పొదుపు సొమ్ము మాయం
ABN, Publish Date - Dec 03 , 2024 | 12:35 AM
రూపాయి, రూపాయి పోగుచేసి పోస్టాఫీసులో పొదుపు చేస్తే, ఆ సొమ్మును అదే బ్రాంచ్ పోస్టుమాస్టర్ ఖాతాదారులను బురిడీ కొట్టించి ఖాతాలో జమ చేయకుండా దిగమింగేశాడు.
బ్రాంచి పోస్టుమాస్టర్‌ను సస్పెండ్ చేసి ఏడాదైనా తిరిగి రాని సొమ్ము
వేగివాడ తపాలా కార్యాలయంఎదుట బాధితుల ఆందోళన
పెదవేగి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : రూపాయి, రూపాయి పోగుచేసి పోస్టాఫీసులో పొదుపు చేస్తే, ఆ సొమ్మును అదే బ్రాంచ్ పోస్టుమాస్టర్ ఖాతాదారులను బురిడీ కొట్టించి ఖాతాలో జమ చేయకుండా దిగమింగేశాడు. ఈ విష యం తెలిసి ఖాతాదారులు తమ సొమ్ము ఇప్పించాలని డిమాండ్ చేయగా విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడిన అధికారులు సంబంధిత బ్రాంచ్ పోస్టుమాస్టర్‌ను సస్పెండ్ చేసి, మీ సొమ్మును తిరిగి చెల్లిస్తామని ఖాతాదారు లకు హామీ ఇచ్చారు. ఇది జరిగి సరిగ్గా ఏడాదైంది. సొమ్ము ఇప్పుడొస్తుంది. అప్పుడొస్తుందీ అంటూ ఎదురుచూసిన ఖాతా దారులు ఏడాదిగా తమ సొమ్ము చేతికందక పోవడంతో సోమవారం ఉదయం తపాలా కార్యాలయం ఎదుట ఆందోళ నకు దిగారు. తమ సొమ్ముకు సమాధానం చెప్పేవరకు పోస్టాఫీసును తెరవనీయబోమని బాధితులు భీష్మించారు.
పెదవేగి మండలం వేగివాడలోని పోస్టాఫీసు బ్రాంచి కార్యాలయంలో ఐదేళ్ల కిందట నాగరాజు అనేవ్యక్తి బ్రాంచి పోస్టుమాస్టర్‌గా ఉండేవారు. ఆ సమయంలో గ్రామంలో పొదుపు ద్వారా కలిగే లాభాలపై అవగాహన కల్పించడంతో చాలామంది పొదుపు ఖాతాలు తెరిచి, నెలనెలా పొదుపు చేస్తూ వచ్చారు. వీరిలో రోజువారీ కూలీలు, సామాజిక పింఛన్లు తీసుకునేవారే ఎక్కువగా పొదుపు చేశారు. నాగ రాజు లబ్ధిదారుల ఖాతా పుస్తకాలను తన దగ్గరే పెట్టుకుని, నెలనెలా లబ్ధిదారులు కట్టే పొదుపు సొమ్మును జమ చేస్తున్నట్టు చూపిస్తూ ఒక రసీదు ఇచ్చేవారని బాధితులు సత్యవరపు సుబ్బారావు, లింగంపల్లి రాంబాబు, చిట్టూరి బాబూరావు, కాలి యోహాను, సింగవరపు రత్నకుమారి, చొక్కా నర్సమ్మ తదితరులు తెలిపారు. అయితే ఆ సొమ్మును ఖాతాలో జమ చేయకుండా చెల్లని రసీదులు ఇచ్చారని, ఇలా దాదాపు రూ.అరకోటి పైనే స్వాహా చేసినట్టు ఆరోపిస్తున్నారు. ఏడాది కిందట విషయం తెలిసి నిలదీయగా తపాలా కార్యా లయం జిల్లా అధికారులు గుట్టుచప్పుడు కాకుండా విచారణ జరిపి నాగరాజును గతేడాది నవంబరులో సస్పెండ్ చేశారు. కాగా తమ సొమ్ము వస్తుందని ఏడాదిగా ఎదురు చూసిన బాధితులు సోమవారం ఆందోళనకు దిగారు. బాధితులు పోస్టాఫీసును తెరవనీయకపోవడంతో పెదవేగి ఎస్‌ఐ కె.రామకృష్ణతో పాటు ఘటనా స్థలానికి చేరుకున్న పోస్టల్‌శాఖ ఇనస్పెక్టర్ శ్రీకాంత్.. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు. దీనిపై ప్రస్తుత బ్రాంచి పోస్టు మాస్టర్ రమ్యను వివరణ కోరగా దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారన్నారు.
Updated Date - Dec 03 , 2024 | 12:35 AM