ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వసతి ఓకె... ఆహారమే!

ABN, Publish Date - Nov 30 , 2024 | 01:16 AM

జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల రూపురేఖలు మారాయి. అధ్వాన పరిస్థితులు, అరకొర వసతుల మధ్య తీవ్ర ఇబ్బందులతో చదువులు సాగించాల్సిన దుస్థితి తప్పడంతో విద్యార్థుల్లో ఆనందం కనిపిస్తోంది.

  • అధ్వానంగా ఉన్న 30 హాస్టల్‌ భవనాల ఆధునికీకరణ

  • అందుబాటులోకి సురక్షిత తాగునీరు, మరుగుదొడ్లు

  • కార్పొరేట్‌ సంస్థల సీఎస్‌ఆర్‌ నిధులతో అభివృద్ధి పనులు

  • కొన్నిచోట్ల ఇప్పటికీ అమలుకాని మెనూ

  • నాణ్యమైన భోజనం అందడం లేదంటున్న విద్యార్థులు

  • ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన

విశాఖపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల రూపురేఖలు మారాయి. అధ్వాన పరిస్థితులు, అరకొర వసతుల మధ్య తీవ్ర ఇబ్బందులతో చదువులు సాగించాల్సిన దుస్థితి తప్పడంతో విద్యార్థుల్లో ఆనందం కనిపిస్తోంది. ఆధునికీకరించిన భవనాలు, సరిపడా మరుగుదొడ్లు, సురక్షిత నీరు అందుబాటులోకి రావడంతో సమస్యలు తొలగిపోయాయని చెబుతున్నారు. అయితే ఇప్పటికీ కొన్ని వసతి గృహాల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ అమలుకావడం లేదని వాపోతున్నారు. నగర పరిధిలోని పలు వసతి గృహాలను శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు సందర్శించగా, వసతులపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.

జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల రూపురేఖలు మార్చేందుకు కలెక్టర్లుగా పనిచేసినవారు యత్నించారు. ఇందులో భాగంగా పలు పరిశ్రమల యాజమాన్యాలను కలిసి విశాఖ విద్యా వసతి వికాసం పేరుతో ఆధునికీకరణ పనులకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. దీంతో కార్పొరేట్‌ సంస్థలు సామాజిక బాధ్యతగా అందించిన నిధులు, ఎంపీ ల్యాడ్స్‌, ఇతర నిధులతో హాస్టళ్ల రూపురేఖలు మార్చారు. అధ్వానస్థితికి చేరిన కొన్ని భవనాలను ఆధునికీకరించారు. శిథిలావస్థకు చేరిన వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మించారు. మెరుగైన తాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు విద్యార్థుల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు నిర్మించారు. ఇంకా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం ద్వారా పరిశుభ్ర వాతావరణం నెలకొల్పారు.

రూ.8.7 కోట్లతో పనులు

సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని 12 వసతి గృహాలకు రూ.4 కోట్లు, బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని 11 వసతి గృహాలకు రూ.4 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఒక వసతి గృహానికి రూ.70 లక్షలు వెచ్చించి మౌలిక వసతులతో పాటు ఆధునికీకరణ పనులు చేపట్టారు. దీంతో స్పష్టమైన మార్పు కనిపించింది. ఈ చర్యలతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మెనూ అమల్లో ఇబ్బందులు

ప్రస్తుతం కొన్ని వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను అమలుచేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌, రాత్రి భోజనంలో విద్యార్థులకు అందించాల్సిన ఆహార పదార్థాలతో ప్రభుత్వం మెనూ విడుదల చేసింది. ఈ మేరకు ఆహారం అందడం లేదు. చిక్కీలు, అరటిపండ్లు, రాగిజావ కొన్ని వసతిగృహాల్లో ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల వండిన ఆహారంలో నాణ్యత లేదు. దీంతో తినలేని పరిస్థితి ఎదురవుతోందని విద్యార్థులు వాపోతున్నారు.

ఫ కంచరపాలెంలోని గిరిజన సంక్షేమ శాఖకు చెందిన వసతిగృహంలో శుక్రవారం ఉదయం వడ్డించిన పెసర పప్పు పొంగలి గట్టిగా ఉండడంతో చాలామంది విద్యార్థులు తినలేదు. రాత్రిపూట వడ్డించే ఆహారంలో నాణ్యత ఉండడం లేదని, కూరలు రుచిగా ఉండడం లేదని పలువురు పేర్కొన్నారు.

ఫ సీతమ్మధారలోని విద్యార్థులకు శుక్రవారం ఉదయం పెట్టిన కిచిడీ పులిహోరను తలపించింది. ప్రతిరోజూ సాయంత్రం రాగి జావ, స్నాక్స్‌ ఇవ్వాల్సి ఉండగా అప్పుడప్పుడు ఇస్తున్నారని విద్యార్థులు తెలిపారు.

ఒకే గదిలో పది మంది..

చాలా వసతిగృహాల్లో సమస్యలు పరిష్కరించినప్పటికీ ఇంకా కొన్నింటిలో వసతి సమస్య ఎదురవుతోంది. మర్రిపాలెం జ్యోతినగర్‌లో రెండంతస్థుల ప్రైవేటు భవనంలో బీసీ సంక్షేమ శాఖ వసతిగృహం నడుస్తోంది. ఇందులో 120 మంది విద్యార్థులు ఉంటున్నారు. చిన్న గదిలో పదిమంది చొప్పున సర్దుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. కేవలం ఆరు మరుగుదొడ్లు మాత్రమే ఉండడంతో జీవీఎంసీ పబ్లిక్‌ టాయ్‌లెట్స్‌ దిక్కవుతున్నాయని చెబుతున్నారు.

చాలని చార్జీలతో ఇబ్బంది..

ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రోజుకు రూ.53 చొప్పున మెస్‌ చార్జీలు ఇస్తోంది. పెరిగిన ధరలతో భోజనం పెట్టడానికి రూ.100 ఖర్చవుతోందని, ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో మెనూ అమలుచేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి డైట్‌ బిల్లులు పెండింగ్‌లో ఉండడం కూడా ఇబ్బందిగా పరిణమించిందని, సరకులు తెచ్చుకోలేకపోతున్నామన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 01:16 AM