ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

15 మాస్టర్‌ ప్లాన్‌ రహదారులు అభివృద్ధి

ABN, Publish Date - Nov 15 , 2024 | 01:18 AM

జిల్లాలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్‌కు అనుగుణంగా రహదారులను అభివృద్ధి చేయాలని విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ప్రణాళిక సిద్ధం చేసింది.

  • జీవీఎంసీతో కలిసి వీఎంఆర్‌డీఏ ప్రణాళిక

  • మొత్తం 87.54 కిలోమీటర్లు

  • రూ.403.67 కోట్ల వ్యయం

  • బీచ్‌రోడ్డు 210 అడుగులు, బీఆర్‌టీఎస్‌ 150 అడుగులు

  • మరికొన్ని 60 అడుగుల నుంచి 100 అడుగుల వెడల్పున విస్తరణ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్‌కు అనుగుణంగా రహదారులను అభివృద్ధి చేయాలని విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ప్రణాళిక సిద్ధం చేసింది. మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా మొత్తం 15 రహదారులను జీవీఎంసీతో కలిసి విస్తరించాలని నిర్ణయించింది. జాతీయ రహదారిపై ఒత్తిడి తగ్గించేందుకు భీమిలి బీచ్‌ రోడ్డును కలిపేలా కొన్ని రహదారులను, ఎన్‌ఏడీ వద్ద రద్దీ తగ్గించేందుకు అడవివరం నుంచి శొంఠ్యాం మీదుగా మరో రహదారి...ఇలా అవసరమైన మార్గాలను గుర్తించింది.

పెందుర్తి, ఆనందపురం, భీమిలి, డెంకాడ, విజయనగరం ప్రాంతాలను కలుపుతూ విస్తరించే ఈ 15 రహదారులకు రూ.403.67 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. వీటిలో కొన్ని రహదారులు పంచాయతీరాజ్‌, మరికొన్ని ఆర్‌ అండ్‌ బి, ఇంకొన్ని జీవీఎంసీ నిర్వహణలో ఉన్నాయి. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ మాస్టర్‌ ప్లాన్‌ రహదారులు నిర్మించనున్నారు. జాతీయ రహదారి, భీమిలి బీచ్‌ కారిడార్‌ 210 అడుగులు, బీఆర్‌టీఎస్‌ మార్గం 150 అడుగులకు విస్తరించి, మిగిలిన వాటిని రద్దీకి అనుగుణంగా 60 అడుగుల నుంచి 100 అడుగులకు అభివృద్ధి చేస్తారు.

- భీమిలి మండలం చిప్పాడ నుంచి విజయనగరం జిల్లాలో పోలిపిల్లి వరకూ 6.32 కి.మీ. పొడవున 80 అడుగుల రహదారి వేస్తారు. దీనికి రూ.37.92 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.

- జీవీఎంసీ 18వ వార్డులో శివశక్తి నగర్‌ నుంచి వుడా హరిత ప్రాజెక్టు వరకూ 1.7 కి.మీ. రహదారిని 60 నుంచి 80 అడుగుల మేర విస్తరించేందుకు రూ.7.65 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

- పరదేశిపాలెం నుంచి గంభీరం వరకు 1.4 కి.మీ. పొడవున 60 అడుగుల రహదారి నిర్మాణానికి రూ.5.04 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

- అడవివరం బీఆర్‌టీఎస్‌ జంక్షన్‌ (శొంఠ్యాం రహదారి) నుంచి గండిగుండం వరకూ 8 కి.మీ. పొడవున 180 అడుగుల రహదారి వేయడానికి రూ.40 కోట్లు అవసరమని అంచనా వేశారు.

- నేరెళ్లవలస నుంచి దొరతోట మీదుగా కొత్తవలసకు 80 అడుగుల వెడల్పున 4 కి.మీ. రహదారికి రూ.24 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.

- తగరపువలస నుంచి మూలకుద్దు వరకూ ప్రస్తుతం ఉన్న 3.6 కిలోమీటర్ల రహదారిని 150 అడుగులకు విస్తరించడానికి రూ.18 కోట్లు అవసరమని నిర్ణయించారు.

- మూలకుద్దు బీచ్‌రోడ్డు నుంచి నేరెళ్లవలస వరకూ 5.52 కి.మీ. రహదారిని 210 అడుగుల మేర విస్తరించడానికి రూ.33.12 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.

- పినగాడి జంక్షన్‌ నుంచి వేపగుంట జంక్షన్‌ వరకూ ప్రస్తుతం ఉన్న రహదారి (7.25 కి.మీ)ని 150 అడుగులకు విస్తరించడానికి రూ.36.25 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు.

- వేపగుంట నుంచి జుత్తాడ వరకు 80 అడుగుల వెడల్పున 6.05 కి.మీ. రహదారి నిర్మించడానికి రూ.36.3 కోట్లు వెచ్చిస్తారు.

- ఆనందపురం మండలం వెల్లంకిలో దొరతోట రోడ్‌ జంక్షన్‌ నుంచి కుమ్మరిపాలెం వరకు ఉన్న రహదారిని 180 అడుగులకు 6.20 కి.మీ. మేర విస్తరిస్తారు. దీనికి రూ.31 కోట్లు అవసరం అవుతాయని అంచనా.

- పరదేశిపాలెంలో బోయపాలెం జంక్షన్‌ నుంచి కాపులుప్పాడ మంగమారిపేట జంక్షన్‌ వరకు ప్రస్తుతం ఉన్న రహదారిని 100 అడుగులకు విస్తరించడానికి రూ.15 కోట్లతో అంచనాలు రూపొందించారు.

- జాతీయ రహదారిపై గండిగుండం నుంచి విజయనగరం జిల్లా చింతలపాలెం (అరకు రోడ్డు) వరకూ ప్రస్తుతం ఉన్న రహదారిని 80 అడుగులకు విస్తరించడానికి 6.4 కి.మీ.కు రూ.40.09 కోట్లు ఖర్చు చేయనున్నారు.

- భోగాపురం మండలం మోపాడ నుంచి సవరవల్లి వరకూ 100 అడుగుల మేర 6.3 కి.మీ. రహదారి నిర్మాణానికి రూ.37.8 కోట్లు ఖర్చు చేస్తారు.

- విజయనగరం జిల్లా బొడ్డవలసలో అయినాడ జంక్షన్‌ నుంచి విజయనగరం రింగ్‌ రోడ్డు ఐస్‌ ఫ్యాక్టరీ జంక్షన్‌ వరకు ప్రస్తుతం ఉన్న రహదారిని 80 అడుగులకు విస్తరించడానికి రూ.32.5 కోట్లు అవసరమని అంచనా వేశారు.

ప్రాధాన్యం ప్రకారం పనులు

భవానీ శంకర్‌, సీఈ, వీఎంఆర్‌డీఏ

భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే జాతీయ రహదారి, భీమిలి బీచ్‌ కారిడార్‌లో పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశాం. వీటిని దశల వారీగా జీవీఎంసీతో కలిసి నిర్మిస్తాం. అన్ని శాఖ సహకారం తీసుకుంటాం.

Updated Date - Nov 15 , 2024 | 01:18 AM