AP News: విశాఖ వాతావరణ కేంద్రం గుడ్‌న్యూస్
ABN, Publish Date - Sep 06 , 2024 | 04:59 PM
నాలుగు రోజుల క్రితం కురిసిన అతి తీవ్ర వర్షాలతో ముంచెత్తిన వరదల ప్రభావంతో అతలాకుతలం అయిన ఆంధప్రదేశ్‌కు విశాఖపట్నం వాతావరణ కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీకి వాయుగుండం ముప్పు తప్పిందని వెల్లడించింది. దీంతో ఏపీ వాసులు ఊపిరి పీల్చుకున్నట్టు అయింది.
విశాఖపట్నం: నాలుగు రోజుల క్రితం కురిసిన అతి తీవ్ర వర్షాలతో ముంచెత్తిన వరదల ప్రభావంతో అతలాకుతలం అయిన ఆంధప్రదేశ్‌కు విశాఖపట్నం వాతావరణ కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీకి వాయుగుండం ముప్పు తప్పిందని వెల్లడించింది. దీంతో ఏపీ వాసులు ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. కాగా మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, ఇది ఉత్తర దిశగా పయనిస్తోందని తెలిపింది. 9వ తేదీ నాటికి ఇది ఒడిశా- పశ్చిమ బెంగాల్ తీరాలకు అనుకోని వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పింది.
ఈ జిల్లాలకు వర్ష సూచన
వాయుగుండం ముప్పు తప్పినప్పటికీ రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర జిలాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. అల్లూరి, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇక రేపు (శనివారం) ఏలూరు, శ్రీకాకుళం, అల్లూరి పార్వతీపురం జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
బుడమేర గండి పడిన ప్రాంతంలో కుండపోత వర్షం..
బుడమేరుకు గండి పడిన ప్రాంతంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. అయితే వర్షం కురుస్తున్నప్పటికీ గండి పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. గండి పూడ్చుతూనే మరోవైపు నీటిని కట్టడి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మచిలీపట్నం నుంచి వచ్చిన బోట్లను బుడమేరు గండి పడిన ప్రాంతానికి తరలించారు. తాత్కాలికంగా రేకుల ద్వారా వరద నీటికి అడ్డుకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు గండి పడిన ప్రాంతానికి పెద్ద స్థాయిలో మిలిటరీ అధికారులు చేరుకున్నారు. 6వ మద్రాస్ మిలిటరీ బెటాలియన్ నుంచి వచ్చిన 120 మంది అధికారులు, జవాన్లు వచ్చారు. మరికొద్ది సేపట్లోనే మిలిటరీ ఆధ్వర్యంలో గండి పూడ్చివేత కార్యక్రమం మొదలుకానుంది. తాత్కాలికంగా రాడ్డులతో వంతెనల్లాగా నిర్మాణం చేసి దాంట్లో రాళ్లు వేసి పూడుస్తామని మిలిటరీ అధికారులు చెబుతున్నారు. ప్రణాళికలో భాగంగా మరి కొద్ది సేపట్లో బుడమేరు గండి పడిన ప్రాంతానికి మిలిటరీ అధికారుల సామాగ్రి చేరనుంది.
Updated Date - Sep 06 , 2024 | 05:05 PM