PM