AP Elections: 9 మందిపై వేటు.. ఈ ఐపీఎస్‌లకు చెక్!
ABN, Publish Date - Apr 03 , 2024 | 04:30 AM
మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులపై సీఎం జగన్ కఠిన చర్యలు తీసుకున్న సందర్భమేదీ లేదు. ఆయన భద్రతకు ఎలాంటి ముప్పూ లేదు.
అడ్డగోలు అధికారులపై ఈసీ బదిలీ కొరడా
ఆరుగురు ఐపీఎస్‌లు, ముగ్గురు కలెక్టర్ల బదిలీ
మాయ చేద్దామనుకున్న జగన్‌కు భారీ ఝలక్
కోడ్‌కు ముందే ‘కోరిన’ జిల్లాలకు.. అయినా తప్పని వేటు
స్వామి భక్తికి శాస్తి
ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశాలు
సీఎం సొంత మనిషి పరమేశ్వర రెడ్డి
కాంపౌండ్లో ఉండే అన్బురాజన్
పెద్దిరెడ్డికి జీ హుజూర్ అనే జాషువా
వైసీపీ చట్టం అమలుచేసిన రవిశంకర్ రెడ్డి
ప్రధాని సభ ఏర్పాట్లలో వైఫల్యంపైనా సీరియస్!
గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుపై అందుకే వేటు!
‘దొంగ ఓట్ల’ వ్యవహారంపై ఈసీ కఠిన చర్యలు
కృష్ణా, అనంతపురం, తిరుపతి కలెక్టర్ల బదిలీ
ఉరవకొండ దొంగ ఓట్లపై నిర్లక్ష్యంగా గౌతమి
బాధ్యతలు తీసుకున్న రోజే ఎమ్మెల్యేతో లక్ష్మీశ భేటీ
మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులపై సీఎం జగన్ (CM YS Jagan) కఠిన చర్యలు తీసుకున్న సందర్భమేదీ లేదు. ఆయన భద్రతకు ఎలాంటి ముప్పూ లేదు. అయినా సరే.. నెలన్నర కిందట ఆయన కడప పర్యటనకు వచ్చినపుడు అతి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పొరుగు జిల్లాల నుంచి 1058 మంది సివిల్ పోలీసులు, 13 ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలు, రెండు గ్రేహౌండ్స్ యూనిట్లు, పదుల సంఖ్యలో ఆర్మ్‌డ్ రిజర్వ్ ఫోర్స్‌ను దించారు. మరోవైపు హైసెక్యూరిటీ ఉన్న దేశాధినేతల్లో టాప్ ఫైవ్‌లో ఉండే ప్రధాని నరేంద్ర మోదీ పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడి సభకు వస్తే కేవలం ఐదు ఏపీఎస్పీ ప్లటూన్లను బందోబస్తుకు పంపారు. ట్రాఫిక్ మొదలుకొని ఎక్కడికక్కడ భద్రతా వైఫల్యం కనిపించడంపై కేంద్ర ఇంటెలిజెన్స్ ఆరా తీసింది. రాష్ట్ర సీఎం భద్రత కన్నా దేశ ప్రధాని రక్షణకు తక్కువ పోలీసులను వినియోగించిన విషయం తెలుసుకుని నివ్వెరపోయింది! ఈ నిర్వాకానికిగాను గుంటూరు ఐజీ పాలరాజుపై వేటు పడిందని ఐపీఎస్ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం ఈసీ వేటుకు గురైన ఐపీఎస్‌ల్లో పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి ముగ్గురూ ప్రధాని సభ పర్యవేక్షణలో విఫలమైనట్లు ఆరోపణలు ఎదుర్కొన్న వారే.
ఎన్నికల ముందు వైసీపీకి మరో బిగ్ షాక్..
అమరావతి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల కమిషన్ కొరడా ఝళిపించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి గట్టి షాక్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్ కళ్లు కప్పేందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. షెడ్యూలుకు రెండు నెలల ముందే వ్యూహాత్మకంగా జరిపిన అడ్డగోలు నియామకాలను ‘రివర్స్’ చేసింది. ఒకే రోజు ఒకే ఉత్తర్వుతో ముగ్గురు ఐఏఎ్‌సలు, ఆరుగురు ఐపీఎ్‌సలను పక్కకు తప్పించింది. వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఈ స్థాయిలో అధికారులపై చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి. ఐదుగురు ఎస్పీ లు సహా ఆరుగురు ఐపీఎ్‌సలు, ముగ్గురు కలెక్టర్లను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం జిల్లా ఎస్పీ కె.కె.ఎన్. అన్బురాజన్, చిత్తూరు జిల్లా ఎస్పీ పల్లె జాషువా, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజులను, కృష్ణా జిల్లా కలెక్టర్ పీ రాజబాబు, అనంతపురం కలెక్టర్ ఎం.గౌతమి, తిరుపతి కలెక్టర్ డా.లక్ష్మీషాను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ విస్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అనంతపురం జిల్లా కలెక్టరు, ఎస్పీ ఇద్దరినీ ఒకేసారి బదిలీ చేయడం గమనార్హం. ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చిన కొన్ని గంటల్లోనే ఐదుగురు ఎస్పీలతోపాటు గుంటూరు రేంజ్ ఐజీని పోలీసు ప్రధాన కార్యాలయానికి బదిలీచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఐపీసీ బదులు వైసీపీ చట్టం రాష్ట్రంలో జగన్ సీఎం అయినప్పటి నుంచి అమలవుతోంది.
ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమైన టీడీపీ మహిళా నేత!
అలా చేయగలిగిన వారికే వైసీపీ నేతలు సిఫారసు చేసి శాంతిభద్రతల విభాగంలో పోస్టింగులు ఇప్పించారు. ఫలితంగా అధికార పార్టీకి చెందిన వారు అరాచకాలు చేసినా బాధ్యులపై కాకుండా బాధితులపై కేసులు పెట్టి చితక్కొట్టే పోలీసు అధికారులే రాష్ట్ర నలుమూలలా కనిపిస్తున్నారు. అదే కోవలో పనిచేసిన ఐపీఎస్ అధికారులకూ రాష్ట్రంలో కొదవలేదు. కానీ నిష్పక్షపాతంగా పనిచేస్తేనే ఎన్నికల విధుల్లో ఉంటారని, ఏపక్షంగా.. పక్షపాతంగా.. వ్యవహరిస్తే ఉపేక్షించబోమని ఎన్నికల కమిషన్ గట్టి షాకిచ్చింది. రాష్ట్రంలోని 26 పోలీసు యూనిట్లలో మెజారిటీ ఐపీఎ్‌సలు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే అపవాదు చాలాకాలంగా ఉంది. అటువంటి వారిపై నిఘా పెట్టి ఆరుగురికి ఉద్వాసన పలికిన ఎన్నికల కమిషన్ మరికొందరిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఒక డీఐజీ, మరో ఐజీ ర్యాంకు అధికారితోపాటు అడిషనల్ డీజీ స్థాయి ఐపీఎ్‌సకూ బదిలీ తప్పక పోవచ్చని ఉన్నత స్థాయి ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చిన కొన్ని గంటల్లోనే ఐదుగురు ఎస్పీలతో పాటు గుంటూరు రేంజ్ ఐజీని పోలీసు ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
స్వామిభక్తిలో నం.1
సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఏకంగా నాలుగేళ్లు ఎస్పీగా పనిచేసిన కె.కె.ఎన్. అన్బురాజన్ చూపించిన స్వామి భక్తి రాష్ట్రంలో ఎవ్వరూ చూపించలేదు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో నిందితుడిని విచారించేందుకు తీసుకెళ్లిన సీబీఐ అధికారులపై కిడ్నాప్ కేసు నమోదుచేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. వైసీపీ ఎన్ని అరాచకాలు చేసినా, భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి (వివేకా హత్యకేసులో నిందితులు) నుంచి ఫోన్ వస్తే చాలు అన్నీ మాయం అయిపోయేవి. ఇంతలా ఏకపక్షంగా వ్యవహరించిన ఆయనకు అనంతపురం జిల్లా ఎస్పీగా రెండు నెలల క్రితమే జగన్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రాయల సీమలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న అనంతపురం జిల్లాలో వైసీపీ కోసం గట్టిగా పని చేయాలని చెప్పి పంపించారు. ఆయన ఆ పనిలో ఉండగానే ఈసీ కంట్లో పడ్డారు. కర్ణాటక మద్యం అనంతపురం జిల్లాలోకి రాకుండా ఎందుకు అరికట్టలేకపోయారని ఎన్నికల కమిషన్ అన్బురాజన్‌ను ప్రశ్నించింది. దానికి ఆయన.. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గాయి, దానివల్ల కర్ణాటక మద్యం అక్రమ రవాణా తగ్గిందని చెప్పారట! ‘ఆంధ్రజ్యోతి’ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై అనంతపురం జిల్లాలో జరిగిన జగన్ ‘సిద్ధం’ సభలో వైసీపీ మూకలు దాడి చేశాయి. దాడి దృశ్యాల వీడియోలు లభించాయి. దాడి చేస్తున్నది ఎవరో స్పష్టంగా అందులో కనిపించింది. ప్రజలు సైతం దాడిచేసినవారి వివరాలను బయటపెట్టారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ దాడి గురించి ఆ జిల్లా ఎస్పీ అన్బురాజన్ అస్సలు పట్టించుకోలేదు. దాడిలో చాలామంది పాల్గొనగా, తూతూ మంత్రంగా ఒకరిని మాత్రమే ఇప్పటివరకు అరెస్టు చేశారు. ఈ కేసు ఆ తర్వాత ఏమైందో కూడా తెలియదు. అధికార పార్టీవారికి పోలీసులు ఏ స్థాయిలో లొంగి పనిచేస్తున్నారనేది ఈ ఘటనతో ఈసీకి అర్థమై పోయిందని చెబుతున్నారు. దీంతో కొంతకాలంగా ఈయన పనితీరుపై ఎన్నికల కమిషన్ కన్నేసింది. చివరకు వేటు వేసింది.
పెద్దిరెడ్డికి జీ హుజూర్
చిత్తూరు జిల్లా ఎస్పీగా రెండు నెలల క్రితమే నియమితులైన పల్లె జాషువా వైసీపీ కండువా కప్పుకోవడమే తక్కువ అన్నట్లు పనిచేశారని చెబుతారు. తన బ్యాచ్‌మేట్ పరమేశ్వర్ రెడ్డితో ఉన్న స్నేహం వైసీపీ ప్రభుత్వంలో జాషువాకు బాగా కలిసొచ్చింది. ఐపీఎస్ వచ్చిన వెంటనే విజయవాడ శాంతి భద్రతల డీసీపీగా పోస్టింగ్ తెచ్చుకున్న ఆయన ఇక్కడి వైసీపీ నేతలు ఏది చెప్పినా కాదనకుండా చేసేవారనే ఆరోపణ ఉంది. దీంతో కొన్ని నెలల్లోనే కృష్ణా జిల్లా ఎస్పీగా పోస్టింగ్ తెచ్చుకుని తన కారులోనే వైసీపీ నేతలు, వారి కుమారుల్ని సైతం కూర్చోబెట్టుకుని బహిరంగంగా తిరిగేవారు. ఆయన పనితీరుపై వస్తున్న ఆరోపణలతో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పలుమార్లు టెలి కాన్ఫరెన్స్‌లో సైతం హెచ్చరించారని ఇతర ఐపీఎ్‌సలు చర్చించుకొనేవారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్టకు వచ్చినప్పుడు గన్నవరం విమానాశ్రయంలో కాంగ్రెస్ శ్రేణులు నల్ల బెలూన్లు గాల్లోకి ఎగురవేసి నిరసన తెలిపాయి. అప్పట్లోనే కేంద్ర నిఘా వర్గాలు నివేదిక కోరడంతో జాషువాపై వేటు పడుతుందని అనుకున్నారు. గతంలో చిత్తూరు జిల్లాలో డీఎస్పీగా పనిచేసిన జాషువాకు వైసీపీ కీలక నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మంచి సాన్నిహిత్యం ఉంది. కుప్పంలో ఎలాగైనా చంద్రబాబును ఓడించాలని సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించే బాధ్యత జగన్ ఈ ఎన్నికల్లో పెద్దిరెడ్డికి అప్పగించారు. తమ లక్ష్యం నెరవేరాలంటే జిల్లాలో ఏకపక్షంగా పనిచేసే వారిని ఎస్పీగా నియమించాలని అనుకున్నారు. జాషువాను మించిన వారెవరూ లేరంటూ జనవరి చివరి వారంలో ఆయనను చిత్తూరు జిల్లాకు తెచ్చిపెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో కాస్త గట్టిగా పని చేద్దామనుకున్న అక్కడి సీఐలు, ఎస్‌ఐలను క్రిమినల్స్ కన్నా హీనమైన భాషలో తిడుతూ పట్టు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అన్నీ గమనించిన ఎన్నికల కమిషన్... పాలకులకు నీ దండాలు.. సిబ్బందికి నీ బూతులు చాల్లే ఎన్నికలు ముగిసే దాకా దూరంగా ఉండు అంటూ పక్కన పెట్టేసింది.
‘తిరుపతి బంధా’నికి బ్రేక్
రాయలసీమకు చెందిన పరమేశ్వర్‌రెడ్డి 2010 గ్రూప్ వన్ ద్వారా డీఎస్పీ అయ్యారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. జగన్ కుటుంబానికి దగ్గరగా ఉండే పరమేశ్వర్ రెడ్డికి ఐపీఎస్ వచ్చిన వెంటనే రాష్ట్రంలోనే పెద్దదైన తిరుపతి జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. అయితే అక్కడ పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ పాల్పడిన అక్రమాలు, అరాచకాలు ఎన్నికల కమిషన్‌ను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. అటువంటి అరాచకాలకు పాల్పడిన వారిపై నమోదైన కేసులు పరమేశ్వర్‌రెడ్డి ఎస్పీగా ఉన్నప్పుడు క్లోజ్ అయ్యాయి. అవి రాజకీయ పరమైన కేసులు కావడమూ, కనీస సమాచారం బయటికి ఇవ్వకుండా ఎఫ్‌ఐఆర్ మూసేయడంతో ఈసీ సీరియస్ అయింది. బాధ్యులైన పోలీసులపై కేసులు నమోదు చేయించి పరమేశ్వర్ రెడ్డిపై చర్యకు సిఫారసు చేసింది. దీంతో అప్రమత్తమైన జగన్ ప్రభుత్వం ప్రకాశం జిల్లా ఎస్పీగా ఆయనను నియమించింది. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీగా గెలిపించే బాధ్యత పరమేశ్వర్ రెడ్డికి అప్పగించారు. తిరుపతి బంధం కావడంతో అంతా సజావుగా జరుగుతుందని వైసీపీ పెద్దలు భావించారు. అందుకు అనుగుణంగానే ఎన్నికల షెడ్యూల్ వెలువడిన రెండు రోజులకే ప్రతిపక్ష టీడీపీకి చెందిన కీలక కార్యకర్త హత్య జరిగింది. దీన్ని సీరియ్‌సగా తీసుకున్న ఎన్నికల కమిషన్.... పరమేశ్వర్‌రెడ్డిని పిలిచి గట్టిగా హెచ్చరించింది,. అప్పటికే ప్రధాని పల్నాడు పర్యటన సందర్భంగా ట్రాఫిక్ పర్యవేక్షణ బాఽధ్యతలు సరిగా నిర్వర్తించలేదన్న నివేదిక ఉండటంతో ఈసీ వేటు పడింది.
పల్నాడులో వైసీపీ చేతికి లాఠీ
ఫ్యాక్షన్ గొడవల ప్రాంతమైన పల్నాడులో అధికార వైసీపీ నేతల అరాచకాలు, భూకబ్జాలు, అక్రమాలకు ఆ జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి అండ ఉందని అక్కడ ప్రతినోటా వినిపిస్తుంది. వైసీపీ కేడర్ సైతం ‘జిల్లా ఎస్పీ మా వాడు.. మిమ్మల్ని తన్నినా, చంపినా మాపై కేసు ఉండదు..’ అంటూ దర్జాగా దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. ప్రతిపక్ష టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి మాచర్లలో టీడీపీ కార్యాలయం ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లగా వైసీపీ మూకలు అడ్డుకున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పేందుకే జనంలోకి కరపత్రాలతో వెళుతున్నాం తప్ప తాము ఎవ్వరినీ రెచ్చగొట్టేందుకు కాదని చెప్పినా వినిపించుకోకుండా వైసీపీ మూకలు దాడులు చేశాయి. టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల్ని తరిమి తరిమి కొడుతూ ఇళ్లల్లోకి దూరి మహిళలపైనా దౌర్జన్యాలు చేశాయి. టీడీపీ కార్యాలయాన్ని తగుల బెట్టి విధ్వంసం సృష్టించి బిహార్ కన్నా ఎక్కువ హింసను చూపించాయి. అయినా సరే రెచ్చగొట్టారంటూ టీడీపీ శ్రేణులపై ఏకంగా హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకు పంపిన ఘనత రవిశంకర్ రెడ్డిదే. అంతకు ముందే టీడీపీ నాయకుడు తోట చంద్రయ్య హత్య ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆ ప్రాంతంలోని వైసీపీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి చేసే భూ కబ్జాలకు, ఇసుక దందాలకు, మైనింగ్ దోపిడీకి, ఇతర అక్రమాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారనే పేరు ఎస్పీ రవిశంకర్ రెడ్డికి ఉంది. ఇవన్నీ ఒక ఎత్తయితే కుల సంఘం తరపున రెడ్లు ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా ఆయన హాజరవుతారు. పల్నాడు ప్రాంతంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తులు ఈసీ భరోసాతో ఇటీవలే తిరిగి వస్తున్నారంటే పల్నాడులో ఎంత అరాచకం ఉందో చెప్పక్కర్లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోదీ పల్నాడు పర్యటనకు వచ్చినప్పుడు భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. చిలకలూరిపేట సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా, మధ్యలో వచ్చి స్వయంగా మోదీ మైకు అందుకుని ’పోలీసులు మీ రేమి చేస్తున్నారు.. వాళ్లను దించండి.. అక్కడ కరెంట్ ఉంది’ అంటూ సూచించడం చర్చనీయాంశమైంది. ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభా నిర్వాహకులను అడ్డుకోవడం, మైకు ఆగిపోతున్నా జనాన్ని అదుపు చేయకపోవడం, ఆఖరికి సభకు వచ్చే వాహనాలను సైతం ట్రాఫిక్ నుంచి మళ్లించక పోవడం లాంటివి రవిశంకర్ రెడ్డిపై వేటుకు కారణాలుగా చెబుతున్నారు. కాగా, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు తన పరిధిలోని పోలీసు అధికారులతో సమర్ధవంతంగా పని చేయించడంలో విఫలమయ్యారు. మంచితనం ఉన్న ఆయన, పోలీసు అధికారిగా పనితీరు కనబరిస్తేనే ఫలితం ఉంటుంది తప్ప సౌమ్యం అన్నింటా కుదరదు. ముఖ్యంగా వైసీపీ అరాచక పాలనలో అలాంటి ప్రవర్తన ఏమాత్రం సాధ్యం కాదని అర్థం చేసుకోలేకపోవడమే ఆయన బదిలీకి ప్రధాన కారణమని ఐపీఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని సభకు భద్రతాఏర్పాట్ల పర్యవేక్షణలో వైఫల్యం చెందారనే అపవాదు మూటగట్టుకున్నారు.
వైసీపీ అడ్డాగా ఎస్పీ నివాసం..!
సుమారు ఏడాది క్రితం తిరుమలేశ్వరరెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. మొదటి నుంచీ ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే, ఎస్పీ బదిలీకి ప్రధాన కారణం ప్రధానమంత్రి సభలో వైఫల్యమేనని ఉన్నతవర్గాలు చెబుతున్నాయి. తిరుమలేశ్వరరెడ్డి మామ దుగ్గిరెడ్డి గురువారెడ్డి వైసీపీ నాయకుడు. దానివల్ల కూడా ఆయనను బదిలీ చేసినట్టు భావిస్తున్నారు. దీనిపై మూడు రోజుల క్రితమే రాష్ట్ర టీడీపీ నేతలు.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తిరుమలేశ్వరరెడ్డి మామ వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని, వైసీపీ నాయకులు ఎస్పీ ఇంటికి రాకపోకలు సాగిస్తూ లాబీయింగ్ చేస్తున్నారని తమ ఫిర్యాదులో తెలిపారు. ఫలితంగానే ఆయనను బదిలీ చేసినట్టు భావిస్తున్నారు.
ఈసీ నిఘా ఉందని తెలిసినా తిరుపతి కలెక్టర్ లక్ష్మీశ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన ఈ ఏడాది జనవరి 28న కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అదేరోజు స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని కలుసుకోవడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదం అయింది. తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా వైసీపీ తరఫున భూమన తనయుడు బరిలో ఉన్న సంగతి తెలిసిందే.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి
Updated Date - Apr 03 , 2024 | 08:05 AM