పల్లెల్లో అభివృద్ధి పండుగ
ABN, Publish Date - Nov 20 , 2024 | 12:50 AM
పల్లెల్లో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ఐదేళ్లపాటు అభివృద్ధి జాడలేని గ్రామాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు వర్షం కురిస్తే అడుగు తీసి అడుగు వేయడానికి వీలుకాని విధంగా వున్న రహదారులు ఇప్పుడు సిమెంట్ కాంక్రీట్‌తో ముస్తాబవుతున్నాయి. ఉపాధి హామీ పథకం నిధులతో ప్రస్తుతం అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు ముమ్మంగా జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో ఉపాధి నిధులతో పనులు చేపడితే బిల్లులు వస్తాయో, లేదో అన్న అనుమానంతో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేవారు కాదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధుల కేటాయింపుతోపాటు, ఉపాధి హామీ నిధులతో చేపట్టే పనులకు వెంటనే బిల్లులు మంజూరవుతుండడంతో పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు, స్థానిక నాయకులు పోటీ పడుతున్నారు.
శరవేగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం
పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు పోటీ
గత ప్రభుత్వ హయానికి భిన్నంగా పరిస్థితి
డిసెంబరు చివరినాటికి పనులు పూర్తి
సంక్రాంతి పండుగ సమయంలో ప్రారంభోత్సవాలు
చోడవరం నియోజకవర్గంలో రూ.20.21 కోట్లు అభివృద్ధి పనులు
చోడవరం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ఐదేళ్లపాటు అభివృద్ధి జాడలేని గ్రామాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు వర్షం కురిస్తే అడుగు తీసి అడుగు వేయడానికి వీలుకాని విధంగా వున్న రహదారులు ఇప్పుడు సిమెంట్ కాంక్రీట్‌తో ముస్తాబవుతున్నాయి. ఉపాధి హామీ పథకం నిధులతో ప్రస్తుతం అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు ముమ్మంగా జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో ఉపాధి నిధులతో పనులు చేపడితే బిల్లులు వస్తాయో, లేదో అన్న అనుమానంతో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేవారు కాదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధుల కేటాయింపుతోపాటు, ఉపాధి హామీ నిధులతో చేపట్టే పనులకు వెంటనే బిల్లులు మంజూరవుతుండడంతో పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు, స్థానిక నాయకులు పోటీ పడుతున్నారు. దీంతో ఏ పని, ఎవరికి కేటాయించాలో తేల్చుకోలేని పరిస్థితిలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు వున్నారు.
చోడవరం అసెంబీ నియోజకవర్గానికి ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ కింద తొలివిడత రూ.20.21 కోట్లు మంజూరయ్యాయి. వీటితో 190 సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు చేపట్టారు. రోలుగుంట మండలంలో రూ.5 కోట్ల 3 లక్షలతో 15 పనులు, రావికమతంలో రూ.3 కోట్ల 24 లక్షలతో 32 పనులు, బుచ్చెయ్యపేట మండలంలో రూ.73 లక్షలతో 7 పనులు, చోడవరం మండలంలో రూ.11 కోట్ల 21 లక్షలతో 136 పనులు చేస్తున్నారు. అన్ని మండలాల్లో పనులు ప్రారంభం కావడం, ఇసుక అందుబాటులో వుండడంతో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి.
నాణ్యతలోపిస్తే...
ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టే పనుల నాణ్యత విషయంలో గతంలో పెద్దగా పట్టింపులు ఉండేవి కావు. దీంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించి కొద్ది రోజులకే నాణ్యత లోపాటు బయటపడేవి. గత ప్రభుత్వ హయాంలో ఇదే విధంగా పనులు జరిగాయి. కానీ కూటమి ప్రభుత్వం.. ఉపాధి నిధులతో చేపట్టే ఇంజనీరిగ్ పనుల్లో నాణ్యత లోపిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. దీంతో అధికారులు దగ్గరుండి మరీ పనులు చేయిస్తున్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడడంలేదు. ప్రతి పని వద్ద కనీసం ఇద్దరు సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వుంటున్నారు. సిమెంట్, ఇసుక, పిక్కను నిర్ణీత నిష్పత్తి ప్రకారం మిక్సింగ్ చేసేలా చూస్తున్నారు. పూర్తయిన పనులకు కనీసం పది రోజులపాటు వాటర్ క్యూరింగ్ చేస్తున్నారు.
డిసెంబరులోగా పనులన్నీ పూర్తి
జీఎస్‌ఎస్ ప్రసాద్, డీఈ, పంచాయతీ రాజ్ సబ్‌డివిజన్, చోడవరం
చోడవరం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ డిసెంబరు నెలాఖరులోగా పూర్తిచేయిస్తాం. సంక్రాంతి పండగ సమయంలో ప్రారంభోత్సవాలు జరుగుతాయి. నాణ్యత విషయంలో నిక్కచ్చిగా ఉంటున్నాం.
మరిన్ని నిధులు తెస్తాం
కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, ఎమ్మెల్యే, చోడవరం
కూటమి ప్రభుత్వం రాజకీయాలకంటే అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తున్నది. ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకే విడుదల చేస్తున్నాం. తొలివిడత మంజూరైన నిధులతో చేపట్టిన పనులు డిసెంబరు నెలాఖరునాటికి పూర్తవుతాయి. తరువాత మరిన్నినిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. గ్రామాల్లో అవసరమైన చోటా సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మిస్తాం.
Updated Date - Nov 20 , 2024 | 12:50 AM