570 కిలోల గంజాయి స్వాధీనం
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:28 PM
మండలంలో గల జోలాపుట్టు పంచాయతీ పోలిపుట్టు సమీపంలో సోమవారం ఉదయం 570 కిలోల గంజాయిని ముంచంగిపుట్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఒకరి అరెస్టు
ముంచంగిపుట్టు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మండలంలో గల జోలాపుట్టు పంచాయతీ పోలిపుట్టు సమీపంలో సోమవారం ఉదయం 570 కిలోల గంజాయిని ముంచంగిపుట్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్టు చేయగా, పరారైన మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించి ఎస్‌ఐ జె.రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ముందస్తు సమాచార మేరకు పోలిపుట్టు జంక్షన్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఒడిశా వైపు నుంచి వ్యాన్‌లో వస్తున్న వ్యక్తులు పోలీసులను చూసి వాహనాన్ని ఆపి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా ఒకరిని పట్టుకున్నారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో గంజాయి బస్తాలు ఉన్నట్టు గుర్తించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో తూకం వేయగా 570 కిలోల గంజాయి ఉన్నట్టు నిర్ధారించారు. పట్టుబడిన నిందితుడు ఒడిశా రాష్ట్రం కోరాపుట్టు జిల్లా నందపూర్ బ్యాక్ బాల్లెల గ్రామ పంచాయతీ కేంద్రానికి చెందిన కొర్రా జగ్గుగా విచారణలో తేలింది. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - Dec 02 , 2024 | 11:28 PM