బోట్ల తొలగింపునకు అండర్ వాటర్ ఆపరేషన్
ABN, Publish Date - Sep 12 , 2024 | 03:25 AM
ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కుపోయిన బోట్ల తొలగింపునకు జలవనరుల శాఖ అధికారులు అండర్ వాటర్ ఆపరేషన్ మొదలుపెట్టారు.
బ్యారేజీ వద్ద బోట్లకు అడుగు నుంచి కటింగ్
విజయవాడ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కుపోయిన బోట్ల తొలగింపునకు జలవనరుల శాఖ అధికారులు అండర్ వాటర్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ బోట్ల తొలగింపునకు ఇంజనీర్లు నాలుగు ప్లాన్లను రూపొందించుకున్నారు. అందులో మొదటి ప్లాన్‌గా.. క్రేన్ల సాయంతో పైకి తీసే ప్రయత్నం విఫలం కావడంతో తదుపరి చర్యలపై సమాలోచన చేశారు. చివరికి నాలుగో ప్లాన్‌గా ఉన్న అండర్ వాటర్ ఆపరేషన్ మేలు అనే నిర్ణయానికి వచ్చారు. దీనికోసం విశాఖపట్నం నుంచి సీ లయన్ ఆఫ్‌షోర్ డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి నిపుణులను రప్పించారు. కంపెనీ ప్రతినిధి సూర్య అక్షిత్ ఆధ్వర్యంలో ఎనిమిది మంది డైవర్లు బుధవారం ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకున్నారు.
10-12 అడుగుల లోతులో..
అండర్ వాటర్ ఆపరేషన్‌ను బెకమ్ కంపెనీ, సీ లయన్ కంపెనీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. బెకమ్ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టు వర్కులను సీ లయన్ చేస్తుంటుంది. ఈ సంస్థ నుంచి వచ్చిన నిపుణులు ముందుగా బోట్ల వద్ద సర్వే చేశారు. ఇద్దరు డైవర్లు ఆక్సిజన్ సిలిండర్లతో నీళ్లలోకి దిగారు. బోల్తాపడిన బోట్లపైభాగం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కింద భాగంలో పరిస్థితి ఏమిటన్న దానిపై ఓ అంచనాకు వచ్చారు. బ్యారేజీ 67వ నంబరు గేటు దగ్గర రెండు బోట్లు పైకి కనిపిస్తున్నాయి. ఈ రెండింటికీ అడుగు భాగాన మరో బోటు ఉందని సీ లయన్ డైవర్లు గుర్తించారు. నీళ్లలో 10 నుంచి 12 అడుగుల లోతులోకి వెళ్లి ఈ బోటును గుర్తించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నీళ్లలో సర్వే చేసిన డైవర్లు మధ్యాహ్నం నుంచి ఆపరేషన్ మొదలు పెట్టారు. ఒక్కో బోటు కటింగ్ పూర్తికావడానికి రెండు రోజుల సమయం పడుతుందని భావిస్తున్నారు. బుధవారం రాత్రికి కనీసం ఒక బోటునైనా ముక్కలు చేస్తామని సీ లయన్ కంపెనీ ప్రతినిధి సూర్యఅక్షిత్ తెలిపారు. బోట్లను ముక్కలు చేయడానికి ఆక్సిఆర్క్‌కటింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు.
భారీ పశు నష్టం
అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): వర్షాలు, వరదలు తగ్గుతున్న కొద్ది ఆస్తి, ప్రాణ నష్టాలు బయటపడుతున్నాయి. ఇటీవలి వరదలతో పశు సంపద, పౌలీ్ట్రకి భారీ నష్టం జరిగింది. తాజా సమాచారం ప్రకారం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 1,294 పశువులు, 94,438 కోళ్లు చనిపోయాయని పశుసంవర్ధక శాఖ గుర్తించింది. 686 మత్స్యకారుల పడవలు, 2,478 వలలు, 3,325 హెక్టార్లలో చేపలు, రొయ్యల చెరువులకు నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ఆర్‌అండ్‌బీ రోడ్లు 4,460 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ రోడ్లు 1,812 కిలోమీటర్లు, మున్సిపల్ రోడ్లు 563 కిలోమీటర్లు దెబ్బతినగా... 143 మైనర్ ఇరిగేషన్ చెరువులు, 254 మేజర్ చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయని గుర్తించారని విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం ప్రకటించింది.
Updated Date - Sep 12 , 2024 | 03:25 AM