టీచర్ ఎమ్మెల్సీ ఓటుకు 17,404 దరఖాస్తులు
ABN, Publish Date - Nov 18 , 2024 | 12:40 AM
వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరుగా నమోదుకు తొలి విడతలో 17,404 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు.
అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 4,464
తక్కువగా అల్లూరి జిల్లాలో 1,749
23 నుంచి అభ్యంతరాల స్వీకరణ
అదే రోజు నుంచీ మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం
విశాఖపట్నం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి):
వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరుగా నమోదుకు తొలి విడతలో 17,404 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 4,464 మంది దరఖాస్తుచేయగా, అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి 1,749 మంది మాత్రమే దరఖాస్తు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఉపాధ్యాయులు ఈ ఏడాది సెప్టెంబరు 30వ తేదీ నుంచి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈనెల ఆరోతేదీ వరకు గడువు విధించింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల నుంచి ఆఫ్‌లైన్‌లో 12,602 మంది, ఆన్‌లైన్‌లో 4,802 మంది మొత్తం 17,404 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఆన్‌లైన్‌లో 2,072 మంది, ఆఫ్‌లైన్‌లో 2,392 మంది వెరసి 4,464, విజయనగరం జిల్లాలో ఆన్‌లైన్‌లో 555 మంది, ఆఫ్‌లైన్‌లో 3,273తో వెరసి 3,828 మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో ఆన్‌లైన్‌లో 340 మంది, ఆఫ్‌లైన్‌లో 1,796 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆన్‌లైన్‌లో 212 మంది, ఆఫ్‌లైన్‌లో 1537 మంది, విశాఖపట్నం జిల్లాలో ఆన్‌లైన్‌లో 1252 మంది, ఆఫ్‌లైన్‌లో 2,093 మంది, అనకాపల్లి జిల్లాలో ఆన్‌లైన్‌లో 371 మంది, ఆఫ్‌లైన్‌లో 1511 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఓటర్ల ముసాయిదా జాబితాను ఈ నెల 23న విడుదల చేస్తారు. అనంతరం అభ్యంతరాలను స్వీకరిస్తారు. కాగా ఇంతవరకు దరఖాస్తుచేయని టీచర్లు అదే రోజు నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
Updated Date - Nov 18 , 2024 | 12:40 AM