సభలో అనధికార వ్యక్తులు
ABN, Publish Date - Nov 06 , 2024 | 11:29 PM
ఆలూరు మండల సర్వ సభ్య సమావేశం వైసీపీ సభగా మారింది.
దర్జాగా కూర్చున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు
ప్రజాప్రతినిధులకు బదులు భర్తలు హాజరు
గందరగోళంగా మండల సర్వసభ్య సమావేశం
నాకు 30 శాతం పనులు ఇవ్వాల్సిందే
అన్ని టీడీపీ వాళ్లకంటే కుదరదు: ఎమ్మెల్యే విరుపాక్షి
ఆలూరు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : ఆలూరు మండల సర్వ సభ్య సమావేశం వైసీపీ సభగా మారింది. బుధవారం ఎంపీపీ రంగమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎంపీటీసీ, సర్పంచలు హాజరు కావాల్సి ఉండగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మహిళా ప్రజాప్రతినిధులకు బదులు భర్తలు హాజరయ్యారు. కొందరు అనధికార వ్యక్తులు మైక్‌లు తీసుకొని ప్రసంగాలు కూడా చేశారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో సమావేశం గందరగోళంగా మారింది.
ఫ నాకు పనులు ఇవ్వాల్సిందే..
ఆలూరు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు నియోజకరవ్గంలో 30 శాతం పనులు ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యే విరుపాక్షి అన్నారు. అన్ని టీడీపీ వాళ్లకు ఇస్తే తమ పార్టీ కార్యకర్తలు ఏం కావాలంటూ అధికారులను నిలదీశారు. గోకులం షెడ్లు, పల్లె పండుగ పనులు మొత్తం వీరభద్ర గౌడ్ చెప్పిన వాళ్లకు ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఈ విషయం కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇక మీదట అలా జరిగితే బాగుండందని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ ఎంపీటీసీలమని మండల గ్రాంట్ కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తుంబలబీడు ఎంపీటీసీ రమేష్, మొలగవల్లి ఎంపీటీసీ సుమతీ భర్త బంగారు పటేల్ యాదవ్ అన్నారు. ఎందుకు ఇవ్వలేదో అప్పుడున్న ఎమ్మెల్యే జయరాంను అడగాలని నిర్లక్ష్యగా సమాధానం ఇచ్చారు. ఇక మీదట పార్టీలకు సంబంధం లేకుండా పనులు ఇవ్వాలని ఎంపీపీకి సూచించారు. ఆలూరు చెరువుల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లు నిర్మించాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు నెలలవుతున్నా నిధులు లేవని, సర్పంచులు, ఎంపీటీసీలు దండయాత్రకు సిద్ధం కావాలని అందుకు తాను మద్దతుగా ఉంటానన్నారు. సమావేశంలో జడ్పీటీసీ ఏరూర్ శేఖర్, డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, ఇనచార్జి ఎంపీడీవో సూర్యనారాయణ, వైస్ ఎంపీపీలు నాగవేణి, శ్రీరాములు, కో ఆప్షన సభ్యులు బాషా పాల్గొన్నారు.
Updated Date - Nov 06 , 2024 | 11:29 PM