విశాఖ డ్రగ్స్ కేసులో అంతర్జాతీయ ముఠాలు!
ABN, Publish Date - Mar 24 , 2024 | 03:44 AM
విశాఖపట్నం డ్రగ్స్ కేసులో అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉందని సీబీఐ అనుమానిస్తోంది.
డ్రగ్స్‌ను గుర్తించకుండా ఇతర పదార్థాలతో కలిపి రవాణా
గమ్యస్థానం చేరాక విడదీసే ప్రక్రియ
ఆ కోణంలో సీబీఐ విచారణ
బ్రెజిల్ నుంచి వచ్చిన కంటెయినర్‌లోని
ఇన్ యాక్టివ్ ఈస్ట్‌లో కొకైన్
ప్రతి కిలోకు 100 గ్రాములు మిక్సింగ్?
ఈ లెక్కన 25 వేల కిలోల ఈస్ట్‌లో
2,500 కిలోల డ్రగ్స్ సరఫరా!
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం డ్రగ్స్ కేసులో అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉందని సీబీఐ అనుమానిస్తోంది. ఇంటర్‌పోల్ నుంచి అందిన సమాచారం ప్రకారం నార్కోటిక్ డ్రగ్స్‌ను ఇతర పదార్థాలతో కలిపి రవాణా చేసే నెట్‌వర్క్ ఇందులో భాగస్వామ్యమైందని సీబీఐ చెబుతోంది. బ్రెజిల్ నుంచి ఇన్ యాక్టివ్ (డ్రై) ఈస్ట్ పేరుతో విశాఖపట్నం బయలుదేరిన కంటెయినర్‌లో డ్రగ్స్ వస్తున్నాయన్న సమాచారంతో సీబీఐ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ నేరుగా కాకుండా... ఇతర పదార్థాలతో కలిపి (కటింగ్ ఏజెంట్స్) దిగుమతి అవుతున్నట్టు ఇంటర్‌పోల్ పేర్కొనడంతో ఆ కోణంలో విచారణ చేపట్టింది.
కటింగ్ ఏజెంట్స్ అంటే..
డ్రగ్స్ లావాదేవీలు నిర్వహించే ముఠాలు ‘కటింగ్ ఏజెంట్స్’ అనే పదాన్ని విస్తృతంగా ఉపయోగిస్తాయి. కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్‌లో కల్తీ పదార్థాలు కలిపి.. తక్కువ మొత్తంలో తీసుకుంటే ఎక్కువ మత్తు కలిగేలా చేస్తారు. ఇలా కలిపే కల్తీ పదార్థాలను కటింగ్ ఏజెంట్స్‌గా వ్యవహరిస్తారు. దీనివల్ల భారీ లాభాలు వస్తాయి. వాటిని తీసుకునే వారి ఆరోగ్యం త్వరగా పాడైపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే డ్రగ్స్‌ను కల్తీ చేయడం. అలాగే ఈ డ్రగ్స్‌ను సులువుగా రవాణా చేయడానికి, అధికారుల కళ్లు కప్పడానికి వేరే పదార్థాలతో కలిపేస్తారు. గమ్యస్థానం చేరిన తరువాత ప్రత్యేక విధానంలో వాటిని వేరు చేసి తీసుకుంటారు. ఈ విధంగానే తాజాగా బ్రెజిల్ నుంచి విశాఖకు డ్రగ్స్ భారీ మొత్తంలో వచ్చాయి. ఈస్ట్ అనేది తేమతో కూడిన పులుపు పదార్థం. తేమతో ఉన్నప్పుడు యాక్టివ్ ఈస్ట్ అంటారు. కొంత ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే పొడిరూపం (గ్రాన్యువల్)లోకి మారిపోతుంది. దానిని ‘ఇన్ యాక్టివ్’ లేదా ‘డ్రై ఈస్ట్’ అని అంటారు. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టర్స్ కంపెనీ ఇన్ యాక్టివ్ (డ్రై) ఈస్ట్ కావాలని ఆర్డర్ చేసింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది. గ్రాన్యువల్ రూపంలో ఉన్న ఇన్ యాక్టివ్ ఈస్ట్‌లో కొకైన్ తదితర డ్రగ్స్‌ను కలిపి ప్యాకింగ్ చేసి విశాఖపట్నం పంపింది. ఈ సమాచారం ఇంటర్‌పోల్‌కు తెలిసింది. ఇక్కడి సీబీఐని అప్రమత్తం చేయడంతో అధికారులు ఇన్ యాక్టివ్ ఈస్ట్ అసలు రంగు బయటపెట్టారు. వేయి సంచుల్లో వచ్చిన ఈస్ట్‌ను బయటకు తీసి నార్కోటిక్ డ్రగ్స్ టెస్ట్ కిట్‌తో ప్రాథమిక పరీక్షలు చేశారు. ఇరవై శాంపిల్స్‌లో డ్రగ్స్ ఉన్నట్టు పాజిటివ్ ఫలితం వచ్చింది. ఇంకా పక్కాగా పరీక్షలు నిర్వహించి, అవి డ్రగ్సే అని నిర్ధారించుకోవడానికి ప్రత్యేక లేబొరేటరీకి పంపించారు.
కొకైన్ ఎలా మిక్స్ చేస్తారంటే..
డ్రగ్స్‌ను గుర్తించకుండా ఇతర పదార్థాలతో ఎలా మిక్స్ చేస్తారని ఆంధ్ర విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ను అడగగా కొన్ని విషయాలు వెల్లడించారు. కిలో బరువున్న ఇన్ యాక్టివ్ ఈస్ట్‌లో వంద గ్రాముల కొకైన్‌ను కలిపితే గుర్తించడం కష్టమని, అది ఈస్ట్‌గానే కనిపిస్తుందన్నారు. కొకైన్‌ను మళ్లీ ఈస్ట్ నుంచి విడదీయాలంటే గోరువెచ్చటి నీటిలో సోడియం హైడ్రోక్లోరైడ్ కలిపి, ఆ ద్రావణంలో ఈ మిక్స్‌డ్ పౌడర్ వేసి తిప్పితే ఈస్ట్ అంతా కిందికి వెళ్లిపోయి కొకైన్ గుండ్రటి గడ్డలుగా పైకి తేలుతుందని వివరించారు. ఇలాంటివి మోతాదుకు మించి మిక్స్ చేస్తే అసలు విషయం బయటపడిపోతుందని, పరిమితంగానే చేస్తారన్నారు. అంటే.. కిలోకు 100 గ్రాములు లెక్క వేసుకుంటే, 25 వేల కిలోల ఈస్ట్‌లో 2,500 కిలోల డ్రగ్స్ వచ్చి ఉంటాయనేది అంచనా. ఈ లెక్కలు, అందులో ఏయే రకాలు ఉన్నాయనేది తెలియడానికి రెండు, మూడు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. అవి 100 శాతం ప్యూర్ మత్తు పదార్థాలా...? వాటిలో ఇంకేమైనా కల్తీ జరిగిందా? అనేది కూడా ఈ పరీక్షల్లో తేలుతుందని అంటున్నారు.
ఆ కంటెయినర్ ఇంకా అక్కడే
బ్రెజిల్ నుంచి వచ్చిన కంటెయినర్‌లో అన్ని సంచుల నుంచి శాంపిల్స్ తీసుకున్న సీబీఐ అధికారులు, మిగిలిన సరకును అందులోనే పెట్టి సీల్ వేశారు. ఆ కంటెయినర్‌ను బామర్ లారీ లాజిస్టిక్ పార్క్‌కు తరలించాలని నిర్ణయించారు. శనివారం సాయంత్రం నాటికి అది వీసీటీపీఎల్ ఆవరణలోనే ఉంది. తరలించలేదు.
డ్రగ్స్ రవాణాలో వైసీపీ పాత్ర: కనకమేడల
న్యూఢిల్లీ, మార్చి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండానే 25వేల టన్నుల డ్రగ్స్ కంటెయినర్ విశాఖకు వచ్చిందా? అని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. విశాఖకు డ్రగ్స్ రవాణాలో వైసీపీ పాత్ర ఉందని ఆరోపించారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంధ్య ఆక్వా ప్రైవేటు లిమిటెడ్ నిర్వాహకుడు కూనం వీరభద్రరావు, వైసీపీ నేత కూనం పూర్ణచంద్రరావుకు సోదరుడని తెలిపారు. పూర్ణచందర్‌రావుకు విజయసాయిరెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. వీరభద్రరావుకు అంత పెట్టుబడి పెట్టే స్థోమత లేదన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు 2022, అక్టోబరు 31న శుభాకాంక్షలు తెలుపుతూ విజయసాయిరెడ్డి ఎక్స్‌లో పోస్టు పెట్టారని, ఆ పోస్టు వెనుక మతలబేంటని రవీంద్రకుమార్ ప్రశ్నించారు.
Updated Date - Mar 24 , 2024 | 03:44 AM