గూడు లేని విద్యా శాఖ
ABN, Publish Date - Nov 29 , 2024 | 10:39 PM
మండల విద్యా శాఖ అధికారులకు సొంత గూడు లేకుండా పోయింది. విద్యాశాఖ కార్యాలయం ఐదేళ్ల క్రితం శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు వినియోగించడం లేదు. ప్రస్తుతం భవిత కేంద్రంలోని అతి చిన్న గదిలో విద్యా శాఖ కార్యాలయాన్ని నిర్వహిస్తూ అవస్థలు పడుతున్నారు.
శిథిలమైన కార్యాలయం
భవిత కేంద్రంలో చిన్న గదిలో కార్యకలాపాలు
ఇద్దరు ఎంఈవోలు అక్కడే విధుల నిర్వహణ
ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోని వైనం
చింతపల్లి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మండల విద్యా శాఖ అధికారులకు సొంత గూడు లేకుండా పోయింది. విద్యాశాఖ కార్యాలయం ఐదేళ్ల క్రితం శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు వినియోగించడం లేదు. ప్రస్తుతం భవిత కేంద్రంలోని అతి చిన్న గదిలో విద్యా శాఖ కార్యాలయాన్ని నిర్వహిస్తూ అవస్థలు పడుతున్నారు.
చింతపల్లి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సుమారు 40 ఏళ్ల క్రితం మండల విద్యా శాఖ కార్యాలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో వినియోగించడం లేదు. విద్యాశాఖ అధికారి కోసం ప్రత్యామ్నాయ భవనాలు అందుబాటులో లేవు. గతంలో మండలానికి ఒక ఎంఈవో ఉండేవారు. ప్రస్తుతం ఇద్దరు ఎంఈవోలను ప్రభుత్వం నియమించింది. అయితే విద్యా శాఖ అధికారుల విధులు నిర్వహణకు కనీస సదుపాయాలు కల్పించడంలో గత పాలకులు, అధికారులు విఫలమయ్యారు. మండల కేంద్రంలో శిథిలావస్థకు చేరుకున్న విద్యా శాఖ కార్యాలయాన్ని మరమ్మతులు చేపట్టేందుకు సైతం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. నూతన భవనం నిర్మాణం ఊసే లేదు. కనీసం మండలంలోనున్న ప్రత్యామ్నాయ ప్రభుత్వ భవనాలు విద్యా శాఖ కార్యాలయం నిర్వహణకు కేటాయించలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరు ఎంఈవోలు భవిత కేంద్రంలోని ఒక చిన్నగదిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు, పాలకులు స్పందిచం శిథిలావస్థకు చేరుకున్న విద్యా శాఖ భవనాన్ని మరమ్మతులు చేపట్టడంగాని, ప్రత్యామ్నాయ భవనాలు కేటాయించడంగాని చేయాలని మండల ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - Nov 29 , 2024 | 10:39 PM