ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉక్కుకు రూ.500 కోట్లు

ABN, Publish Date - Sep 20 , 2024 | 01:11 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటుకు తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేస్తున్నట్టు గురువారం ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

చట్టబద్ధమైన చెల్లింపులకే వాడాలంటూ నిబంధన

ఇతరాలకు ఖర్చు చేస్తే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిక

ఆ మొత్తంలో సగం జీఎసీటీ బకాయిల చెల్లింపులకే...

కేంద్రం తీరు ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో తీసుకున్నట్టుందంటూ ఉద్యోగుల విమర్శ

పూర్తిస్థాయి ఉత్పత్తికి ముడి పదార్థాలు ఇవ్వాలి...లేనిపక్షంలో సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటుకు తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేస్తున్నట్టు గురువారం ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఈ నిధులను చట్టబద్ధమైన చెల్లింపులకే ఉపయోగించాలని, దుర్వినియోగం చేస్తే చర్యలు చేపడతామని స్పష్టంచేసింది. చట్టబద్ధమైన చెల్లింపులు అంటే ఏమిటో కూడా మంత్రిత్వ శాఖే నిర్వచించింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్‌టీ, ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌కు ఇవ్వాల్సిన మొత్తాలు, వెండర్‌ (విక్రేత) చెల్లింపులకు మాత్రమే ఈ నిధులు వినియోగించాలని పేర్కొంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు ఈ చెల్లింపుల బాధ్యత అప్పగించింది. ఉక్కు యాజమాన్యం, ఎస్‌బీఐ రెండూ చెల్లింపుల విషయంలో నిబంధనలు పాటించాలని సూచించింది.

ఏమేమి ఉన్నాయంటే..?

కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ సాయం ఈ చేతితో ఇచ్చి ఆ చేతితో తీసుకున్నట్టుగా ఉందని ఉక్కు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జీఎస్‌టీ బకాయిలు రూ.230 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చే రూ.500 కోట్లలో సగం జీఎస్‌టీకే పోతాయి. ఇక ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌కు నిధులు జమ చేయకపోతే కోర్టులో కేసుల వల్ల తల దించుకోవలసి వస్తుంది. అందుకని దానికి కొంత చెల్లించాల్సి ఉంది. విద్యుత్‌ బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి. వాటికి కడితే ఇక చేతిలో రూ.100 కోట్ల కంటే ఎక్కువ మిగలవు.

ముడి పదార్థాలు ఇవ్వండి చాలు

స్టీల్‌ప్లాంటును పూర్తి సామర్థ్యంతో నడపడానికి తాము నిధులు కోరడం లేదని, ముడి పదార్థాలు బొగ్గు, ఐరన్‌ ఓర్‌ సరఫరా చేయాల్సిందిగా అడుగుతున్నామని, లేదంటే సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తున్నామని..వీటిని కేంద్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని ఉద్యోగ, కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇలా రూ.500 కోట్లు, రూ.వేయి కోట్లు ఇస్తే ఏ మూలకు సరిపోవని అంటున్నారు. ఆస్ట్రేలియా నుంచి లక్ష టన్నుల బొగ్గును నౌకలో తెప్పించుకోవాలంటే... రూ.500 కోట్లు అవసరమని, ఇప్పుడు మంత్రిత్వ శాఖ ఇచ్చే నిధులతో ఏమీ కొనలేమని వాపోతున్నారు. రోజుకు 21 వేల టన్నుల హాట్‌ మెటల్‌ తయారు చేయగల రూ.30 వేల కోట్ల విలువైన యంత్ర పరికరాలు వృథాగా ఉన్నాయని, వాటిని నడిపించాలనే తాము కోరుతున్నామని అంటున్నారు.

ప్రైవేటు స్టీల్‌ప్లాంట్లు లాభాల్లో ఉంటే..విశాఖ స్టీల్‌ ఎందుకు నష్టాల్లో ఉందో ఆలోచించాలని మంత్రులు అంటున్నారని, గత మూడేళ్ల నుంచి ఈ స్టీల్‌ప్లాంటును ఢిల్లీ నుంచి కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖే నడుపుతోందని, ఈ మూడేళ్లలో జరిగిన దానికి వారే బాధ్యత వహించాలని, ఇక్కడి ఉద్యోగులు, కార్మికులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారని, అందుకే పోరాట బాట పట్టామని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవసరమైన ముడి పదార్థాలు ఇవ్వాలని, లేదంటే సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Sep 20 , 2024 | 01:11 AM