ఐదేళ్ల నేరాలు వెలికితీయండి!
ABN, Publish Date - Aug 06 , 2024 | 02:52 AM
ఏపీ మంచి రాష్ట్రం.. కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది. వ్యవస్థలపై నమ్మకం కల్పించాలి.
తప్పు చేసిన వారెవరినీ వదిలిపెట్టొద్దు.. జిల్లా ఎస్పీలకు సీఎం స్పష్టీకరణ
నేరగాళ్లను జైలుకు పంపితేనే అదుపులో శాంతి భద్రతలు
రాష్ట్రాన్ని కాపాడుకుందాం.. వ్యవస్థలపై నమ్మకం కలిగిద్దాం
నాడు తప్పుడు కేసులు పెట్టడంపైనే శ్రద్ధ.. నేరస్థుల్ని పట్టుకోవడంలో లేదు: సీఎం
జగన్ పాలనలో గంజాయివనం.. ఆయా శాఖల మధ్య సమన్వయం ఉండాలి
తొలుత డ్రగ్స్‌పై అవగాహన కల్పించాలి.. తర్వాత ఉక్కుపాదం మోపాలి: బాబు
అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ‘ఏపీ మంచి రాష్ట్రం.. కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది. వ్యవస్థలపై నమ్మకం కల్పించాలి. ఎవరు తప్పు చేసినా టెక్నాలజీ వినియోగించి జైలుకు పంపితే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో జరిగిన నేరాలను వెలికితీయాలని ఎస్పీలకు పిలుపిచ్చారు. తప్పులు వెలికి తీసి బాధ్యులను శిక్షించాలని స్పష్టంచేశారు. ‘వికసిత్ ఆంధ్ర 2047’ లక్ష్యంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సైబర్ నేరాలు, మహిళలపై నేరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగడానికి వీల్లేదన్నారు. ‘నాకు అన్యాయం జరిగిందన్న ప్రతి ఒక్కరి వినతిని చూసి అందులో న్యాయం ఉంటే చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నేరాలు జరిగినప్పుడు నేరస్థులను గుర్తించేందుకు కెమేరాలు, డ్రోన్లతోపాటు కృత్రిమ మేథ (ఏఐ)ని వాడుకోవాలి. ఐదేళ్ల క్రితం కొనుగోలు చేసిన 15 వేల కెమేరాలు, సాఫ్ట్‌వేర్, ఇతర హార్డ్‌వేర్ వినియోగించకుండా గత ప్రభుత్వం పక్కనపెట్టడం బాధాకరం. ఎవరు తప్పు చేసినా గుర్తించే వ్యవస్థ తీసుకొస్తే దానిని ఉపయోగించక పోవడం క్షమించరానిది’ అన్నారు. నేరాల కట్టడికి ప్రపంచం మొత్తం ఎలాంటి నాణ్యమైన టూల్స్ వినియోగిస్తున్నారో ఇక్కడా వాటినే వాడదామని సూచించారు. ’మదనపల్లెలో అగ్ని ప్రమాదం అసలు గుట్టు తేల్చాలని డీజీపీ, సీఐడీ ఏడీజీని పంపా.. క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రైవేటు ప్రాంతాల్లో ఫైళ్లు పెట్టుకుని సబ్‌కలెక్టర్ కార్యాలయాన్నే ధ్వంసం చేశారు. విశాఖపట్నం, తిరుపతి మాత్రమే కాదు.. కొండలను సైతం మింగేశారు. 22ఏలో చేర్చడం, తర్వాత తీసేయడం.. భూ మాఫియా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది. లక్షల ఎకరాల సమస్య మన ముందుంది’ అన్నారు. ‘వివేకానందరెడ్డి హత్యపై జగన్ రోతపత్రికలో గుండెపోటు అని వస్తుంది. ఆయన కుమార్తె అడగ్గానే గొడ్డలి పోటు బయట పడుతుంది. ఒక క్రిమినల్ పాలిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదే నిదర్శనం’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేరాలకు కారణమైన మద్యంపై దేశంలోనే మంచి పాలసీ తీసుకొస్తామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక యాప్ తీసుకొద్దామన్నారు.
నేరాల కట్టడికి చర్యలు: డీజీపీ తిరుమలరావు
రాష్ట్రంలో నేరాల తీరుతెన్నులపై డీజీపీ ద్వారకా తిరుమలరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సైబర్ నేరాల్లో ఎంతో మంది బాధితులు రూ.లక్షలు, కోట్లు కోల్పోతున్నారని.. నేరస్థుల కట్టడికి సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసుకోవలసి ఉందన్నారు. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణలో వేగం పెంచి వారికి రక్షణ కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అత్యంత అధునాతన ఆటోమేటిక్ ఫింగర్ ప్రింట్ సర్వర్ కాలిపోయిందని, తెలంగాణ డీజీపీని బతిమాలి పని చేయించుకుంటున్నామంటూ పోలీసు వ్యవస్థ దుస్థితిని వివరించారు.
జగన్ పాలనలో గంజాయివనం..
జగన్ పాలనలో రాష్ట్రం గంజాయి వనంగా మారిందని.. గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోల్చితే వైసీపీ పాలనలో ఏకంగా 122శాతం ఎక్కువగా గంజాయి కేసులు నమోదయ్యాయని చంద్రబాబు కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో తెలిపారు. ‘రాష్ట్రంలో గంజాయి 2019-23 మధ్య 122 శాతం పెరిగింది. అంతకు ముందు టీడీపీ హయాంలో ఐదేళ్లలో 2,948 కేసులు నమోదైతే వైసీపీ పాలనలో ఏకంగా 6,560కి పెరిగాయి. గంజాయి వినియోగాన్ని రాష్ట్రమంతా విస్తరింపజేసిన ముఠాలు.. దేశంలోని పలుప్రాంతాలకు స్మగ్లింగ్ చేస్తున్నాయి. గంజాయి, డ్రగ్ హాట్ స్పాట్‌లను గుర్తించి యాంటీ డ్రగ్ స్క్వాడ్‌ను వీలైనంత తొందర్లో ఏర్పాటు చేయాలి. గంజాయి సాగు, స్మగ్లింగ్‌లో కింగ్‌పిన్‌ల జాడ కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి. ఎక్సైజ్, విద్య, వైద్య, పోలీసు, గిరిజన సంక్షేమ శాఖలు సమన్వయంతో మొదట డ్రగ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. మహిళలు, చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, ఇతర నేరాలు జరక్కుండా వారికి భద్రత కల్పించి.. ‘డయల్ 112’పై విస్తృతంగా ప్రచారం చేయాలి. ఆన్‌లైన్, సోషల్ మీడియా ద్వారా మహిళలను వేధించే వారి ఆట కట్టించేందుకు ప్రత్యేక సైబర్ సెల్ ఏర్పాటు చేయాలి. అవసరం మేరకు సీసీటీవీలు ఏర్పాటు చేయాలి’ అన్నారు.
Updated Date - Aug 06 , 2024 | 02:53 AM