శారదా పీఠానికి షాక్
ABN, Publish Date - Oct 24 , 2024 | 01:22 AM
శారదా పీఠానికి రాష్ట్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. భీమునిపట్నం మండలం కొత్తవలసలో గత ప్రభుత్వం జరిపిన భూ కేటాయింపులను రద్దు చేస్తూ బుధవారం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం-భీమునిపట్నం బీచ్ రోడ్డులో కొత్తవలస వద్ద సుమారు రూ.225 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని శారదా పీఠానికి కేవలం రూ.15 లక్షలకు (ఎకరా రూ.లక్షకు) జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కట్టబెట్టింది.
కొత్తవలసలో భూ కేటాయింపు రద్దు
వందల కోట్ల రూపాయల విలువైన భూమిని
రూ.15 లక్షలకు ఇచ్చేసిన వైసీపీ ప్రభుత్వం
ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం తీసుకుని
హోటల్ నిర్మాణానికి ప్లాన్
విశాఖపట్నం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి):
శారదా పీఠానికి రాష్ట్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. భీమునిపట్నం మండలం కొత్తవలసలో గత ప్రభుత్వం జరిపిన భూ కేటాయింపులను రద్దు చేస్తూ బుధవారం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం-భీమునిపట్నం బీచ్ రోడ్డులో కొత్తవలస వద్ద సుమారు రూ.225 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని శారదా పీఠానికి కేవలం రూ.15 లక్షలకు (ఎకరా రూ.లక్షకు) జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కట్టబెట్టింది. అక్కడ ఎకరా రిజిస్ర్టేషన్ విలువే రూ.2 కోట్లు వరకూ ఉందని జిల్లా యంత్రాంగం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం చెవికెక్కించుకోలేదు. అంతేగాకుండా పీఠానికి కొండపై కేటాయించిన భూమికి వీఎంఆర్‌డీఎ రెండు కోట్ల రూపాయలతో రహదారి నిర్మాణం చేపట్టింది. ఇదిలావుండగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు విస్తరించడంతోపాటు వేద పాఠశాల నిర్వహణ ఏర్పాటుచేస్తామని చెప్పి భూమి తీసుకున్న పీఠం...దానిని వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటామని అప్పటి పాలకులకు కోరగా వెంటనే గ్రీన్‌సిగ్నల్ వచ్చేసింది. అక్కడ ఎనిమిది అంతస్థులతో బోర్డింగ్ హౌస్ పేరుతో హోటల్ నిర్మాణానికి గుట్టుచప్పుడు కాకుండా జీవో ఇచ్చేసింది. శారదా పీఠం పేరున కాకుండా ఉత్తరాధికారి పేరిట భూమిని బదలాయించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం నుంచి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇటీవల నివేదిక తెప్పించుకుంది. దానిని పరిశీలించిన అనంతరం చివరకు భూ కేటాయింపు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు రానున్నాయి.
Updated Date - Oct 24 , 2024 | 06:43 AM